
సీడ్ క్యాపిటల్‌గా వరదముంపు ప్రాంతం
రాజధాని నిర్మాణంపై ఎన్జీటీలో పిటిషనర్ల తరఫు న్యాయవాది
సాక్షి, న్యూఢిల్లీ: వరదముంపు ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీడ్ క్యాపిటల్‌గా ఎంపిక చేసి నిర్మాణాలు చేపడుతోందని, ఈ విషయాన్ని పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) కమిటీ ధ్రువీకరించిందని రాజధాని నిర్మాణంపై జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ పరిఖ్ పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి సంబంధించిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం కూడా విచారించింది. రాజధాని నిర్మాణం ద్వారా చేసే అభివృద్ధి, జరిగే నష్టం, రైతులకు జీవనోపాధి ఏ విధంగా కల్పిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం ఎన్జీటీ కోరిన విషయం తెలిసిందే.
ఆ వివరాలేవీ అని ధర్మాసనం బుధవారం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించగా.. ఇంకా నివేదిక సిద్ధం కాలేదని ఆయన సమాధానం ఇచ్చారు. దీనిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇంకా నివేదిక ఎందుకు సిద్ధం చేయలేదని ప్రశ్నించింది. అభివృద్ధి కార్యక్రమాలు, నష్టంపై వివరాలు అందించాల్సిందిగా సంబంధిత రాష్ట్ర అధికారులను కోరామని, వాటిని త్వరలోనే సమర్పిస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు.