
ఇసుక విక్రయాలు రద్దు చేయాలి
శింగనమల :‘ఇసుక రీచులను ఎక్కడా డ్వాక్రా మహిళలతో నిర్వహించడం లేదు. వారి ముసుగులో టీడీపీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు. చంద్రబాబు తన పార్టీ కార్యకర్తల కోసమే ఇసుక విక్రయాలు చేపట్టారు. వాటిని వెంటనే రద్దు చేయాల’ని వైఎస్సార్‌సీపీ, వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. శింగనమల మండలం ఉల్లికల్లు ఇసుక రీచ్ వద్ద బుధవారం వైఎస్సార్‌సీపీ, వామపక్షాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాలు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నదీం అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డి, పార్టీ నాయకుడు బోయ తిరుపాలు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు డ్వాక్రా మహిళల పేరుతో ఇసుక రీచులను ప్రారంభించి.. టీడీపీ నేతలకు అప్పగించారని విమర్శించారు. ఇసుక రీచులు పెట్టడం వల్ల భవన నిర్మాణ కార్మికులు, కూలీలు పనుల్లేక రోడ్డున పడ్డారన్నారు.
టీడీపీ ప్రభుత్వం ఇసుక విక్రయాలు చేపట్టి టీడీపీ నేతలకు దోచిపెడుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇసుక విక్రయాలను చేపట్టడం వల్ల సామన్యుడు ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. గతంలో రూ.వెయ్యికి దొరికే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు రూ.5 వేలకు చేరిందన్నారు. ఇసుక దొరక్క జిల్లాలో ఆరు లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ.. ఉల్లికల్లు ఇసుక రీచులో అక్రమాలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోలేదన్నారు.
ఇసుక విక్రయాలు రద్దు చేయాలని ఫిబ్రవరి ఆరున అనంతపురం నగర బంద్ చేపడుతున్నట్లు వెల్లడించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఓబులు మాట్లాడుతూ ఇసుక రీచులు మాఫియా, టీడీపీ నేతల కనుసన్నల్లో నడుస్తున్నాయని విమర్శించారు. ఇక్కడ మూడడుగులు మాత్రమే ఇసుకను తీయాలని నిబంధన ఉన్నా 20 అడుగులు తవ్వారన్నారు. ధర్నా విషయం తెలుసుకొని ముందస్తుగానే ఇసుక విక్రయాలు నిలిపివేసి, గుంతలు కనపడకుండా చాగల్లు రిజర్వాయర్‌కు వెళ్తున్న నీటిని వదిలారన్నారు. ఇక్కడ ఇన్ని అక్రమాలు జరుగుతున్నా డీఆర్‌డీఏ అధికారులు పట్టించుకోలేదన్నారు.
దీనిపై ఇన్‌చార్జి పీడీని ఫోన్‌లో సంప్రదించగా.. జిల్లా కలెక్టర్ దిృ్టకి తీసుకెళ్లి చర్చిస్తున్నామని చెప్పారన్నారు. దీన్నిబట్టి వారు ఏవిధంగా పని చేస్తున్నారో తెలుస్తోందన్నారు. ఇసుక రీచ్ వల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు తగ్గిపోయే పరిస్థితి ఉందన్నారు. తాగునీరు లేకుండా పోయే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేత శ్రీరామిరెడ్డి, సీపీఎం నాయకులు జాఫర్, నల్లప్ప, సీపీఐ జిల్లా నాయకులు లింగమయ్య, బాలరంగయ్య, చెన్నప్ప యాదవ్, ఇతర నేతలు నారాయణస్వామి, నాగరాజు, పోతన్న, వీరనారప్ప, పద్మావతి, అమీనమ్మ, శంకుతలమ్మ, భాగ్యమ్మ, ఆషాబీ, రామాంజినేయులు,పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.
అడ్డుకున్న పోలీసులు : ఉల్లికల్లు ఇసుక రీచ్ వద్ద ధర్నాకు వెళుతున్న వారిని పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. శింగనమల మరువకొమ్మ, నాయనపల్లి క్రాస్, ఉల్లికల్లు గ్రామం వద్ద అడ్డుకోవడంతో వారు పోలీసులపై మండిపడ్డారు. ఉల్లికల్లు రీచ్ వద్ద ధర్నా చేపట్టడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటుకలపల్లి సీఐ శ్రీనివాసులు, శింగనమల, ఇటుకలపల్లి ఎస్‌ఐలు రామారావు ఆధ్వర్యంలో దాదాపు వంద మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. శింగనమల తహశీల్దారు సుధామణిని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఓబులు నిలదీశారు.