కడప రూరల్ : జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారులకు వింత సమస్య ఎదురైంది. మహాప్రభో ఉపకార వేతనాల కోసం విద్యార్థుల దరఖాస్తులను పంపండి.. నిధులు మంజూరు చేస్తామని మొత్తుకుంటున్నా ఆయా కళాశాలలు స్పందించడం లేదు. దీంతో ఆ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
అందని 5458 ఎస్సీ విద్యార్థుల దరఖాస్తులు
2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫీజులు, స్కాలర్‌షిప్పుల కోసం రెన్యూవల్ విద్యార్థులు 9766, ఫ్రెషర్స్ విద్యార్థులు 7845, మొత్తం 17611 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 12153 మందికి ఉపకార వేతనాలు మంజూరు చేశారు. అయితే ఇంకా కాలేజీ స్థాయిలో 1514 మంది విద్యార్థుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 839 మంది దరఖాస్తులు ఆధార్‌కు వేలిముద్రలను కళాశాల యాజమాన్యాలు తీసుకుని పంపాల్సి ఉంది.
అలాగే 2945 మంది దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. అయితే, అందుకు సంబంధించిన హార్డ్ కాపీలను సోషల్ వెల్ఫేర్‌కు పంపలేదు. మొత్తం కలిపి 5458 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఉపకార వేతనాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 577 కళాశాలల్లో ఎస్సీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆ కళాశాలల నుంచి ఈ 5458 దరఖాస్తులు రావాల్సి ఉంది. ఇంతవరకు ఆ దరఖాస్తులు రాకపోవడంతో సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకు ఉపకార వేతనాలను మంజూరు చేయలేక పోతోంది. కళాశాల నిర్లక్ష్యం కారణంగానే ఆ శాఖకు దరఖాస్తులు అందడం లేదని తెలుస్తోంది.
కళాశాల యాజమాన్యాలే బాధ్యత వహించాలి
2014-15లో ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేశాము. అయితే, 5458 మంది దరఖాస్తులు కళాశాల స్థాయిలో పెండింగ్‌లో ఉన్నందున వారికి నిధులు మంజూరు చేయలేక పోతున్నాము. కళాశాల యాజమాన్యాలు ఆ వివరాలు పంపకపోతే విద్యార్థులు ఉపకార వేతనాలు పొందడం ఆలస్యం అవుతుంది. అందుకు కళాశాల యాజమాన్యాలే బాధ్యత వహించాలి. ఇందుకు సంబంధించి ఈనెల 11వ తేది ఉదయం కడప మహిళా డిగ్రీ కళాశాలలో, సాయంత్రం ప్రొద్దుటూరులోని వైఎస్సార్‌ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపాళ్లతో సమావేశం ఏర్పాటు చేశాము.
- పీఎస్‌ఏ ప్రసాద్, జాయింట్ డెరైక్టర్, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ, కడప.
విద్యార్థులకు ‘ఉపకారం’ చేయరా..!
Published Sun, Mar 8 2015 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM
Advertisement