Love Harassment
-
ప్రేమవేధింపులకు విద్యార్థిని బలి
యాచారం: ప్రేమపేరుతో పెడుతున్న వేధింపులను భరించలేక ఓ పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ నరేశ్, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... యాచారం మండలం ఆకులమైలారం గ్రామానికి చెందిన గుత్తి జంగయ్య, పద్మ దంపతుల కూతురు నవ్య(14) కందుకూరు మండలం మీర్ఖాన్పేట ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన తోటి విద్యార్థి కొమ్మగోని నందీశ్వర్ తనను ప్రేమించాలని నవ్యను కొద్దికాలంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆరునెలల క్రితమే బాలిక తన కుటుంబసభ్యులకు చెప్పడంతో నందీశ్వర్‌ను హెచ్చరించారు. ఆ తర్వాత కొద్దిరోజులకు మళ్లీ వెంటపడటం ప్రారంభించాడు. బాలిక ఇంటి చుట్టూ తిరుగుతూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన క్లాస్మేట్ రాజేశ్‌తోపాటు మరోతోటి విద్యార్థిని సహకారంతో ఇన్‌స్ట్రాగామ్(బాలిక కుటుంబసభ్యుల ఫోను)లో నవ్యను వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చి ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుంది. వ్యవసాయ పనులు ముగించుకుని రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఇంటికి చేరిన తల్లిదండ్రులు తలుపులు తెరిచి చూసేసరికి చీరతో ఉరేసుకుని కనిపించింది. నవ్య తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్న ముగ్గురు విద్యార్థులను పిలిచి విచారిస్తున్నారు. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ప్రేమను నిరాకరించిందన్న కోపంతో యువతి గొంతు కోసిన సురేష్
-
బంజారాహిల్స్: ప్రేమిస్తావా.. చస్తావా.. చావాలా.. !
బంజారాహిల్స్: ప్రేమిస్తావా.. లేదంటే చస్తావా.. నేనే చావాలా.. అంటూ ఓ యువకుడు వెంటపడి వేధిస్తున్నాడని ఓ యువతి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని నందినగర్‌లో నివసించే ఓ యువతి(24) ప్రైవేట్ జాబ్ చేస్తుంది. ఇదే ప్రాంతానికి చెందిన గణేష్ అలియాస్ చింటు నిత్యం ఆఫీస్‌కు వెళ్లే సమయంలో ఆమె వెంటపడి అడ్డగిస్తూ ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. ఆమె పని చేస్తున్న చోటుకు వెళ్లి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. తరచూ తన ఇంటికి వచ్చి ప్రేమిస్తావా లేదా అని డిమాండ్ చేయడమే కాకుండా ఆఫీస్‌లో అందరి ముందే అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమె ఫోన్‌ను కూడా ట్రాప్ చేసి సోషల్ మీడియాలో ఫొటోలు పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయగా పోలీసులు గణేష్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: కొత్త ట్విస్ట్: వదినా..మరిది..కొడుకు.. ఓ క్రైం కథ) -
పెళ్లి చేసుకోకపోతే చంపేస్తా..
సాక్షి, విజయవాడ పశ్చిమ: జిల్లాలోని గవర్నర్‌పేట డిపో1లో విధులు నిర్వహిస్తున్న ఓ ఉన్నతాధికారినిపై అజయ్ కుమార్ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా తననే ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని బాధిత యువతిని గత రెండు నెలలుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. తనను పెళ్లిచేసుకోకపోతే చంపేస్తానంటూ ఆ యువతిపై కత్తితో దాడికి యత్నించాడు. ఈ ఘటనపై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పెజ్జోనిపేటలో నివాసముంటున్న యువతి(33) ఆర్టీసీ గవర్నరుపేట–1 డిపోలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తుంది. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న అవుట్ సోర్సింగ్ మెకానిక్ ఎం.అజయ్‌కుమార్ రెండు నెలల నుంచి యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. యువతికి వేరే వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. ఈ విషయం తెలిసిన అజయ్‌కుమార్ సోమవారం రాత్రి మద్యం సేవించి యువతి ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని లేకపోతే చంపేస్తానంటూ జేబులో నుంచి కత్తి తీసి ఆమెపై దాడికి యత్నించడంతో తల్లిదండ్రులు అడ్డుకున్నారు. యువతితో సహా కుటుంబ సభ్యులంతా బయటకు పరుగు తీశారు. స్థానికులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడు. ఘటనపై మంగళవారం యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడిపై 307, 354డీ, 506, 452 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని నార్త్ ఏసీపీ షప్రుద్దీన్ తెలిపారు. ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. -
వేధింపులు.. ఇంటర్ విద్యార్థిని సూసైడ్..!
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని మామిడికుదురు మండలం గోగన్నమఠంలో విషాదం నెలకొంది. ఓ యువకుడు ప్రేమపేరుతో వేధింపులకు గురిచేయడంతో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న మధుశ్రీ అనే బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఇంటి ఆవరణలో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లంకె లక్ష్మీనారాయణ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు. అతని భార్య స్వగ్రామంలోనే ఉంటూ కూతురు మధుశ్రీని చదివిస్తోంది. ఈక్రమంలో అఖిల్ రాజేష్ జులాయిగా తిరుగుతూ ప్రేమపేరుతో మధుశ్రీ వెంటపడ్డాడు. పదోతరగతి నుంచే అతని వేధింపులు మొదలయ్యాయి. అయితే ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా... పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇద్దరూ మైనర్లు కావడంతో వారి భవిష్యత్ నాశనం అవుతుందనే కారణంగా హెచ్చరించి వదిలేశారు. ఆ తర్వాత బాలికను వేరే గ్రామంలోని పాఠశాలలో చేర్పించారు. పదోతరగతి పూర్తిచేసిన మధుశ్రీ రాజోలు శ్రీచైతన్య కాలేజీలో చేరింది. తాజాగా రాజేష్ మళ్లీ వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. బస్సు ఎక్కేడప్పుడు దిగేటప్పుడు నిత్యం వేధిస్తున్నాడు. అతని కారణంగా తల్లిదండ్రుల పరువు పోతోందని భావించిన మధుశ్రీ తీవ్ర మనస్తాపానికి గురైంది. శుక్రవారం ఉదయం ఇంటివద్ద ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురు మరణవార్త విన్న లక్ష్మీనారాయణ గల్ఫ్ నుంచి హుటాహుటిన స్వదేశానికి తిరిగొచ్చాడు. కూతురు మరణం వెనకున్న అసలు విషయాలు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయంలో వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాలిక సూసైడ్ అనంతరం ‘నన్ను వదిలి వెళ్లిపోయావా’ అంటూ రాజేష్ టిక్‌టాక్ వీడియో చేసి వాట్సాప్‌లో స్టేటస్ పెట్టాడు. -
పట్టపగలే మరో ప్రేమోన్మాదం!
హైదరాబాద్: రాజధానిలో పట్టపగలే మరో ప్రేమోన్మాదం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో వేధింపులకు దిగిన యువకుడు ఆమె తిరస్కరించడంతో కక్షకట్టాడు. యువతి ఇంట్లోనే ఆమెపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టి పరారయ్యాడు. 60 శాతం కాలిన గాయాలైన ఆమె ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. హైదరాబాద్ గోల్నాక గంగానగర్‌లో నివసించే అర్షియాబేగం భర్త రియాజుద్దీన్ అన్సారీ కొంతకాలం క్రితం మృతిచెందారు. స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో కూలీగా పని చేస్తున్న అర్షియా.. తన కుమార్తె తబస్సుమ్ బేగం (17), ఇద్దరు కుమారుల్ని పోషిస్తోంది. పదో తరగతితో చదువు మానేసి, ఇంట్లోనే ఉంటున్న తబస్సుమ్‌ను గోల్నాక మార్కెట్లో కూరగాయల వ్యాపారైన సోహెల్ ప్రేమ పేరుతో వేధించడం మొదలెట్టాడు. తబస్సుమ్‌కు ఇటీవలే మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఇది తెలుసుకున్న సోహెల్ మంగళవారం మధ్యాహ్నం ఆమె ఇంట్లోకి ప్రవేశించి ప్రేమించాలంటూ వేధించాడు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయి, యువతి ఇంట్లోని కిరో సిన్ తీసుకొని ఆమెపై పోసి నిప్పంటించి పరారయ్యాడు. మంటలు తాళలేకపోయి న ఆమె కేకలు వేసింది. చుట్టుపక్కలవారు మంటలార్పి ‘108’ సాయంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. నిందితుడు సోహెల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. తబస్సుమ్‌కు నిప్పంటించే క్రమంలో అతనికీ గాయాలు కావడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది. ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడి, హత్యాయత్నం చేసిన నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు. -
