విషాద యాత్ర | The tragic trip | Sakshi
Sakshi News home page

విషాద యాత్ర

Published Fri, Jul 24 2015 1:14 AM | Last Updated on Sun, Sep 3 2017 6:02 AM

The tragic trip

తిరుపతి వెంకన్న సన్నిధిలో సేవచేయాలన్న కోరిక  అందరికీ ఉంటుంది. అయితే ఆ భాగ్యం దక్కేది కొంతమందికే. ఆ అవకాశం లభించిన పూసపాటిరేగ మండలం పేరాపురానికి చెందిన మహిళలు ఎంతో సంతోషించారు.   కలియుగవైకుంఠుడు తమపై కరుణ చూపాడని  భావించారు. గ్రామానికి చెందిన రేగాన వరలక్ష్మి అనే మహిళ ఆధ్వర్యంలో  ఉప్పొంగుతున్న హృదయాలతో తిరుమలకు చేరుకున్నారు. సేవకు వెళ్లడం వారికిదే మొదటి సారి. భక్తులకు సేవ చేయడంతో పాటు, స్వామి దర్శన భాగ్యాన్ని పొందారు. తమ భాగ్యాన్ని తలచుకుంటూ, కళ్ల నిండా స్వామి ప్రతిరూపాన్ని నింపుకొని ఇళ్లకు పయనమయ్యారు. ఆ లౌకిక ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించకుండానే, తమ అనుభవాలను కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో పంచుకోకుండానే విషాదంలో చిక్కుకున్నారు.  భోగాపురం సమీపంలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృత్యువాత పడగా ఎనిమిదిమందికి గాయాలయ్యాయి.
 
 భోగాపురం, పూసపాటి రేగ: వారంతా 800 కిలో మీటర్లకు పైగా ప్రయాణం చేశారు. గమ్యం చేరుకోవడానికి కేవలం మూడు కిలోమీటర్లే ఉంది.   ఆ దూరం దాటితే చాలు ఇళ్లకు చేరుకోవచ్చు. ఇంతలో పెద్దకుదుపు... ఏం జరిగిందో అని తేరుకుని చూసేసరికి రక్తం ధార కట్టింది... వారి శరీరాలు  స్వాధీనం తప్పాయి...  తాము ప్రమాదానికి గురయ్యామని తెలియడంతో మహిళలంతా ఒక్కసారిగా పెద్దపెట్టున హాహాకారాలు చేశారు.
 
 పూసపాటిరేగ మండలం పేరాపురం గ్రామం నుంచి 23మంది మహిళలు, గుర్ల మండలం కెల్ల గ్రామం నుంచి ముగ్గురు మహిళలు కలిపి మొత్తం 26మంది  13వ తేదీన తిరుపతి వెంకన్నస్వామి ఆలయంలో సేవా కార్యక్రమానికి బయలుదేరారు.   వారం రోజుల పాటు వెంకన్న సన్నిధిలో వారు వివిధ సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఈనెల 21న తిరుగు ప్రయాణమయ్యారు.  గోదావరిలో పుష్కర స్నానాలు చేయాలని నిర్ణయించుకున్నారు. బుధవారం ఉదయం రాజమండ్రిలో దిగి పుష్కరస్నానాలు ఆచరించారు. తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని గంగమ్మతల్లిని మొక్కుకున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం వారంతా ట్రైనులో బయలుదేరి బుధవారం అర్ధరాత్రి 1.30 సమయంలో విశాఖ రైల్వే స్టేషనుకి చేరుకున్నారు. అయితే బస్సులు లేకపోవడంతో ఉదయం 3గంటల వరకు వేచి చూసి రెండు ఆటోలు మాట్లాడుకుని వారంతా తమ గ్రామానికి బయలుదేరారు.
 
 రేగాన వరలక్ష్మి, కోరాడ ఎల్లమ్మ, మీసాల భారతి, వాల్ల వరహాలమ్మ, పాండ్రంకి నారాయణమ్మ, గంధి నాగమణి, నడిపేన సూరప్పమ్మ, పిన్నింటి రామలక్ష్మి పాండ్రంకి రామలక్ష్మి మొత్తం తొమ్మి మంది...  చీడికాడ గ్రామానికి చెందిన వనుము గురుమూర్తి ఆటోలో ఎక్కగా, మిగతా వారు పెద్ద ఆటోలో ఎక్కారు.     డ్రైవరు పక్కన రేగాన వరలక్ష్మి కూర్చుంది. వీరు ప్రయాణిస్తున్న ఆటో    సుందరపేట సమీపానికి వచ్చేసరికి  తెల్లవారు జామున 4.30గంటల సమయంలో  డ్రైవరు నిద్రమత్తులోకి జారుకున్నాడు. అంతే ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది.   ఆటోలో ఉన్న మహిళలు తేరుకుని గోల చేసేసరికి తెలివి వచ్చిన డ్రైవరు గురుమూర్తి ఆటోను అదుపుచేసేందుకు ప్రయత్నించాడు. అంతలోనే ఘోరం జరిగిపోయింది.
 
 ఎదురుగా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ని బలంగా ఢీకొంది. దీంతో ఆటో ముందుభాగం నుజ్జయిపోయింది. ముందున కూర్చున్న రేగాన వరలక్ష్మి అక్కడికక్కడే చనిపోయింది. వెనుక  కూర్చున్న వారిలో ఎడమవైపు ఉన్న కోరాడ ఎల్లమ్మ రోడ్డుపైకి తుళ్లిపడడంతో ఆమె ముఖ భాగంపై   గాయాలయ్యాయి. అలాగే వాల్ల వరాలమ్మ, రంది నాగమణిలకి తీవ్రగాయాలవగా, పిన్నింటి రామలక్ష్మి నడుంపై బలమైన గాయమైంది. ఆటో డ్రైవరుకు కూడా తీవ్రగాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన నలుగురు మహిళలను, ఆటో డ్రైవరును స్థానికులు జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోరాడ ఎల్లమ్మ మృతి చెందింది.   ప్రమాదం జరిగిన తరువాత అయిల్ ట్యాంకర్  డ్రైవర్  వాహనంతో పాటు పరారయ్యాడు.  ప్రమాద వార్త తెలుసుకున్న సీఐ వైకుంఠరావు, ఎస్‌ఐ దీనబంధులు సంఘటనా స్థలం వద్దకు చేరుకుని సహాయకార్యక్రమాలు చేపట్టారు.   బాధితుల వద్ద నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 
 శోక సంద్రంలో పేరాపురం: ప్రమాదంలో మృతి చెందిన వారు, క్షతగాత్రులు అందరూ పేరాపురానికి చెందిన వారే కావడంతో గ్రామం శోకసంద్రంగా మారింది.  తిరుపతి వెళ్లిన తమ వారు క్షేమంగా ఇంటికి చేరుతున్నారని సమాచారం రావడంతో వారి కోసం ఆశగా ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకు పిడుగులాంటి  వార్త చేరింది. దీంతో రోదనలు మిన్నంటాయి.  వెంటనే గ్రామం నుంచి  ప్రమాద స్థలానికి ఉరుకులుపరుగుల మీద వెళ్లారు.  ఘటనాస్థలంలో మృతి చెందిన రేగాన వరలక్ష్మి ఆశ వర్కరుగా పనిచేస్తోంది.
 
 ఆమెకు భర్త పాపారావుతో పాటు 7, 9 తరగతులు చదువుతున్న ప్రవల్లిక, ఝాన్సీ అను ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తమ తల్లి చనిపోయిందని తెలుసుకున్న ఇద్దరు కుమార్తెలు తండ్రితో సహా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ‘‘అమ్మా... లే అమ్మా.. మాట్లాడమ్మా అంటూ’’ కుమార్తెలు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది.  చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించిన కోరాడ ఎల్లమ్మ భర్త గత ఏడాది ప్రమాదంలో మృతి చెందా డు. కూలీపనిచేసుకుంటూ ఒక్కగానొక్క కొడుకు అప్పలరాజును పాలిటెక్నిక్ చదివిస్తోంది. ఆమె మరణించడంతో అప్పలరాజు అనాథగా మిగిలాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement