సాక్షి, నిజామాబాద్ :
కాసులు కురిపించే అభివృద్ధి పనులను దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. * 93 లక్షల అంచనా వ్యయం కలిగిన అభివృద్ధి పనులను దక్కించుకునేందుకు ఓ కాంట్రాక్టర్ మాయాజాలం చేశాడు. పదేళ్ల క్రితం పదవీ విరమణ చేసి, ఇటీవలే మరణించిన ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. అసలు ప్లాంటే లేకు న్నా.. ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు. అనుమానం వచ్చి ఆ పత్రాలను పరిశీలించగా అవి బోగస్‌వని తేలాయి. వివరాలిలా ఉన్నాయి.
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో పాత జాతీయ రహదారి (చర్చి) నుంచి రైల్వేగేట్ వరకు ఉన్న రోడ్డును బీటీ రోడ్డుగా మార్చాలని భా వించారు. ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ పథకాల కింద మంజూరైన నిధులతో ఈ పనులు చేపట్టాలని నిర్ణయించారు. రెండు (*48 లక్షలు, *45 లక్షలు) బిట్లుగా మార్చి రెండు నెలల క్రితం మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం టెండర్లు పిలిచింది. పలువురు కాంట్రాక్టర్లు ఈ పనుల కోసం పోటీ పడ్డారు. కాంట్రాక్టర్‌గా అవతారమెత్తిన ఓ పార్టీ నేత ఒకరు అంచనా వ్యయం కంటే 3.55 శాతం తక్కువకు కోట్ చేసి ఈ టెండరు దక్కించుకున్నారు. నిబంధనల ప్రకారం ఈ పనులకు టెండర్లు వేయాలంటే ఆ కాంట్రాక్టరుకు హాట్‌మిక్స్ ప్లాంట్ ఉండాలి. కానీ ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ తాను ఓ వ్యక్తి వద్ద హాట్‌మిక్స్ ప్లాంటును లీజుకు తీసుకున్నానని పేర్కొంటూ భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద ఈ ప్లాంటుకు సంబంధించి ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను మున్సిపల్ అధికారులకు సమర్పించారు. మున్సిపల్ అధికారులు ఈ ధ్రువీకరణ పత్రాలు సరైనవేనా అని నిర్ధారించుకునేందుకు నిజామాబాద్‌లోని ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయానికి పంపారు. ఆర్‌అండ్‌బీ అధికారులు ఈ పత్రాలను పరిశీలించగా అవి బోగస్‌వని తేలింది. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు వారు గుర్తించారు. మరో విశేషమేంటే ఈ పత్రాలపై సంతకం చేసిన అధికారి కొన్నేళ్ల క్రితం పదవీ విరమణ చేశారని, ఆయన ఇటీవలే మరణించారని ఆర్‌అండ్‌బీ వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలిస్తే ఆసలు ప్లాంటే లేదని తేలింది.
చర్యలపై అనుమానాలు?
బోగస్ పత్రాలను సృష్టించిన సదరు కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, బ్లాక్‌లిస్టులో పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇలా లేని ప్లాంటును ఉన్నట్లు చూపి.. పలు శాఖల ఉన్నతాధికారుల సంతకాలను ఫొర్జరీ చేసి బోగస్ పత్రాలు సృష్టించిన సదరు కాంట్రాక్టర్‌పై అధికారులు చర్యలు తీసుకునే సాహసం చేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
స్పెషల్ ఆఫీసర్‌తో చర్చించి నిర్ణయం
- బాలోజీనాయక్, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్
టెండరును ఫైనల్ చేసేందుకు పత్రాలను పరిశీలనకు పంపగా అవి బోగస్‌వని తేలింది. మున్సిపల్ ప్రత్యేక అధికారితో చర్చించాక బోగస్ ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన కాంట్రాక్టర్‌పై చర్యల విషయమై నిర్ణయం తీసుకుంటాం.
ఆత్మ సంతకం చేసింది!
Published Wed, Oct 2 2013 2:46 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM
Advertisement
Advertisement