
ఎమ్మెల్యే జయమంగళపై తెలుగు తమ్ముళ్ల వీరంగం
ముదినేపల్లి, న్యూస్‌లైన్ : పార్టీ కార్యకర్తల అభీష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణపై తెలుగు తమ్ముళ్లు తిరగబడ్డారు. ఎమ్మెల్యే, కార్యకర్తల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగి టీడీపీలోని వర ్గవిభేదాలు మరోసారి బజారున పడ్డాయి. పార్టీ అధిష్టానం సైతం విస్మయం చెందే ఇలాంటి సంఘటన ముదినేపల్లిలో ఆదివారం జరిగింది.
వివరాల్లోకి వెళితే మండలంలోని శ్రీహరిపురం సర్పంచ్ బడుగు జయమ్మ కుమారుడు భాస్కరరావు కాంగ్రెస్ పార్టీ స్థానిక ప్రముఖుడు. గుడ్లవల్లేరు మండలం వేమవరం కొండాలమ్మ గుడి వద్ద ఆదివారం ఆయన విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
దీనికి ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు, రాష్ట్ర కార్యదర్శి ఈడ్పుగంటి వెంకటరామయ్యలను, స్థానిక నేతలను ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని టీడీపీ మండల అధ్యక్షుడు కె.విఠల్, జిల్లా తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి చలసాని జగన్‌మోహనరావు, తెలుగు యువత మండల అధ్యక్షుడు పరసా విశ్వేశ్వరరావు, పార్టీ నాయకులు అడుసుమిల్లి రాము తీవ్రంగా వ్యతిరేకించారు. కార్యక్రమానికి హాజరుకావ ద్దంటూ ఎమ్మెల్యేను, ఇతర నాయకులను కోరారు. అయినప్పటికీ వీరి మాటలు పెడచెవిన పెట్టి ఎమ్మెల్యే వెంకటరమణ, రాష్ట్ర కార్యదర్శి ఈడ్పుగంటి వెంకటరామయ్యలు నాయకులతో కలిసి విందుకు తరలివెళ్లారు. దీంతో ఆగ్రహించిన తెలుగు యువత మండల అధ్యక్షుడు పరసా విశ్వేశ్వరరావు కైకలూరులోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోని తన ఫొటోని చింపివేశారు.
ఎమ్మెల్యేను నిలదీసిన వైనం...
ఫొటో చించేసిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జయమంగళ విందు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్థానిక పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో విందులో ఎందుకు పాల్గొన్నావంటూ ఎమ్మెల్యేను విఠల్, రాము, విశ్వేశ్వరరావు, చలసాని జగన్‌మోహనరావులు ప్రశ్నించి ఎమ్మెల్యే వర్గీయులను తీవ్ర పదజాలంతో దూషించారు. తాము వద్దన్న కాంగ్రెస్ కార్యకర్త ఆహ్వానాన్ని ఎందుకు మన్నించారని ప్రశ్నించారు. రాష్ట్ర కార్యదర్శి వెంకటరామయ్య మాటలు విని మండలంలోని పార్టీని నాశనం చేస్తున్నారని పేర్కొన్నారు. తాము వాస్తవాలను చెపుతున్నప్పటికీ వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా ఈడ్పుగంటి నాయకత్వంలో పనిచేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే, కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారి తీసింది. ఒకరిపై ఒకరు చెయ్యి చేసుకునేందుకు సైతం ప్రయత్నించగా ఇరువర్గాల నాయకులు వారింపజేశారు.
sదీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే క్రమశిక్షణలేని కార్యకర్తలు పార్టీలో ఉన్నా లేకున్నా ఒక్కటేనని, బయటకు వెళ్లిపోవాలని అన్నారు. ఈ తతంగం నడుస్తుండగానే ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో నానా హంగామా చేశారు. ప్రధాన రహదారిలో వచ్చి పోయే ప్రజలు ఈ తంతు చూసేందుకు పార్టీ కార్యాలయం ముందు గూమిగూడి తెలుగు తమ్ముళ్ల ఆగ్రహావేశాలను ముక్కున వేలేసుకుని తిలకించారు.
తాగి పార్టీ పరువు తీస్తున్న ఎమ్మెల్యే...
ఈ ఘటనపై టీడీపీలోని ఒక వర్గం నాయకులు తీవ్రంగా స్పందించారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. తరచూ ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉంటూ కార్యకర్తలను తూలనాడుతూ పార్టీ పరువును గంగలో కలుపుతున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు కె.విఠల్, తెలుగుయువత అధ్యక్షుడు పరసా విశ్వేశ్వరరావు విమర్శించారు. ఇందుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈడ్పుగంటి వెంకటరామయ్య మద్దతు పలుకుతూ ఎమ్మెల్యే పతనానికి పరోక్షంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
ఎమ్మెల్యేను అల్లరి పాలు చేస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధిష్టానం టిక్కెట్ ఇవ్వదని, ప్రత్యామ్నాయంగా తానే పోటీ చేయవచ్చనే దురుద్దేశంతో ఎమ్మెల్యేను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కూడా తనకు టిక్కెట్ రాదనే ఉద్దేశంతో పార్టీని మండలంలో భూస్థాపితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే తాను చేసిన తప్పును సరిదిద్దుకుని నడవడిక మార్చుకోకుంటే రాజకీయంగా పతనం తప్పదని హెచ్చరించారు.