యలమంచిలి, ఎస్.రాయవరం టీడీపీ నేతల మధ్య వాగ్వాదం
ఇరువర్గాలతో రెవెన్యూ, పోలీసు అధికారుల చర్చలు
ఐదు ట్రాక్టర్ల సీజ్
యలమంచిలి : అధికారం ఉండగానే నాలుగు కాసులు వెనకేసుకోవాలన్న ఆరాటంతో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇసుక కొరత ఆసరాగా చేసుకుని బరితెగిస్తున్నారు. ఇప్పుడా వ్యవహారం పార్టీలో నేతల మధ్య అగ్గిరాజేసింది. యలమంచిలి, ఎస్.రాయవరం తెలుగుదేశం పార్టీ నేతలమధ్య చోటుచేసుకున్న ఇసుక వివాదం ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ఇక్కడ రెండు మండలాల సరిహద్దు వద్ద వరహానది ప్రాంతం నుంచి కొంతకాలంగా అధికారికంగా కొంత, అనధికారికంగా మరింత ఇసుక తరలిపోతోంది. ఈ వ్యాపారం లాభదాయకంగా ఉండటంతో ఇసుకంతా తమకే దక్కాలని పట్టుబట్టిన రెండు మండలాల టీడీపీ నేతల మధ్య వివాదం ఏర్పడింది. ఇది కాస్త చినికిచినికి గాలివానలా మారడంతో మంగళవారం సాయంత్రం ఏటికొప్పాక, దార్లపూడి సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు రెండు మండలాలకు చెందిన టీడీపీ నేతలకు నచ్చజెప్పినప్పటికీ ఇరువర్గాలవారు వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వ అభివృద్ధి పనులు, గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు, సీసీరోడ్ల నిర్మాణం వంటి పనులకోసం తహశీల్దార్లు జారీచేసిన కూపన్లతో సర్పంచ్‌లు ఇసుకను ట్రాక్టర్లతో తీసుకెళ్తున్నారు.
ఇసుక తవ్వకాలు జరుపుతున్న ప్రాంతం తమ మండల పరిధిలోనికే వస్తుందంటూ రెండు మండలాల టీడీపీ నేతల మధ్య తరుచూ వాగ్వాదాలు జరుగుతున్నాయి. మంగళవారం యలమంచిలి మండలానికి చెందిన టీడీపీ నేతల ట్రాక్టర్లలోకి ఇసుక లోడ్‌చేస్తుండగా, ఎస్.రాయవరం ఎంపీపీ యేజర్ల వినోద్‌రాజ్, తన అనుచరులు, మండలానికి చెందిన టీడీపీ నేతలతో అక్కడకు వచ్చారు. తమ మండల పరిధిలో ఇసుక మీరెలా తవ్వుతారని యలమంచిలి మండల టీడీపీ అధ్యక్షుడు కాండ్రకోట చిరంజీవి, కొందరు సర్పంచ్‌ల తో నేతలతో వాగ్వాదానికి దిగారు. ఇది తమ మండలం పరిధిలోనిదేనని ఇక్కడకు రావటానికి మీరెవరని యలమంచిలి మండల టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఇది వివాదంగా మారి ఇరువర్గాలవారు తీవ్ర స్థాయిలో దూషణలకు దిగారు. భారీ సంఖ్యలో రెండువర్గాల వారు అక్కడకు చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న యలమంచిలి రూరల్ ఎస్‌ఐ సీహెచ్.వెంకట్రావు, యలమంచిలి తహశీల్దార్ ప్రసాదరావు, ఎస్.రాయవరం రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని వివాదం ఎందుకొచ్చిందో అడిగి తెలుసుకున్నారు. ఎంత నచ్చజెప్పినా ఇరువర్గాలవారు శాంతించకపోవడంతో నదిలో ఉన్న ఐదు ట్రాక్టర్లను యలమంచిలి సర్కిల్ కార్యాలయానికి తరలించారు. ఇటీవల ఏటికొప్పాక, దార్లపూడి గ్రామాల ఆటో డ్రైవర్ల మధ్య కూడా వివాదం చోటుచేసుకోవడంతో ఒక గ్రామం ఆటోలను మరొక గ్రామంలోనికి రాకుండా అడ్డుకు న్నారు. ఈ వివాదం సద్దుమణగకముందే ఇసుక వివాదం మరింత పెద్దదికావడం చర్చనీయాంశమైంది. రెండు మండలాల అధికారపార్టీ నేతలూ ఇలా రోడ్డెక్కి కొట్లాటలకు సిద్ధపడడం వెనుక ఇసుక వ్యాపారంలో వస్తున్న లాభాలేకారణమని తెలుస్తోంది.
వరహా నదిలో ఉద్రిక్తత
Published Wed, Feb 3 2016 12:16 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement