కడప: రాయలసీమ సమస్యలపై ఈ నెల 8 నుంచి వివిధ రకాల పోరాటాలు నిర్వహిస్తున్నట్లు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ (ఆర్‌సీపీ) రాష్ట్ర కార్యదర్శి ఎన్.రవిశంకర్ రెడ్డి తెలిపారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 8న అంబేద్కర్ వర్దంతిని పురష్కరించుకుని దళితవాడకు పోదాం అనే నినాదంతో ఉదయం 9 నుంచి 9వ తేదీ ఉదయం 9 గంటల వరకు వాడలోని ప్రజలతో ప్రభుత్వ పథకాల తీరుపై, సామాజిక ఆర్దిక అంశాలపై చర్చిస్తామన్నారు.
సీమ వ్యాప్తంగా దాదాపు 60 దళితవాడల్లో పర్యటిస్తామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో గుంతకల్లును రైల్వే జోన్ చేస్తామని చెప్పి ఇప్పుడు విస్మరించారన్నారు. దీనికి నిరసనగా 50 రైల్వే స్టేషన్‌లలో సంతకాల సేకరణ నిర్వహించి స్టేషన్ మాస్టర్‌కు వినతి పత్రాలు సమర్పిస్తామన్నారు. 19, 20న తిరుపతిలో పార్టీ రాష్ట్రస్దాయి వర్క్‌షాప్ నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్‌సీపీ నాయకులు లింగమూర్తి, సుబ్బరాయుడు పాల్గొన్నారు.