
రాష్ట్ర పార్టీకి చేరిన బీజేపీ ఎన్నిక పంచాయితీ
⇒ జిల్లా, నగర పార్టీలకు ఇద్దరేసి పోటీ
⇒ పార్టీపరిశీలకు ముందు ఏ వర్గం వాదన వారిది?
⇒ రాష్ట్ర పార్టీ నిర్ణయమే శిరోధార్యమంటూ హామీ
విజయవాడః భారతీయ జనతా పార్టీ నగర, జిల్లా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ రాష్ట్ర పార్టీకి చేరింది. ప్రస్తుతం అటు రాష్ట్రంలోనూ, ఇటు కేంద్రంలోనూ బీజేపీ అధికారం పంచుకోవడంలో నగర, జిల్లా అధ్యక్ష ఎన్నికలకు పోటీ గట్టిగానే ఉంది. రాష్ట్ర ఎన్నికల పరిశీలకు వచ్చి ఎన్నికల్లో ఏకాభిప్రాయం తీసుకురావాలని ప్రయత్నించినా పెద్దగా ఫలితం లేకపోయింది. జిల్లాలోనూ, నగరంలోనూ సభ్యుల అభిప్రాయాలను తీసుకుని రాష్ట్ర పార్టీకి వివరించేందుకు పరిశీలకులు నిర్ణయించుకున్నారు.
జిల్లాకు, నగరానికి ఇద్దరేసి పోటీ....
గుడివాడలో జరిగిన అభిప్రాయసేకరణకు రాష్ట్ర ఎన్నికల అధికారి కపిలేశ్వరయ్య, ఎన్నికల పరిశీలకులు వృద్వీరాజ్, రామకృష్ణారెడ్డి తదితరులు వచ్చారు. జిల్లా అధ్యక్ష పీఠం కోసం తొలుత సక్కుర్తి శ్రీనివాసరావు, చిగురుపాటి నరేష్ పోటీ పడినా, బుధవారం ఉదయానికి వారు ఇరువురు చిగురుపాటి కుమారస్వామికి మద్దతుగా తప్పుకున్నారు. గుత్తికొండ శ్రీరాజబాబు, కుమారస్వామిల మధ్య పోటీ అనివార్యం అయింది. సుమారు 140 మంది పార్టీ సభ్యులు తమ అభిప్రాయాలను పరిశీలకు చెప్పారు. తాము ఎవరికి మద్దతు ఇస్తున్నామో చెబుతూనే పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని అంగీకరిస్తామంటూ హామీ ఇచ్చినట్లు తెలిసింది. విజయవాడలో పరిశీలకులుగా వచ్చిన శాంతారెడ్డి బొమ్మల దత్తు, సురేష్ రెడ్డి, కపిలేశ్వరయ్యలు పార్టీ సభ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. సుమారు 167 మంది తమ అభిప్రాయాలు చెప్పినట్లు సమాచారం. విజయవాడలో తొలుత భావించినట్లుగా ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ దాసం ఉమామహేశ్వరరాజు, గతంలో తాత్కాలిక అధ్యక్షుడుగా పనిచేసిన మువ్వల వెంకట సుబ్బయ్య మధ్యే పోటీ జరిగింది. సభ్యులంతా ఎవరికి వారు తమ అభిప్రాయాలు చెప్పారు. ఉదయం నుంచి పార్టీ కార్యాలయం వద్ద తీవ్ర సందడి నెలకొంది. అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న ఇరువురు నేతల అనుచరులువారి అభిప్రాయాలు వారు చెప్పారు. ఏకాభిప్రాయం సాధ్యం కాదని నాయకులునిర్ణయించి సభ్యుల అభిప్రాయాలు తీసుకున్నారు.
పోటీయా? సీల్డ్ కవరా? పార్టీలో చర్చ.....
రాష్ట్ర రాజధాని ప్రాంతంలో జిల్లా, నగర అధ్యక్ష పదవి కోసం ఇద్దరేసి నేతలు పోటీపడుతుండటంతో రాష్ట్ర నేతలకు మిగుడు పడటం లేదని తెలిసింది. గతంలో తరహాలోనే ఎన్నిక నిర్వహించాలా? లేక సీల్డ్ కవర్‌లో అధ్యక్షుడు పేరును సూచిస్తూ నగర, జిల్లా కార్యాలయాలకు పంపాలా? అని ఆలోచిస్తున్నారు. ఎన్నికలు నిర్వహిస్తే పార్టీలో గ్రూపులు పెరిగిపోతున్నాయని, దీనివల్ల పార్టీ ముందుకు పోవడం లేదనే అభిప్రాయం సీనియర్ నేతల్లో వ్యక్తం అవుతోంది. సీల్డ్ కవర్‌లో అధ్యక్షుడు పేరు పంపితే.. రెండవ వర్గం అసంతృప్తి చెందుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాష్ట్ర పార్టీలో తుది నిర్ణయం తీసుకుని త్వరలోనే అధ్యక్ష ఎన్నికలు నిర్వహించే తేదిని నిర్ణయించాలని భావిస్తున్నారు. లేదా నేతలందర్ని మరోకసారి కూర్చోబెట్టి ఏకాభిప్రాయం తీసుకురావాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల కధనం.