ప్రత్యేక సర్వీసుల్ని నడుపుతున్న ఆర్టీసీ
50 శాతం అధిక ధర వసూలు రెట్టింపు ధరలకు {పైవేటు సర్వీసులు
10 నుంచి 17 వరకు డిమాండ్ అధికం రూ.2 కోట్ల ఆదాయం!
ఫుల్లయిపోయిన రైళ్లు
విజయవాడ : సంక్రాంతి పండుగకు పెరగనున్న ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దోపిడీకి తెరలేచింది. ప్రైవేటు బస్సుల నిర్వాహకులు ఇప్పటికే రెట్టింపు ధరలు, కొన్ని రూట్లలో అంతకంటే ఎక్కువకు టికెట్లు విక్రయిస్తున్నారు. మరోవైపు ఏపీఎస్ ఆర్టీసీ కూడా పండుగ రద్దీని సొమ్ము చేసుకునేందుకు సిద్ధమైంది. రెగ్యులర్ బస్సులతో పాటు వారం రోజులకు మొత్తం 785 ప్రత్యేక సర్వీసుల్ని నడపాలని నిర్ణయించినఆర్టీసీ అధికారులు వీటికి సాధారణ టికెట్ కంటే 50 శాతం అధిక ధర నిర్ణయించి ఆన్‌లైన్‌లో విక్రయాలు సాగిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 10 నుంచి సెలవులు కాగా, 14 నుంచి 17 వరకు కార్యాలయాలకు సెలవులు. దీంతో బస్సులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
టికెట్ల ధర భారీగా పెంపు...
హైదరాబాదుకు నాన్ ఏసీ బస్సు టికెట్ ధర రూ.350 ఉండగా, దీనిని రూ.700కు పెంచారు. ఏసీ బస్సుకు రూ.500 ఉండగా, రూ.800 నుంచి రూ.1200 మధ్య విక్రయిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరుకు అధిక సర్వీసులు ఏర్పాటు చేయగా, విజయవాడ నుంచే 500 సర్వీసులు నడుపుతున్నారు. ప్రైవేటు బస్సులు సుమారు 300 అదనంగా ఏర్పాటు చేశారు. ఈ నెల 10 నుంచి 14 వరకు టికెట్ల అమ్మకాలు ఆన్‌లైన్‌లో ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి.
రెట్టింపు ధరకు ప్రైవేటు దోపిడీ...
ప్రైవేటు బస్సుల నిర్వాహకులు హైదరాబాదుకు రూ.500 ఉండే ఏసీ బస్సు ధర రూ.800 నుంచి 1200 వరకు, చెన్నైకి ఏసీ స్లీపర్ సాధారణ రోజుల్లో రూ.1000 ఉండగా, రూ.2200 నుంచి రూ.2400 వరకు పెంచి విక్రయిస్తున్నారు. బెంగళూరు ఏసీ టికెట్ ధర రూ.850 ఉండగా, దీనిని రూ.1800 నుంచి రూ.2 వేలకు పెంచి అమ్ముతున్నారు. విశాఖపట్నానికి మాత్రం కొంత తక్కువ డిమాండ్ ఉండటంతో రూ.600 ఉన్న ధరను రూ.800 నుంచి రూ.1000కి పెంచి విక్రయిస్తున్నారు. హైదరాబాదుకు సుమారు 200, బెంగళూరుకు 100 వరకు అదనపు సర్వీసులు ఏర్పాటు చేశారు.
బస్సుల కేటాయింపు ఇలా...
ఆర్టీసీ ఈ నెల 8 నుంచి 14 వరకు రోజుకు సగటున 100 చొప్పున మొత్తం 785 ప్రత్యేక సర్వీసుల్ని ఏర్పాటు చేసింది. వాటిలో 500 హైదరాబాద్‌కు, 100 బెంగళూరుకు, మిగిలిన బస్సులు రాలయసీమకు కేటాయించింది. ఈ నెల 8న 75 బస్సులు, 9న 110, 10న 170, 11న 120, 12న 120, 13న 140, 14న 65 బస్సులను ఏర్పాటు చేసింది. అవసరమైతే మరో 200 వరకు అదనంగా నడపటానికి అన్ని ఏర్పాట్లు చేసింది. పండుగ ప్రత్యేక బస్సుల ద్వారా రెండు కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు.
సంక్రాంతి రైళ్లన్నీ ఫుల్
విజయవాడ (రైల్వేస్టేషన్) : సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైళ్ల రిజర్వేషన్లు పూర్తయి, భారీగా వెయిటింగ్ లిస్టు దర్శనమిస్తోంది. దీంతో పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారికి పాట్లు తప్పేలా లేవు. కొందరు ప్రైవేటు ట్రావెల్స్ వారు ఇ-టికెటింగ్ ద్వారా రెండు నెలల ముందే టికెట్లు బుక్ చేయడం గమనార్హం. గోదావరి, ఫలక్‌నుమా, లింక్, ఇంటర్ సిటీ, జన్మభూమి, రత్నాచల్, కోణార్క్, తిరుమలతో పాటు పలు రైళ్లకు 13, 14 తేదీల్లో వందల సంఖ్యలో వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. 17న దాదాపు అన్ని రైళ్లలో నో రూమ్ దర్శనమిస్తోంది. ప్రత్యేక రైళ్లలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో తత్కాల్ టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా చెన్నై-కోల్‌కతా, విజయవాడ-సికింద్రాబాద్ రూట్లలోని పలు రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఒకవైపు ప్రత్యేక రైళ్లు వేశామని అధికారులు చెబుతున్నా అవి ప్రస్తుత రద్దీకి ఏమాత్రం సరిపోవడం లేదు. రద్దీకి తగినన్ని రైళ్లు వేయకపోవడంతో కన్‌ఫర్మ్ టికెట్లు దొరకక ప్రయాణికుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పండుగ సీజన్‌లో దాదాపు రోజుకు 2 లక్షల 50 వేల మందికి పైగా ప్రయాణాలు సాగించనున్నారు. మరికొందరు చేసేదిలేక ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయించడంతో వారు ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నారు.
పండుగ దోపిడీకి రెడీ!
Published Sat, Jan 9 2016 1:30 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
Advertisement