సాక్షి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం మరో రచ్చబండ కార్యక్రమానికి సిద్ధమవుతోంది. ఈ నెల 11 నుంచి 26వ తేదీ వరకు మూడోవిడత రచ్చబండ నిర్వహించాలని ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర కు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. జిల్లాలో రెండో విడత రచ్చబండ కార్యక్రమం 2011లో నవంబర్ 2 నుంచి 30వ తేదీ వరకు జరిగింది. ఈ సమయంలో అడుగడుగునా తెలంగాణ సెగ తగిలింది. చాలా ప్రాంతాల్లో రచ్చబండను అడ్డుకున్నారు. అయితే ఎలాగోలా అధికారులు ప్రజల నుంచి పెద్దఎత్తున దరఖాస్తులు స్వీకరించారు. అర్హులను కూడా గుర్తించారు. ఇదంతా ఏడాది క్రితం జరిగింది. అయినా వారికి సంబంధించిన పథకాలు మంజూరు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది.
ఇదీ పరిస్థితి...
సామాజిక భద్రత పెన్షన్ల కోసం రచ్చబండ -2లో 96,692 మంది నుంచి అధికారులు దరఖాస్తులు తీసుకున్నారు. ఇందులో 55,592 మందిని అర్హులుగా గతేడాది గుర్తించారు. ఎట్టకేలకు ఈ ఏడాది ఇప్పటి వరకు 49,856 మందికి పింఛన్లు మంజూరు చేశారు. వీటినే రచ్చబండ-3లో అధికారికంగా అందజేయనున్నారు. అయితే మిగిలినవారు అర్హులైనా వారిని పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో 5,736 మంది అర్హులకు ఎప్పుడు అందజేస్తారో సర్కారుకే తెలియాలి. అన్ని అర్హతలున్న వీరి పట్ల చిన్నచూపు ప్రదర్శించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం 1.54 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా... ఇందులో 74 వేల మందిని అర్హులుగా గుర్తించారు. అయితే వీరందరికీ ఇళ్లు మంజూరు చేసిన పాపాన పోలేదు. కేవలం 42వేల మందికే ఇళ్లు మం జూరు చేసి చేతులు దులుపుకుంది. మిగిలిన 32 వేల మందికి మొండిచేయి చూపింది. తెలుపు రేషన్ కార్డుల కోసం 89,856 మంది నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో దాదాపు 75 వేల మందిని అర్హులుగా గుర్తించి.. కేవలం 47,500 మందికే కార్డులు అందజేయనున్నారు. ఈ కార్డుదారులకు సంబంధించిన ఫొటోలు ఇటీవలే అప్‌లోడ్ చేశారు. వీరికి మాత్రమే రచ్చబండలో రేషన్ కార్డులు అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు. మిగిలిన వారికి ఫొటోల అప్‌లోడ్ తర్వాత ఇచ్చే అవకాశాలున్నాయని తెలి పారు. ఈ లెక్కన 27,500 మం దికి ఎదురు చూపులు తప్పవన్న మాట. ఇలా గతంలోనే స్వీకరించిన దరఖాస్తులకు మోక్షం లభించకపోవడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి క్రమంలో మరో రచ్చబండ నిర్వహించి ఏంచేస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఆరు అంశాలకే ప్రాధాన్యం..
16 రోజుల పాటు జరిగే రచ్చబండలో ఆరు అంశాలకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రేషన్‌కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారు. అంతేగాక 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రభుత్వం బిల్లు చెల్లిస్తుంది. ఇందిరమ్మ కలలు పథకం (ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్) కింద పలు మండలాల్లో గుర్తించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కూడా చేయనున్నారు.
మండల కేంద్రాల్లోనే..
రచ్చబండ నిర్వహణకు సంబంధిం చిన పూర్తిస్థాయి వివరాలు అధికారులకు చేరలేదు. రెండు మూడు రోజుల్లో అందే అవకాశం ఉంది. తొలి విడత రచ్చబండ కార్యక్రమాలు గ్రామాల్లో నిర్వహించారు. తర్వాత చేపట్టిన రెండో విడత కార్యక్రమాలు మండల కేంద్రాలకే పరిమితమయ్యాయి. ఈ ఏడాది కూడా మండల కేంద్రాల్లోనే నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది. రచ్చబండ కార్యక్రమం అమలుకు మండల స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ బాధ్యత జిల్లా ఇన్‌చార్జ్ మంత్రికి అప్పగించారు. ప్రతి కమిటీలో ముగ్గురు ఉంటారు. వీరిలో సర్పంచ్, మహిళా సంఘం నుంచి కానీ, గ్రామ మహిళ కానీ ఒకరు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే మరొకరు ఉంటారు. ఈ కమిటీ మండల బృందంతో కలిసి పనిచేస్తూ రచ్చబండను కొనసాగిస్తుంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ..
మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు రానున్నాయి. ప్రస్తుతం అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తుండగా, ప్రజల్లో ప్రచారం చేసుకునేందుకు ఈ రచ్చబండ కార్యక్రమం చేపట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రచ్చబండ.. ప్రచారమే ఎజెండా
Published Sun, Nov 10 2013 2:57 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement