సకలం.. సమైక్యం | The whole district thinking to be samiakhyandhra | Sakshi
Sakshi News home page

సకలం.. సమైక్యం

Published Wed, Aug 14 2013 3:48 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM

The whole district thinking to be samiakhyandhra

జిల్లా అంతటా సమైక్య నినాదం మారుమోగుతోంది. ప్రతి ఒక్కరూ జై సమైక్యాంధ్ర అంటూ వీధుల్లోకొస్తున్నారు. ఉద్యమం పల్లెలకూ విస్తరిస్తోంది. ఎవరి నోట విన్నా సమైక్యమాటే వినిపిస్తోంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనంటూ ముక్తకంఠంతోనినదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. చేయిచేయి కలిపి సమైక్యతా గీతిక ఆలపిస్తున్నారు. ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. ఆర్టీసీ కార్మికులు కదన రంగంలో అడుగిడడంతో ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి.    

 సాక్షి, కడప : ఊరు, వాడ సమైక్య నినాదంతో మారుమోగుతోంది. రాష్ట్రం ముక్కలు చేసి తీరుతామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే సమైక్య వాదుల గుండెలు రగిలిపోతున్నాయి. రాజకీయ స్వార్థంతో చేస్తున్న విభజనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ఉద్యమకారులు నినదిస్తున్నారు. దీంతో రోజురోజుకు సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతరూపం దాలుస్తోంది. ఎటుచూసినా జనాలు ఉప్పెనలా రోడ్లపైకి వస్తున్నారు. సమైక్యాంధ్ర నినాదంతో జిల్లా దద్దరిల్లిపోతోంది. రోజురోజుకు ఉద్యమం కెరటంలా ఎగిసి పడుతోంది. జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రం వరకు ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొని భారీ ర్యాలీల ద్వారా తమ నిరసనలు తెలియజేస్తున్నారు. విధులు బహిష్కరించడంతో కార్యాలయాలు బోసిపోయాయి.
 
  గెజిటెడ్ ఉద్యోగులు సైతం స్టేట్ గెస్ట్‌హౌస్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించి ఏడురోడ్ల కూడలిలో మానవహారం నిర్మించారు. ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మనోహర్‌రెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. పల్లెల నుంచి భారీగా ప్రజలు తరలి వచ్చి దీక్ష చేస్తున్న వారికి సంఘీభావాన్ని తెలియజేయడం, వివిధ ఉద్యోగ సంఘాలు భారీ ర్యాలీగా రావడంతో కలెక్టరేట్ ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. జేఏసీ ఉద్యోగులు, వైఎస్సార్‌సీపీ నేతల దీక్షలు సాగుతూనే ఉన్నాయి. జిల్లా అధికారుల సంఘం, ఎల్‌ఐసీ ఏజెంట్లు, కడప నగర పాలక సంస్థ ఉద్యోగులు, ఆటో యూనియన్లు, బాల వికాస్ విద్యార్థులు, దేవాదాయ ధర్మదాయశాఖ, ట్రెజరీ అసోసియేషన్, మార్కెటింగ్‌శాఖ, ఎన్‌సీసీ 30(ఎ) బెటాలియన్, మెడికల్, పారా మెడికల్ అసోసియేషన్, పోలీసు మినిస్ట్రీరియల్ సిబ్బంది, ఆయుష్, వికలాంగులు, అటవీ, విద్యుత్ ఉద్యోగులు భారీ ర్యాలీని నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి దీక్షలకు వేల సంఖ్యలో మద్దతు పలికారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, వైఎస్సార్ సీపీ క్రమశిక్షణా సంఘం సభ్యుడు రఘురామిరెడ్డి, కొల్లం బ్రహ్మానందరెడ్డి దీక్షలకు తమ సంఘీభావాన్ని తెలియజేశారు.
 
  జమ్మలమడుగులో ఎమ్మెల్సీ దేవగుడి ఆధ్వర్యంలో సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉద్యమంపై కార్యచరణ రూపొందించారు. జమ్మలమడుగు ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగులు పూర్తిగా విధులను బహిష్కరించారు. ఆర్టీపీపీలో 3800 మంది ఉద్యోగులు రోడ్డుపైన బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు.
 
  రాయచోటిలో విద్యార్థులు కదం తొక్కారు. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. రోడ్లపైనే విద్యాబోధన సాగింది. ఆర్టీసీ, విద్యుత్‌శాఖ ఉద్యోగులు రోడ్డెక్కారు.
 
  రైల్వేకోడూరులో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, దూదేకుల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించి కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి తగులబెట్టారు.
 
  కమలాపురం సమీపంలోని గోపులాపురంలో చెక్కభజనతో తమ నిరసనను తెలిపారు. టి.చదిపిరాళ్లలో విద్యార్థులు రోడ్డుపైనే క్రికెట్, ఖోఖో ఆడుతూ డ్యాన్స్ చేసి తమ నిరసన తెలియజేశారు. అప్పాయపల్లె దళితవాడ నుంచి కమలాపురం క్రాస్‌రోడ్డు వరకు యువత సోనియాగాంధీ శవయాత్ర నిర్వహించారు.
  రాజంపేటలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఊటుకూరులో విద్యార్థులు రాస్తారోకో, ర్యాలీ నిర్వహించి సోనియాకు పిండప్రదానం చేశారు. వీరికి ఎమ్మెల్యే అమరనాథరెడ్డి సంఘీభావం తెలిపారు.
  బద్వేలులో విద్యార్థులు, కోట వీధి మహిళలు, టైలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బుధవారం బద్వేలు బంద్‌కు పిలుపునిచ్చారు.
  మైదుకూరులో సమైక్యాంధ్రపై మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. టీడీపీజేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మానవహారాన్ని నిర్వహించారు. టీడీపీ నేత సుధాకర్ యాదవ్ సంఘీభావాన్ని తెలియజేశారు. మైదుకూరులో బంద్‌ను పాటించారు.
  ప్రొద్దుటూరులో ముస్లింసోదరులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పద్మశాలి అభ్యుదయ సంఘం, వెంకటేశ్వర పశు వైద్య కళాశాల సిబ్బంది, ఎన్జీఓలు భారీ ర్యాలీ నిర్వహించారు. 20 సంఘాల వారు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు పట్టణంలో భారీ ర్యాలీ, మానవహారం చేపట్టారు. చిన్న పిల్లలు, విద్యార్థులు సైతం సమైక్య ఉద్యమంలో పాల్గొనడం విశేషం. పట్టణంలో జరిగిన కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ  నేతలు రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులురెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement