official language of the state association
-
ఇదీ నారా మార్కు భాషాసేవ!
నేతిబీరకాయలో ఏపాటి నెయ్యి ఉంటుందో, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుగారి మనసులోనూ ఆంధ్రభాషకు అంతపాటి విలువే ఉంటుంది. అధికారభాషాసంఘాన్ని సైతం గాలికొదిలేసిన బాబు వైనాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే చాలు. మాతృభాషపట్ల ఆయనకున్న మమకారం ఎంతటిదో ఎవరి కైనా ఇట్టే అవగతమవుతుంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు ఆంధ్రభాష అంటే అమితమైన మక్కువ. నడక, నడత, వర్తనల్లో నిలువెత్తు తెలుగుదనం ఆయనలో నిత్యమూ తొణికిసలాడుతుండేది. చేవ్రాలు సైతం తెలుగులోనే చేయాలన్న పట్టుదలతో ఆజన్మాంతం భాషాగరిమను చాటి చెప్పిన ధన్యజీవి ఎన్టీఆర్. అయితే, అంతటి మహనీయునికి తానే సిసలైన వారసుడనంటూ భుజాలు చరుచుకుని మరీ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్న చంద్రబాబు మాత్రం ఎన్నెన్నో అంశాల్లో మామ గారి స్థాయిని అస్సలు చేరుకోలేకపోయారు. అధికారభాషగా ప్రవర్థమానం కావాల్సిన తెలుగుకు తెగులు పట్టించారు. విభజిత ఆంధ్రప్రదేశ్ వాకిట 2014లో చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచీ ఆంధ్రసాహిత్యం, సంస్కృతి, భాష దిగజారిపోయాయి. నాటి ఎన్నికల ప్రణాళికలో ప్రాంతీయ భాషా వికాసానికి, స్థానీయభాషా సముద్ధరణకు పాటుపడతామని పేజీలకు పేజీలు వండివార్చిన బాబు స్కంధావారం సింహాసనం అధిరోహించగానే ఆ సంగతిని బొత్తిగా పట్టించుకోకుండా పోయింది. కనీసం అధికార భాషాసంఘాన్ని నియమించాలన్న ఇంగితమూ లోపించడం ఆంధ్రులు చేసుకున్న కల్తీలేని దురదృష్టం. ఇరుగుపొరుగు రాష్ట్రాలైన కన్నడ, తమిళ, మలయాళ సీమల్లో ఆయా స్థానీయ భాషలకు అగ్రతాంబూలం దక్కుతున్నా ఇక్కడ ఈయనకేం పట్టలేదు. ఏళ్లు గడిచిపోతుండగా, ఎవరెవరో పోరగా పోరగా, రెండేళ్ల కిందట రాష్ట్ర అధికారభాషాసంఘం అధ్యక్షునిగా అనంతపురం జిల్లాకు చెందిన అస్మదీయుడొకర్ని బాబు ప్రకటించేశారు. తీరా చూస్తే సదరు అస్మదీయులవారు ఆ పదవికి ఏ మాత్రం సరిపోరని, భాషాసాహిత్యాలకు ఆయన చేసిందేమీలేదనీ పెద్ద ఉద్యమమే మొదలైపోయింది. బాబు చేసిన ఆ నియామకాన్ని భాషాప్రేమికులందరూ అప్పట్లో కలిసికట్టుగా అడ్డుకున్నారు. అధికారభాషా సంఘాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దని వేడుకున్నారు. పత్రికల్లోనూ, ఇతర ప్రసారమాధ్యమాల్లోనూ పుంఖాను పుంఖాలుగా ప్రకటనలు విడుదలచేస్తూ నిరసనకు దిగారు. సొంతపార్టీ నుంచి సైతం బాబుకు సెగ మొదలైంది. తను చేసిన తప్పును ప్రజలు తెలిసేసుకున్నారన్న సంగతిని ఆయన గ్రహించారు. వెనువెంటనే తను ఇచ్చిన జీవోను తానే లోపాయికారీగా ఉపసంహరించుకున్నారు. ఇందుకు సంబంధించి తీసుకోబోయే నిర్ణయాలన్నింటినీ పెండింగ్‌లో పెట్టేశారు. అధికారభాషాసంఘ అధ్యక్ష స్థానాన్ని