గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: అంకితభావం, నిబద్ధత కలిగిన ఉపాధ్యాయుల భుజ స్కంధాలపైనే ప్రభుత్వ విద్యారంగాభివృద్ధి ఆధారపడి ఉందని రాష్ట్ర అధికార భాషా సంఘ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తన తండ్రి కె. వెంకటేశ్వరరావు జ్ఞాపకార్ధం స్థాపించిన కేవీఆర్ ఎడ్యుకేషనల్‌ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన బుద్ధప్రసాద్ మాట్లాడుతూ బ్రిటీషు వారు రూపొందించిన విద్యా విధానానికి వ్యతిరేకంగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మేళవించి స్వాతం్రత్య్ర సమరయోధులు స్థాపించిన విద్యాసంస్థలు ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించాయని చెప్పారు.
ప్రస్తుత ప్రభుత్వాలు విద్యను ప్రైవేటీకరించే చర్యల్లో భాగంగా ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్లక్ష్యం చేస్తూ, విద్యా రంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందుతుంటే మనదేశం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉందని, ఇందుకు విద్య, ఆరోగ్య రంగాల్లో వెనుకబాటే కారణమన్నారు. చైనాలో మాతృభాషను పూర్తిస్థాయిలో అమలుపరుస్తూ ప్రభుత్వ విద్యాసంస్థల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, మన దేశంలో ప్రభుత్వ విద్యారంగాభివృద్ధి గురించి పట్టించుకునే తీరిక ప్రభుత్వాలకు లేకపోవడం శోచనీయమన్నారు. ఎమ్మెల్సీ బి. బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమాజానికి దూరంగా గిరిజన తండాలు, మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభివృద్ధి కోసం అహర్శిశలూ శ్రమిస్తున్న ఉపాధ్యాయులకు ప్రోత్సాహం కరువైందన్నారు.
సభాధ్యక్షుడు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రోత్సాహం, పేద విద్యార్థులకు సహాయం, విద్యారంగాభివృద్ధికి చర్చాగోష్టుల నిర్వహణ ప్రధాన అంశాలుగా 2008లో ట్రస్ట్ స్ధాపించి, యేటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈఏడాది 10 మంది ఉపాధ్యాయులను సత్కరిస్తుండగా, గత మూడేళ్లుగా 18 త్రిపుల్ ఐటీ సీట్లు సాధించిన భట్టిప్రోలు మండలంలోని ఐలవరం పాఠశాలను ఉత్తమ పాఠశాలగా ఎంపిక చేశామని చెప్పారు. పాఠశాల హెచ్‌ఎం వాసుదేవరావుతో పాటు సహచర ఉపాధ్యాయ బృందాన్ని సత్కరిస్తున్నామని తెలిపారు.
11 మందికి ప్రతిభా పురస్కారాలు
ప్రైవేటు విద్యారంగంలో చేస్తున్న కృషికి ఆర్. వీరనారాయణ, డెరైక్టర్ (వివేకా విద్యాసంస్థలు, తెనాలి), డి. రామచంద్రరావు, హెచ్‌ఎం జెడ్పీ హెచ్‌ఎస్ (మందడం-తుళ్లూరు), షేక్ నాగుల్ మీరా, హెచ్‌ఎం (జెడ్పీ హెచ్‌ఎస్, దొడ్లేరు-క్రోసూరు), సీహెచ్ నగరాజ కుమారి, హెచ్‌ఎం (పట్టాభిపురం నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల (గుంటూరు), ఉపాధ్యాయులు కె. వేణుగోపాలరావు (జెడ్పీ హెచ్‌ఎస్, మాదల-ముప్పాళ్ల), ఎ. నాగేశ్వరరావు, ఎంపీయూపీ స్కూల్ (పిచికలపాలెం-శావల్యాపురం), కె. శ్రీనివాసరాజు, జెడ్పీ హెచ్‌ఎస్ (శావల్యాపురం), ఏఎస్‌ఎస్ జగదీశ్వర రెడ్డి, జెడ్పీ హెచ్‌ఎస్ (బ్రాహ్మణపలి-పిడుగురాళ్ల), జె. బైరాగి, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం (ధూళిపాళ్ళ-సత్తెనపల్లి), బి. పరిశుద్ధరావు, ఎంపీయూపీ స్కూల్ (ఈపూరులంక-కొల్లూరు), డి. స్వర్ణలత, ఎంపీయూపీ స్కూల్ (మాడుగుల-గురజాల)తో పాటు ఉత్తమ పాఠశాలగా ఎంపికైన భట్టిప్రోలు మండలం ఐలవరం జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం వాసుదేవరావు, ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించి, జ్ఞాపిక, ప్రశంసా పత్రం బహుకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి డి. ఆంజనేయులు, ఉప విద్యాశాఖాధికారులు, పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యారంగాభివృద్ధి బాధ్యత ఉపాధ్యాయులదే
Published Wed, Dec 25 2013 2:43 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement