ఆటాపాటలతో హోరెత్తిన బాలోత్సవ్
హాజరైన 8 వేల మంది చిన్నారులు
కొత్తగూడెం: ‘ఆటలాడగలం.. పాట పాడగలం.. చిన్నారులమైన మామదిలో సంసృ్కతీ సంప్రదాయాలు పదిలం’ అంటూ ప్రతిభతో ఆకట్టుకున్నారు. ఫ్యాన్సీ డ్రెస్ పోటీలతో తరగిపోతున్న సంప్రదాయాలను.. ప్రకృతిపై చిన్నారులకు ఉన్న అమితమైన ప్రేమను చాటుకున్నారు. కథలు రాయగలం.. నీతి పద్యాలు చెప్పగలమని నిరూపించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరుగుతున్న జాతీయస్థాయి బాలోత్సవ్-14 పోటీల్లో రెండో రోజైన శనివారం ఆరు రాష్ట్రాల నుంచి సుమారు 8 వేల మంది చిన్నారులు హాజరయ్యారు. మొత్తం 18 విభాగాల్లో పోటీలు జరిగాయి. రెండో రోజు పోటీలలో ప్రధానంగా ఫ్యాన్సీ డ్రెస్, సీనియర్స్, జూనియర్స్ జానపద నృత్యాల పోటీలను తిలకించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. రాముడు, రావణుడు, భీముడు, ఘటోత్కచుడు వంటి వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. వక్తృత్వం తెలు గు, ఇంగ్లిష్ పోటీలు, లేఖారచన పోటీలు అందరినీ ఆకర్షించాయి. వ్యర్థ పదార్ధాలు, వస్తువులతో విద్యార్థులు అద్భుతమైన కళాఖండాలను సృష్టించి ఆకట్టుకునే పోటీ ‘వ్యర్థంతో అర్థం’లో సైతం విద్యార్థులు ప్రతిభ కనపర్చారు.
ఘల్లుమన్న జానపదం..
బాలోత్సవ్ -2014లో జానపదానికి ప్రత్యేక స్థానం కల్పించి, పోటీలు నిర్వహించారు. పిల్లలు సైతం అదే తరహాలో జానపద నృత్య పోటీల్లో పాల్గొని తమ ప్రతిభకు పదును పెట్టారు. కోయిలో కోయిల.. అంటూ హన్మకొండకు చెందిన తరుణిక రావ్ చేసిన నృత్యం అందరినీ హుషారెత్తించింది. ఈలవేసిండు పోరగాడు.. అంటూ వరంగల్‌కు చెందిన చందన చేసిన నృత్యం ప్రతీ ఒక్కరిచేత ఈల వేయించింది. ఆటోరిక్షా తోలేటోడా.. అంటూ కోదాడకు చెందిన సుమన చేసిన నృత్యానికి కేరింతలు, ఈలలతో ఆహుతుల హర్షధ్వానాలు మిన్నంటాయి. నా అందం చూడు బాబయ్యో... అంటూ కోదాడకు చెందిన సాహితి చేసిన నృత్యాన్ని తిలకించేందుకు వచ్చిన విద్యార్థులు కూడా నృత్యం చేస్తూ ఆనందించారు.
తొలిసారిగా పేరిణి నృత్యం...: తెలంగాణ నృత్యంగా పేరుగాంచిన పేరిణి నృత్య పోటీలను తొలిసారిగా బాలోత్సవ్‌లో పొందుపరిచారు. ఈ పోటీలో 26 మంది విద్యార్థులు నృత్యం చేసి ఆకట్టుకున్నారు. ఖమ్మంకు చెందిన దత్తు, పాల్వంచకు చెందిన వరుణ్, సూర్యాపేటకు చెందిన వినయ్ ప్రదర్శించిన పేరిణి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాగా, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు.