♦ వజ్రగడలో రెండు వర్గాల మధ్య తగాదా
♦ భూమి సర్వేకు ఆర్డీవో ఆదేశం
♦ కొనసాగుతున్న పోలీస్ పికెట్
వజ్రగడ(మాకవరపాలెం) : అల్లూరి సీతారామరాజు విగ్రహ ఏర్పాటు వివాదాస్పదమైంది. విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న స్థలం తమదంటే తమదంటూ రెండువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. మండలంలోని వజ్రగడ ప్రాథమిక పాఠశాల సమీపంలోని సెంటు స్థలం తమదంటూ కాళ్ల స్వామి కుమారులు గత నెలలో పాకను వేశారు. అదే స్థలం వజ్రగడ శివారు తమ్మయ్యపాలెంలో ఉంటున్న సూర్రెడ్డి బాలరాజు అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటుకు గ్రామస్తులకు దానపట్టా రాసిచ్చాడు. దీంతో స్థానిక నేతలు తమరాన గోవింద, యర్రంనాయుడులతోపాటు గ్రామస్తులు శనివారం ఉదయం ఈ స్థలంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటుకు వెళ్లారు.
అప్పటికే ఈ స్థలంలో ఉన్న పాకను తొలగించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సమాచారం మేరకు పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పరిస్థితి అదుపుతప్పుతోందని గుర్తించిన పోలీసులు అదనపు సిబ్బందిని రప్పించారు. నర్సీపట్నం ఆర్డీవో కె.సూర్యారావు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇరువర్గాలు తమ వద్ద ఉన్న భూ రికార్డులను అధికారులకు చూపించారు.
దీంతో ఈ భూమిని సర్వే చేపట్టాలని ఇన్‌చార్జి తహశీల్దార్ అంబేద్కర్‌ను ఆర్డీవో ఆదేశించారు. స్థానిక ఎస్‌ఐ పి.రమేష్ మాట్లాడుతూ వివాదం సద్దుమణిగే వరకు గ్రామంలో పోలీస్ పికెట్ కొనసాగిస్తామన్నారు. సర్వే పూర్తి చేసి నివేదికను ఆర్డీవోకు అందజేస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో నర్సీటప్నం రూరల్ సీఐ షేక్ గపూర్, డీటీ ప్రసాదరావు, కొత్తకోట, రోలుగుంట ఎస్‌ఐలు పాల్గొన్నారు.
అల్లూరి విగ్రహం ఏర్పాటు వివాదాస్పదం
Published Sat, Aug 8 2015 11:55 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement