పట్టణ శివార్లలో వాహనాల్లో ఉన్న సంచార జీవులు, బయోమెట్రిక్ వేలిముద్రల ద్వారా ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు
మైదుకూరు టౌన్ : ఉత్తర భారతదేశానికి చెందిన పార్ధిగ్యాంగ్ రాయలసీమ జిల్లాల్లో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో ప్రత్యేక నిఘా ఉంచారు. ఇప్పటి వరకు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడిన ఈ గ్యాంగ్ తాజాగా చిత్తూరు జిల్లాలో సంచరిస్తున్నట్లు అక్కడి పోలీసులకు సమాచారం రావడంతో మన జిల్లా పోలీసులు ముందస్తు నిఘా ఉంచారు. ఈ గ్యాంగ్ సభ్యులు రాత్రి వేళల్లో నిర్మానుష్యమైన కాలనీల్లో, తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీ చేయడం వీరి ప్రత్యేకత.
పగటి వేళల్లో వీధుల వెంబడి సంచరించి ఇళ్లను ఎంపిక చేసుకుంటారు. శివారు కాలనీలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వీరు పగలు బిచ్చగాళ్లుగా, కూలీలుగా, చిన్న చిన్న వ్యాపారులుగా వీధుల్లో తిరుగుతుంటారని పోలీసులు తెలుపుతున్నారు. ఈ గ్యాంగ్ సభ్యులు దోపిడీ చేసే సమయంలో ఇంట్లో అడ్డు వచ్చిన వారిని అతి కిరాతకంగా చంపడానికి కూడా వెనుకాడబోరని పోలీసుల కథనం.
ఈ నేపథ్యంలో మైదుకూరు పోలీసులు పట్టణ శివారు ప్రాంతాల్లో అనుమానితులుగా ఉండే వ్యక్తులను గుర్తించి వారి వేలిముద్రలను, ఆధారాలను సేకరిస్తున్నారు. పట్టణంలోని అంకాళమ్మ గుడి, బైపాస్ రోడ్డు పక్కన నివాసం ఉండే వ్యక్తును గుర్తించి వారి వేలిముద్రలను సేకరించారు. పార్థి గ్యాంగ్ సభ్యులు పూర్తిగా హిందీలో మాట్లాడతారని, ఎవరైనా అనుమానితులుగా కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. మైదుకూరు బస్టాండు, బైపాస్ రోడ్డులో పోలీసులు ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేసి నిఘా పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment