విశ్వమానవ సౌభ్రాతృత్వానికి వేదాలు ప్రతీకలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/గన్నవరం: లోకాస్సమస్తాం.. సుఖినోభవంతు అంటూ లోక కల్యాణాన్ని కాంక్షించే వేదాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. వేదాలు విశ్వమానవ సౌభ్రాతృత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. ప్రపంచాన్ని వసుధైక కుటుంబంగా మార్చి విశ్వమానవ సౌభ్రాత్వత్వాన్ని బోధించిన వేద విజ్ఞానం అందరికీ చేరువ కావాలని ఆయన ఆకాంక్షించారు. మన వారసత్వం, సంస్కృతికి మూలాలైన వేదాలను సంరక్షించుకోవడంతో పాటు భవిష్యత్ తరాలకు అందించే బాధ్యతను నేటి తరాలు స్వీకరించాలని ఉద్బోధించారు.
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం ఐ.భీమవరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రూ.4.70 కోట్లతో నిర్మించిన శ్రీవేంకటేశ్వర వేద పాఠ శాలను శుక్రవారం రాష్ట్రపతి ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. వేదాలను పరిరక్షించుకోవడం ఒక పవిత్ర విధిగా ఆయన పేర్కొన్నారు. విలువలతో కూడిన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు వేదాలే మూలమన్నారు. జీవన విధానానికి, సనాతన ధర్మానికి వేదాలు మూల స్తంభాలని చెప్పారు. వేదాల్లోని సారాంశం కేవలం ఒక వ్యక్తికీ, సమాజానికి, దేశానికి పరిమితం కాదన్నారు. వేదాలను మౌఖిక వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిందని, వాటిని యథాతథంగా పరిరక్షించుకోవాల్సిన పవిత్ర బాధ్యత మనపై ఉందన్నారు.
గోదావరి, కృష్ణా తీరాలు విద్యాకేంద్రాలు
పురాతన కాలంలో అన్ని విద్యలు తక్షశిల, విక్రమశిల, వేదాంతపుర వంటి గురుకుల విశ్వవిద్యాలయాలు లేదా గురుకులాల ద్వారా నేర్పేవారని రాష్ట్రపతి గుర్తు చేశారు. వీటి ఆనవాళ్లు ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా చైనా, ఆగ్నేసియా దేశాల్లో వెలుగు చూశాయన్నారు. పురాతన కాలంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి, కృష్ణా నదిపరివాహక ప్రాంతాల్లో ఎన్నో విద్యా కేంద్రాలున్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. నాగార్జునకొండ, అమరావతి వంటి విద్యాకేంద్రాల్లో ఎంతోమంది విదేశీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించారని ఆయన గుర్తు చేశారు. మునులు, సాధువులు నెలకొల్పిన అత్యుత్తమ బోధనా కేంద్రాలను ఇప్పుడు టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద పాఠశాలలు గుర్తుచేస్తున్నాయని చెప్పారు.
టీటీడీ తిరుమల, హైదరాబాద్, నల్గొండ, విజయనగరం, కోటప్పకొండ, ఐ.భీమవరంలో ఏడు వేద పాఠశాలలను నిర్వహిస్తోందన్నారు. శ్రీవేంకటేశ్వర వేదిక్ విశ్వవిద్యాలయాన్ని కూడా నిర్వహిస్తూ టీటీడీ తన ప్రత్యేకతను చాటుకుంటోందన్నారు. వేదాలను పరిరక్షించడంతోపాటు వేద పండితులకు అండగా నిలిచి వారికి ఆర్థికసాయం కల్పించడం, 100 వేద పాఠశాలలు దేశవ్యాప్తంగా విస్తరించడం ఆనందించదగిన విషయమన్నారు. వేదాలపై పరిశోధనలు నిర్వహించేందుకు టీటీడీ సెంటర్ ఫర్ వేదా సైన్స్ రీసెర్చ్ (సీవీఎస్‌ఆర్)ను ఏర్పాటు చేసిందన్నారు. ఆర్‌సీఐ-డీఆర్‌డీఓల్లో శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించేందుకు ప్రముఖ శాస్త్రవేత్తలతో టీటీడీకి పరస్పర ఒప్పందం కుదరడం హర్షణీయమన్నారు. వేదాలను పరిరక్షించేందుకు ఐ.భీమవరంలో వేద విద్యార్థుల కోసం పాఠశాల ప్రారంభించేందుకు చొరవ తీసుకున్న టీటీడీని ఆయన అభినందించారు. ఈ పాఠశాలలో వంద మందిని వేద పండితులుగా తీర్చిదిద్దడమే కాకుండా ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం అభినందనీయమన్నారు.
వేదపఠనంతో ఆరోగ్యం: చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఆధునికయుగంలో నైతిక విలువలు పెంపొందించేందుకు వేద పఠనం ఎంతో దోహదం చేస్తుందన్నారు. వేద పఠనం ద్వారా ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదకరం కలుగుతుందని వేదంలా ఘోషించే గోదావరి సమీపంలో ఈ వేద పాఠశాల ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, కేంద్ర మంత్రి పి.అశోక్‌గజపతిరాజు, రాష్ట్ర మంత్రులు కామినేని, పీతల సుజాత, మాణిక్యాలరావు, ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే శివరామరాజు, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, కనుమూరి బాపిరాజు వేదికపై ఆశీనులయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, పార్టీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబుతోపాటు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు. తొలుత రాష్ట్రపతి వేద పాఠశాల ప్రాంగణమంతా సందర్శించి విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు.
రాష్ట్రపతికి ఘనస్వాగతం.. వీడ్కోలు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో కలిసి ఉదయం 10.30 గంటలకు గన్నవరం చేరుకున్నారు. విమానాశ్రయంలో రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, రాష్ట్ర మంత్రులు దేవినేని, కొల్లు రవీంద్ర, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, ఎంపీలు కొనకళ్ల నారాయణరావు, కేశినేని నాని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ, పోలీసు, ఎయిర్‌పోర్ట్ అధికారులు రాష్ట్రపతికి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం చెప్పారు. అనంతరం ప్రణబ్‌తోపాటు గవర్నర్, సీఎం మూడు హెలికాప్టర్లలో ఐ.భీమవరం బయల్దేరి వెళ్లారు. పర్యటన ముగిసిన అనంతరం రాష్ట్రపతి మధ్యాహ్నం 1.20 గంటలకు హెలికాప్టర్‌లో తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. నరసింహన్, చంద్రబాబుతో కలిసి 1.37కు ప్రత్యేక విమానంలో తిరుపతి బయలుదేరివెళ్లారు.
విశేషాలు
► 2009 ఫిబ్రవరి 14న అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకివీడు మండలం ఐ.భీమవరంలో వేదపాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
► నాలుగున్నర ఎకరాల్లో వేదపాఠశాల నిర్మాణం జరిగింది. అప్పట్లో రూ.కోటి అంచనాతో మొదలు కాగా, నిర్మాణం పూర్తి చేయడానికి రూ.5 కోట్లు ఖర్చయింది.
► పాఠశాల నిర్మాణం ఆలస్యం కావడంతో మూడేళ్ల క్రితం స్థానిక టీటీడీ కల్యాణ మంటపంలో వేద పాఠశాల ప్రారంభించారు. 93 మంది విద్యార్థులు, 15 మంది ఉపాధ్యాయులున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు వసతి గృహాలు నిర్మించారు. అదే ప్రాంతంలో గోశాల, పుష్కరిణి, యజ్ఞశాల నిర్మించారు. వీటన్నింటినీ రాష్ట్రపతి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సరిగ్గా గంటా పదిహేను నిమిషాల వ్యవధిలో రాష్ట్రపతి పర్యటన పూర్తయింది.