రాజుకున్న రాజకీయం | The turning point in this year's political future | Sakshi
Sakshi News home page

రాజుకున్న రాజకీయం

Published Mon, Dec 30 2013 3:54 AM | Last Updated on Tue, May 29 2018 4:09 PM

The turning point in this year's political future

జిల్లాలో ఈ ఏడాది రాజకీయంగా రసవత్తర మలుపు తిరిగింది. తెలంగాణ ఉద్యమ ప్రభావంతో ప్రధాన పార్టీల జాతకాలు మారిపోయాయి. పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటి, డీసీసీబీ పీఠాన్ని దక్కించుకుంది. అధికార కాంగ్రెస్‌కు మంత్రి డీకే అరుణ పెద్దదిక్కుగా ఉన్నారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ పరిస్థితి మరింత దిగజారింది. నాగం జనార్దన్‌రెడ్డి తెలంగాణ నగారా సమితిని బీజేపీలో విలీనం చేయగా, నాగర్‌కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం గులాబీదశంలో చేరిపోయారు. వైఎస్సార్ సీపీ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటి ప్రధాన పార్టీలకు దీటుగా నిలిచింది.  
 
 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ ఏడాది అంతా జిల్లాలో ఉద్యమాలు కొనసాగాయి.  టీజేఏసీ, తెలంగాణ వాదులు, విద్యార్థి సంఘాలతో పాటు టీఆర్‌ఎస్, బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించారు. యూపీఏ సర్కారు జులై 30న తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించినప్పటి నుంచి ప్రధాన పార్టీల్లో కలకలం మొదలైంది.
 
 తీవ్ర స్థాయిలో ఉద్యమాలు జరిగినప్పుడు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదికి వచ్చినా కాంగ్రెస్, టీడీపీకి చెందిన ప్రతినిధులు అటువైపు తిరిగి చూడలేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆ లోటును భర్తీ చేసి, మనుగడ కోసం ఆయా పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. తెలంగాణ ప్రకటించాక ప్రజలకు మేం దగ్గరయ్యామని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీ పరిస్థితి మాత్రం అయోమయంగానే ఉంది. ఆ పార్టీపై తెలంగాణ వాదుల్లో సదభిప్రాయం లేకపోవడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 2013లో జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీ పరిస్థితి ఇలా ఉంది.                              
  న్యూస్‌లైన్, పాలమూరు
 
 జనవరి
 6న జిల్లా కేం ద్రంలోని ము న్సిపల్ టౌన్ హాల్‌లో నిర్వహించిన సదస్సులో ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వంతో పోరాటం చేసి, అందరికీ లబ్ధి కలిగించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
 
  ఫిబ్రవరి
 7, 8 తేదీలలో అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నల్లమల ప్రాంతంలో పర్యటించారు. గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగించింది. 18వ తేదీన డీసీసీబీ చైర్మన్‌గా వీరారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి డీకే అరుణ రాజకీయ పలుకుబడితో ఆయన ఆప్కాబ్ పీఠాన్ని దక్కించుకున్నారు.
 
  మార్చి
 కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి మార్చి 23న శంకుస్థాపన చేశారు. 26వ తేదీన కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమంల్లో మంత్రి డీకే అరుణ పాల్గొన్నారు.
 
 ఏప్రిల్
 రైతు చైతన్య యాత్రల్లో భాగంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఏప్రిల్ 22న జడ్చర్లకు వచ్చారు. సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.13న టీఆర్‌ఎస్ అధినేత, ఎంపీ కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ గిరిజాశంకర్‌తో సమీక్షించారు.
 
 మే
 కేంద్ర రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మే 27న జిల్లా కేంద్రానికి వచ్చారు. పాలమూరులో చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.  
 
 జాన్
 2వ తేదీ హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ సమక్షంలో నాగర్‌కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం, టీడీపీ నేత మర్రి జనార్దన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. 3వ తేదీన నాగం జనార్దన్‌రెడ్డి నగారా సమితిని రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో బీజేపీలో విలీనం చేశారు. జూన్ 29న వైఎస్సార్ సీపీ విసృ్తతస్థాయి సమావేశంలో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పాల్గొన్నారు. కేసీఆర్, గద్దర్ ఈ నెలలో జిల్లాలో పర్యటించారు.
 
 జులై
 టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆర్మీ జవాన్ యాదయ్య కుటుంబాన్ని ఓదార్చి, ఆర్థిక సహాయం అందించారు. యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్ష పదవికి కల్వకుర్తికి చెందిన వంశీచందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ 440, టీడీపీ 328, టీఆర్‌ఎస్ 129, వైఎస్సార్ సీపీ 198, బీజేపీ 59,  ఇతరులు 174 స్థానాలు గెలుచుకున్నారు. 30వ తేదీన తెలంగాణ ప్రకటన రాగానే జిల్లావ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు.
 
 ఆగస్టు
 3వ తేదీన తెలంగాణ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మంత్రి డీకే అరుణ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో సోనియా గాంధీ కృతజ్ఞత సభ చేపట్టారు. ఇందులో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, తెలంగాణ వాదులు పాల్గొన్నారు.
 
  సెప్టెంబరు
 28న జిల్లాకేంద్రంలో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు   పార్లమెంటులో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ హాజరయ్యారు. 30వ తేదీన వైఎస్సార్‌సీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి జిల్లా మీదుగా కడపకు వెళుతుండగా అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.  
 
 అక్టోబరు
 4న జిల్లా కేంద్రంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి సమితి అధ్యక్షురాలు కవిత హాజరయ్యారు. 29వ తేదీ గద్వాలలో కాంగ్రెస్ విజయోత్సవ సభను మంత్రి చేపట్టారు. ఇందులో ఉపముఖ్యమంత్రి దామోదరం రాజనర్సింహ్మ, జానారెడ్డి, డి.శ్రీనివాస్, కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, వీహెచ్, శ్రీధర్‌బాబు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
 
 నవంబరు
 21వ తేదీన అచ్చంపేటలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. మంత్రి డీకే అరుణ ఎదుటే కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు బాహాబాహీకి దిగారు. జిల్లాలో పలు చోట్ల సీఎం ఫొటోలు తీసేసి రచ్చబండ నిర్వహించాలని తెలంగాణ వాదులు ఆందోళనలు చేశారు.
 
 డిసెంబర్
  డిసెంబర్ 5న రాయల తెలంగాణ ఏర్పాటు చేయనున్నారంటూ వార్తలు రావడంతో, అందుకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్, టీజేఏసీ, ఇతర అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ బంద్ జిల్లాలో స్వచ్ఛందంగా, సంపూర్ణంగా జరిగింది. టీఆర్‌ఎస్ నేత టి.హరీష్‌రావు విద్యార్థి సదస్సులో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement