
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య
పొన్నూరు రూరల్: ప్రేమ వేధింపులను తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటుచేసుకుంది. పొన్నూరు రూరల్ ఎస్‌ఐ మీసాల రాంబాబు కథనం ప్రకారం వివరాలు.. మండల పరిధి కసుకర్రు గ్రామానికి చెందిన కంచర్ల శ్రీనివాసరావు కుమార్తె అమూల్య(19) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన కూరపాటి సర్వోత్తమరావు ప్రేమపేరుతో కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. తాను చదువుకుని ఉన్నత స్థితికి చేరేందుకు శ్రమిస్తున్నానని, ప్రేమ పేరుతో తనను వేధింపులకు గురిచేయవద్దని సర్వోత్తమరావును పలుమార్లు ప్రాథేయపడింది. అంతకంతకూ వేధింపులు అధికం చేయడంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది.
ఈ ఇబ్బందుల నుంచి తట్టుకునేందుకు కుమార్తె చదువు మాన్పించి హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో ఉంచి వివాహ ప్రయత్నాలు ప్రారంభించారు. మంగళగిరికి చెందిన యువకుడితో వివాహం చేసేందుకు పెద్దలు ముహూర్తం కుదిర్చారు. నిశ్చితార్థం కార్యక్రమానికి హాజరయ్యేందు అమూల్య హైదరాబాద్ నుంచి కసుకర్రుకు రెండు రోజుల క్రితం వచ్చింది. ఇది గమనించిన సర్వోత్తమరావు ఎవరూ లేని సమయంలో ఆమెను కలిసి తనను పెళ్లి చేసుకోకపోతే మీ కుటుంబం మొత్తాన్ని హతమారుస్తానని బెదిరించాడు.
భయపడిపోయిన అమూల్య ఈ విషయాన్ని పొలంలో పనిచేస్తున్న తన తండ్రికి తెలియజేయడంతో ఈ విషయంపై మధ్యాహ్నం మాట్లాడతానని పొన్నూరు మార్కెట్‌కు వెళ్లాడు. ఈ ఘటనతో భీతిల్లిన అమూల్య శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిడుబ్రోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.