మరెవ్వరికీ అప్పగించలేదు. సభ్యులుగా కూడా ఇంకెవ్వరినీ నియమించలేదు. ఆ విధాన ఆయన పాలించిన ఆయిదేళ్లూ అధికార భాషాసంఘం అనాథగా మిగిలిపోయింది. ప్రబలిపోతున్న పాశ్చాత్యధోరణుల వల్ల, ప్రపంచీకరణ పుణ్యమాని మన సమాజంలో ప్రాంతీయభాషలు నానాటికీ నీరసిల్లిపోతున్నాయి. తీవ్రమైన పరభాషాపెత్తనానికి దడిసి తెలుగూ తిరోగమన పథమే పడుతోంది. ఇలాంటి క్లిష్టస్థితిలో అధికారభాషాసంఘమే లేకుండా నారావారు జాగ్రత్తపడటంతో మన భాష మరింతగా వన్నె తగ్గింది. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దాలంటూ భాషాప్రేమికులు ఎంతగా మొత్తుకున్నా సింగపూర్ జపంలో మునిగితేలిన బాబుకు ఇవేమీ వినిపించలేదు. తెలుగుభాషామతల్లి రోదన ఆయనను కదిలించలేదు. అంచేతనే ప్రభుత్వపరంగా భాషను పట్టించుకునే దాతాదైవం కరవైపోయారు. కొసవిరుపు : అన్నట్టు! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయిదేళ్ల కిందట పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలోనే విశాఖపట్నం వన్‌టౌన్ ప్రాంతంలోని మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు పుట్టిన ఇంటిని ప్రభుత్వం తరఫున కొనుగోలు చేస్తామని నారా చంద్రబాబునాయుడు ఘనమైన ప్రకటన విడుదల చేశారు. ఆ ఇంటిని జాతీయ తెలుగు సాహిత్య స్మారక కేంద్రంగా తయారుచేస్తామని, శ్రీశ్రీ రచనా స్ఫూర్తిని భావితరాలకు అందిస్తామని వాక్రుచ్చారు. ఈ విషయాన్ని నాడు తెలుగు దినపత్రికలు ప్రముఖంగా అచ్చువేశాయి. వాగ్దానాలు మరచిపోయే అలవాటున్న బాబు అనంతర కాలంలో షరా మామూలుగానే శ్రీశ్రీ ఇంటిని స్మారకమందిరంగా మలిచే ప్రతిపాదననూ పట్టించుకోలేదు. బాబు మార్క్ భాషా సేవ అంటే ఇదేనేమో..! డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ మొబైల్ : 88971 47067 -
విద్యారంగాభివృద్ధి బాధ్యత ఉపాధ్యాయులదే
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: అంకితభావం, నిబద్ధత కలిగిన ఉపాధ్యాయుల భుజ స్కంధాలపైనే ప్రభుత్వ విద్యారంగాభివృద్ధి ఆధారపడి ఉందని రాష్ట్ర అధికార భాషా సంఘ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తన తండ్రి కె. వెంకటేశ్వరరావు జ్ఞాపకార్ధం స్థాపించిన కేవీఆర్ ఎడ్యుకేషనల్ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన బుద్ధప్రసాద్ మాట్లాడుతూ బ్రిటీషు వారు రూపొందించిన విద్యా విధానానికి వ్యతిరేకంగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను మేళవించి స్వాతం్రత్య్ర సమరయోధులు స్థాపించిన విద్యాసంస్థలు ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించాయని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వాలు విద్యను ప్రైవేటీకరించే చర్యల్లో భాగంగా ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్లక్ష్యం చేస్తూ, విద్యా రంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందుతుంటే మనదేశం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉందని, ఇందుకు విద్య, ఆరోగ్య రంగాల్లో వెనుకబాటే కారణమన్నారు. చైనాలో మాతృభాషను పూర్తిస్థాయిలో అమలుపరుస్తూ ప్రభుత్వ విద్యాసంస్థల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, మన దేశంలో ప్రభుత్వ విద్యారంగాభివృద్ధి గురించి పట్టించుకునే తీరిక ప్రభుత్వాలకు లేకపోవడం శోచనీయమన్నారు. ఎమ్మెల్సీ బి. బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమాజానికి దూరంగా గిరిజన తండాలు, మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభివృద్ధి కోసం అహర్శిశలూ శ్రమిస్తున్న ఉపాధ్యాయులకు ప్రోత్సాహం కరువైందన్నారు. సభాధ్యక్షుడు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రోత్సాహం, పేద విద్యార్థులకు సహాయం, విద్యారంగాభివృద్ధికి చర్చాగోష్టుల నిర్వహణ ప్రధాన అంశాలుగా 2008లో ట్రస్ట్ స్ధాపించి, యేటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈఏడాది 10 మంది ఉపాధ్యాయులను సత్కరిస్తుండగా, గత మూడేళ్లుగా 18 త్రిపుల్ ఐటీ సీట్లు సాధించిన భట్టిప్రోలు మండలంలోని ఐలవరం పాఠశాలను ఉత్తమ పాఠశాలగా ఎంపిక చేశామని చెప్పారు. పాఠశాల హెచ్ఎం వాసుదేవరావుతో పాటు సహచర ఉపాధ్యాయ బృందాన్ని సత్కరిస్తున్నామని తెలిపారు. 11 మందికి ప్రతిభా పురస్కారాలు ప్రైవేటు విద్యారంగంలో చేస్తున్న కృషికి ఆర్. వీరనారాయణ, డెరైక్టర్ (వివేకా విద్యాసంస్థలు, తెనాలి), డి. రామచంద్రరావు, హెచ్ఎం జెడ్పీ హెచ్ఎస్ (మందడం-తుళ్లూరు), షేక్ నాగుల్ మీరా, హెచ్ఎం (జెడ్పీ హెచ్ఎస్, దొడ్లేరు-క్రోసూరు), సీహెచ్ నగరాజ కుమారి, హెచ్ఎం (పట్టాభిపురం నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల (గుంటూరు), ఉపాధ్యాయులు కె. వేణుగోపాలరావు (జెడ్పీ హెచ్ఎస్, మాదల-ముప్పాళ్ల), ఎ. నాగేశ్వరరావు, ఎంపీయూపీ స్కూల్ (పిచికలపాలెం-శావల్యాపురం), కె. శ్రీనివాసరాజు, జెడ్పీ హెచ్ఎస్ (శావల్యాపురం), ఏఎస్ఎస్ జగదీశ్వర రెడ్డి, జెడ్పీ హెచ్ఎస్ (బ్రాహ్మణపలి-పిడుగురాళ్ల), జె. బైరాగి, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం (ధూళిపాళ్ళ-సత్తెనపల్లి), బి. పరిశుద్ధరావు, ఎంపీయూపీ స్కూల్ (ఈపూరులంక-కొల్లూరు), డి. స్వర్ణలత, ఎంపీయూపీ స్కూల్ (మాడుగుల-గురజాల)తో పాటు ఉత్తమ పాఠశాలగా ఎంపికైన భట్టిప్రోలు మండలం ఐలవరం జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం వాసుదేవరావు, ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించి, జ్ఞాపిక, ప్రశంసా పత్రం బహుకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి డి. ఆంజనేయులు, ఉప విద్యాశాఖాధికారులు, పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.