కాకినాడ క్రైం : కాకినాడ పరిసరాల్లో ఇళ్లలో చోరీకి పాల్పడిన నలుగురు ముఠా సభ్యులను క్రైం పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 10 చోరీ కేసులకు సంబంధించిన రూ.7.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, శ్యాంసంగ్ ట్యాబ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను బుధవారం కాకినాడ త్రీ టౌన్ క్రైం పోలీస్ స్టేషన్‌లో క్రైం డీఎస్పీ పిట్టా సోమశేఖర్ విలేకరులకు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కాకినాడ సంజయ్‌నగర్ స్వర్ణాంధ్రకానీ కొత్తపాకలుకు చెందిన ఉప్పాడ లక్ష్మీగణపతి శివ అలియాస్ జాకీ శివ, దారపు రామిరెడ్డి, కొయ్య మోసే లారీ క్లీనర్లుగా పనిచేస్తుంటారు. అదేప్రాంతానికి చెందిన కాదూరి వీరవెంకట సత్యనారాయణ అలియాస్ వీరబాబు పండ్ల దుకాణంలో కూలీగా పనిచేస్తున్నాడు.
వీరంతా వ్యసనాలకు బానిసలై డబ్బు సంపాదనకు చోరీలను మార్గంగా ఎంచుకున్నారు. జాకీ శివ, రామిరెడ్డి, మోసే గతంలోనూ చోరీలు చేసి జైలు శిక్ష అనుభవించారు. జైలు నుంచి వచ్చిన అనంతరం వీరు వీరబాబును తమ ముఠాలో చేర్చుకుని కాకినాడ వన్‌టౌన్, టూ టౌన్, త్రీ టౌన్, కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్ల పరిధిలోని పది ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఎస్పీ ఎం.రవిప్రకాష్, అదనపు ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచనల మేరకు కాకినాడ క్రైం పోలీసులు ఈ చోరీలపై ప్రత్యేక దృష్టి సారించారు. డీఎస్పీ సోమశేఖర్ నేతృత్వంలో పోలీసు సిబ్బంది క్రైం డిటెక్టివ్ పార్టీగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశారు. శాంతినగర్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆ చోరీలు చేసింది వారేనని నిర్ధారణైంది.
దీంతో వారి వద్ద సుమారు రూ.7.50 లక్షల విలువైన 45 కాసుల బంగారు, 52 గ్రాముల వెండి ఆభరణాలతోపాటు ట్యాబ్ స్వాధీనం చేసుకున్నారు. చోరీల కేసును చాకచక్యంగా ఛేదించిన క్రైం డిటెక్టివ్ పార్టీ సభ్యులను డీఎస్పీ సోమశేఖర్ అభినందించారు. టూ టౌన్ క్రైం ఎస్సై కేవీ రామారావు, హెచ్‌సీలు హుస్సేన్, కె. గోవిందరావు, ఆర్. శ్రీనివాసరావు, పీసీలు శ్రీరామ్, వర్మ, చిన్న, శ్రీను తదితరులకు రివార్డుల నిమిత్తం ఎస్పీకి సిఫార్సు చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో వన్‌టౌన్ క్రైం సీఐ సీహెచ్ శ్రీనివాసబాబు, ఎస్సైలు ఎస్‌ఎం పాషా, రామారావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
చోరీల ముఠా అరెస్టు
Published Thu, May 28 2015 1:53 AM | Last Updated on Sat, Aug 11 2018 8:57 PM
Advertisement
Advertisement