రెచ్చిపోయిన ప్రేమోన్మాది
సదాశివపేట: మెదక్ జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని సదాశివపేటలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక పద్మనాభ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని(19)ని అదే ప్రాంతానికి చెందిన సతీష్ గత కొంత కాలంగా ప్రేమించమని వేధిస్తున్నాడు. అతన్ని ప్రేమించేందుకు యువతి నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన యువకుడు ఆమెపై కక్ష కట్టాడు. ఈ రోజు కళాశాలకు వెళ్తున్న సమయంలో అదును చూసుకొని కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు నిందితున్ని పట్టుకోవడానికి యత్నించేలోపే అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువతిని ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యల చేపడుతున్నారు. -
ప్రేమ పేరుతో వేధింపులు : యువతి దాడి
ప్రకాశం: ప్రేమిస్తున్నానని వెంటపడుతూ వేధిస్తున్న యువకుడికి ఓ యువతి తగిన బుద్ధి చెప్పింది. అతనిపై యువతి సుత్తితో దాడి చేసిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ కోచింగ్ సెంటర్లో మద్దిలేటి అనే వ్యక్తి ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన యువతి అతడిపై గురువారం మధ్యాహ్నం సుత్తితో దాడి చేసింది. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు అతన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
యువతి గొంతు కోసిన ఉన్మాది
► రక్తపు మడుగులో విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచిన యువతి ► భైంసాలో పట్టపగలే దారుణం ► ప్రేమ పేరుతో వేధింపులు.. చివరకు కత్తితో దాడి ► గతంలో పెళ్లి సంబంధం చెడగొట్టిన యువకుడు వద్దన్నా ఆమె వెంటపడ్డాడు.. పెళ్లి చేసుకోవాలని బలవంతపెట్టాడు.. ఓ పెళ్లి సంబంధం చెడగొట్టాడు.. చివరికి తనకు దక్కదేమోనన్న అనుమానంతో గొంతు కోసి చంపాడు.. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో శనివారం పట్టపగలే ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉన్మాది గొంతు కోయడంతో యువతి రక్తపు మడుగులో విలవిల్లాడుతూ ప్రాణాలొదిలింది! భైంసా మండలం వాలేగాం గ్రామానికి చెందిన మారుతి, సరుబాయి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. వీరు భైంసా గోపాల్‌నగర్‌లో ఇల్లు కట్టుకున్నారు. పెద్ద కుమారుడు సారుునాథ్ పట్టణంలోని ఓ స్టీల్ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తుండగా.. రెండో కూతురు సవితకు వివాహం జరిపించారు. చిన్న కూతురు సంధ్య(18) తల్లితోపాటు బీడీలు చుడుతోంది. మారుతి చనిపోవడంతో సరుబారుు, సారుునాథ్ కుటుంబ పోషణ చూస్తున్నారు. వీరి ఇంటి ముందే లోకేశ్వరం మండలం పొట్‌పల్లికి చెందిన మహేశ్(21) తన సోదరులతో కలసి ఉంటున్నాడు. ముథోల్‌లోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్న మహేశ్.. ప్రేమ పేరుతో సంధ్యను తరచూ వేధించేవాడు. పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడేవాడు. ఏడాదిన్నర క్రితం ఆమెకు పెళ్లి సంబంధాలు చూడగా.. మహేశ్ చెడగొట్టాడు. దీనిపై సంధ్య బంధువులు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మహేశ్‌ను మందలించి వదిలేశారు. వెంట తెచ్చుకున్న కత్తితో.. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు సంధ్య ఇంటికి సమీపంలోని కిరాణం దుకాణానికి వెళ్లింది. అప్పటికే కొద్దిదూరంలోనే మహేశ్ ఆమె కోసం కాపుగాశాడు. సంధ్య రాగానే మాటల్లోకి దింపి.. వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా గొంతు కోసి పరారయ్యాడు. రక్తపుమడుగులో గిలగిలా కొట్టుకొని సంధ్య అక్కడికక్కడే మృతి చెందింది. చుట్టుపక్కలవారి అరుపులు విని ఇంట్లోంచి తల్లి పరుగెత్తుకుంటూ వచ్చేలోపే చనిపోరుుంది. మృతదేహంపై పడి తల్లి, సోదరుడు సాయినాథ్ గుండెలవిసేలా రోదించారు. డీఎస్పీ అందె రాములు, సీఐ రఘు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు మహేశ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. పట్టపగలే నడిరోడ్డుపై యువతిని చంపిన ఉన్మాదిని ఉరితీయాలని మహిళా సంఘాలు, స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. -
వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య
పొన్నూరు రూరల్: ప్రేమ వేధింపులను తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటుచేసుకుంది. పొన్నూరు రూరల్ ఎస్ఐ మీసాల రాంబాబు కథనం ప్రకారం వివరాలు.. మండల పరిధి కసుకర్రు గ్రామానికి చెందిన కంచర్ల శ్రీనివాసరావు కుమార్తె అమూల్య(19) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన కూరపాటి సర్వోత్తమరావు ప్రేమపేరుతో కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. తాను చదువుకుని ఉన్నత స్థితికి చేరేందుకు శ్రమిస్తున్నానని, ప్రేమ పేరుతో తనను వేధింపులకు గురిచేయవద్దని సర్వోత్తమరావును పలుమార్లు ప్రాథేయపడింది. అంతకంతకూ వేధింపులు అధికం చేయడంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. ఈ ఇబ్బందుల నుంచి తట్టుకునేందుకు కుమార్తె చదువు మాన్పించి హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో ఉంచి వివాహ ప్రయత్నాలు ప్రారంభించారు. మంగళగిరికి చెందిన యువకుడితో వివాహం చేసేందుకు పెద్దలు ముహూర్తం కుదిర్చారు. నిశ్చితార్థం కార్యక్రమానికి హాజరయ్యేందు అమూల్య హైదరాబాద్ నుంచి కసుకర్రుకు రెండు రోజుల క్రితం వచ్చింది. ఇది గమనించిన సర్వోత్తమరావు ఎవరూ లేని సమయంలో ఆమెను కలిసి తనను పెళ్లి చేసుకోకపోతే మీ కుటుంబం మొత్తాన్ని హతమారుస్తానని బెదిరించాడు. భయపడిపోయిన అమూల్య ఈ విషయాన్ని పొలంలో పనిచేస్తున్న తన తండ్రికి తెలియజేయడంతో ఈ విషయంపై మధ్యాహ్నం మాట్లాడతానని పొన్నూరు మార్కెట్‌కు వెళ్లాడు. ఈ ఘటనతో భీతిల్లిన అమూల్య శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిడుబ్రోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. -
ప్రేమ వేధింపులకు యువతి బలి
♦ ప్రేమించలేదని కిరోసిన్ పోసి ♦ నిప్పుపెట్టిన యువకులు! ♦ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలి మృతి ఏలూరు అర్బన్: ప్రేమ వేధింపులకు ఓ యువతి బలైన సంఘటన శనివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం చాటపర్రులో చోటుచేసుకుంది. ప్రేమించలేదని తమ కుమార్తెపై ఇద్దరు యువకులు కిరోసిన్ పోసి నిప్పు పెట్టారంటూ మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పైడాల సత్యనారాయణ, వెంకటేశ్వరమ్మ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తె ఇందుమతి(18) ఇంటర్ చ దువుతోంది. అదే గ్రామంలోని కూలిపనులు చేసుకునే దగ్గుమిల్లి చినవిక్కీ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడేవాడు. అతడికి తోడుగా సోదరుడు పెదవిక్కీ, గ్రామంలోనివారి స్నేహితులు నిత్యం వేధించేవారు. విషయం తెలిసి ఇందుమతి తల్లిదండ్రులు ఆమెను చదువు మాన్పించి ఇంటివద్దనే ఉంచుతున్నారు. మూడు రోజుల కిందట తమ ఇంటి దగ్గర బైక్‌పై తిరుగుతున్న చినవిక్కీని గమనించిన ఇందుమతి తండ్రి సత్యనారాయణ అతణ్ని మందలించాడు. ఈ విషయాన్ని చినవిక్కీ అన్న పెదవిక్కీ సీరియస్‌గా తీసుకున్నాడు. తన స్నేహితుల సహకారంతో ఇందుమతి ఉంటున్న వీధిలోని లైట్లు వెలగకుండా ఫీజులు పీకేశాడు. దీంతో ఇందుమతి తల్లిదండ్రులు శనివారం ఉదయం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై ఎన్ఆర్ కిషోర్‌బాబు నిందితులు చినవిక్కీ, పెదవిక్కీలను తమకు అప్పగించాలని వారి కుటుంబ సభ్యులకు కబురు పంపారు. దీంతో నిందితుల తరపున కొందరు పెద్దలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ సమస్యను గ్రామంలో పరిష్కరించుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి ఇందుమతి కేకలు వినిపించడంతో స్థానికులు వెళ్లి మంటల్లో కాలిపోతున్న ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు. తీవ్రగాయాలైన బాధితురాలిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. కాగా, శనివారం రాత్రి పొద్దుపోయాక పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. హత్యకాదు.. ఆత్మహత్య: జిల్లా ఎస్పీ ఇందుమతి మృతి ఘటనలో శనివారం రాత్రి పొద్దుపోయాక పోలీసుల తీరు మారింది. జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఇందుమతి హత్యకు గురైనట్లు తొలుత భావించినప్పటికీ.. పరిస్థితులను గమనించి, అన్ని కోణాల్లో విచారణ చేసిన తరువాత ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తేలిందన్నారు. నిందితులు ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
ప్రేమ పేరుతో యువతికి వేధింపులు
-
ప్రేమ వేధింపులకు ఇంటర్ విద్యార్ధిని బలి
-
‘ఆమె’కు రక్షణేది?
ప్రేమ పేరిట విద్యార్థినులపై వేధింపులు.. యువతిపై యాసిడ్ దాడి.. ఉద్యోగినిపై లైంగిక వేధింపులు.. నాలుగేళ్ల బాలిక, వృద్ధురాలిపై లైంగిక దాడి.. ఇలా జిల్లాలో చోటు చేసుకుంటున్న సంఘటనలు మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పుడమిపై పడినప్పటి నుంచి కాటికి వెళ్లే వరకూ ఆమె అనుక్షణం చస్తూ బతుకుతోంది. బతుకుతూ చస్తోంది. ఏ వైపు నుంచి ఎలాంటి ఆపద ముంచుకొస్తుందోనని అడుగు ముందుకు వేయలేక ముడుచుకుపోతోంది. అబల కాదు.. సబల అని అప్పుడప్పుడు గొంతెత్తుతున్నా.. ఆ స్వరం నొక్కేసే రక్కసులతో పోరాడలేక ఓడిపోతోంది. మానప్రాణాలను కాపాడుకోవడానికి శతధా ప్రయత్నిస్తోంది. ఆడపిల్లగా బతుకునిచ్చినా.. తనను బతకనివ్వడం లేదంటూ కన్నీళ్లు పెడుతోంది. తన ఇష్టాయిష్టాలకు తావు లేకుండా, తనపై మోజుపడ్డ వారిని ప్రేమించపోవడంతో వారి ఆగ్రహానికి గురై ప్రాణాలు కోల్పోతోంది. తనను ప్రేమించడం లేదంటూ జైపూర్ మండలం కానుకూరు గ్రామానికి చెందిన రవి ఇదే గ్రామానికి చెందిన విద్యార్థిని అనూషపై మంగళవారం రాత్రి కత్తితో దాడి చేసి హతమార్చిన సంఘటన మహిళలకు రక్షణ కరువైందన్న విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. - న్యూస్‌లైన్,మంచిర్యాల రూరల్ కుమిలి‘పోతున్నరు’.. పల్లె, పట్టణం, కళాశాల, కార్యాలయాలు ఇలా అన్ని చోట్ల ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంటి నుంచి అడుగు బయటపెట్టి కళాశాల, ఆఫీసుకు వెళ్లే యువతులు, మహిళలపై ఆకతాయిలు ఈవ్‌టీజింగ్‌లో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మార్కెట్‌కు వెళ్లినా.. షాపింగ్‌కు వెళ్లినా ఆకతాయిల అల్లరి చేష్టలతో అతివలు అవస్థలు పడుతూనే ఉన్నారు. ప్రేమ పేరిట వెంట పడి వేధించడం, కాదంటే కన్నెర్రజేసి కడతేర్చడం వంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి. ప్రేమ పేరుతో యువతులు, విద్యార్థినులు మోసపోయిన సంఘటనలూ ఉన్నాయి. మాయమాటలతో మోసపోయిన కొందరు ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే కుమిలి పోతున్నారు. ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రుల పాత్రే కీలకం మహిళలపై అఘాయిత్యాలు అరికట్టడంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర అని గుర్తించాలి. ఎందుకంటే అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఇంట్లో వారి ప్రవర్తనను పసిగట్టేది తల్లిదండ్రులే. అబ్బాయిలు ఎలాంటి స్నేహాలు చేస్తున్నారు, వారి అలవాట్లు ఎలా ఉన్నాయి, మానసిక ప్రవర్తన ఎలా ఉంటోంది, సమాజంపై వారికున్న అభిప్రాయం, ఇతరులతో వారి స్నేహబంధం ఎలా ఉంటోంది, పెరిగే వయస్సుతో వారి ఆలోచనలు ఏ విధంగా మారుతున్నాయి అనే విషయాలపై దృష్టి సారించాలి. అలా చేస్తే పిల్లలు నేరస్తులుగా మారే అవకాశం ఉండదని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. -
ఆశ్రమంలో ఉద్రిక్తత
నార్నూర్, న్యూస్‌లైన్ : నార్నూర్ మండలం జామ్ గ్రామంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రేమ పేరిట వేధిస్తున్న ఉపాధ్యాయుడిని తొలగించాలని శుక్రవారం విద్యార్థినులు ఆందోళనబాట పట్టారు. ఉపాధ్యాయుడు శంకర్ తీరుపై హెచ్ఎం లక్ష్మణ్‌కు రాతపూర్వకంగా రాసి ఇచ్చారు. విషయం తెలుసుకున్న గిరిజన సంఘాల నాయకులు, పోలీసులు పాఠశాలకు చేరుకున్నారు. తరగతి గదిలో బోధిస్తున్న ఉపాధ్యాయుడు శంకర్‌ను చితకబాదారు. ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు అందోళనకు దిగారు. అడ్డుకోబోయిన ఎస్సై సంతోష్సింగ్తో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తరగతి గదిలో ప్రేమ పాఠాలు బోధించడం, రాత్రి వేళల్లో పడుకున్నా గదిలోకి వచ్చి ఇబ్బంది పెట్టడం, సదరు విద్యార్థినికి సబ్బులు, డ్రెస్సులు, వస్తువులు ఇచ్చి మభ్య పెట్టేవారని విద్యార్థినులు పేర్కొన్నారు. మూడేళ్లుగా ప్రేమ వ్యవహారం జరుగుతున్న విషయాలు హెచ్ఎంకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలి.. : గిరిజన సంఘాల డిమాండ్ కీచక ఉపాధ్యాయుడు శంకర్ ను సస్పెండ్ చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు కనక యాదవ్రావ్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వెడ్మా బొజ్జు, తుడం దెబ్బ జిల్లా అధ్యక్షుడు ఆత్రం తిరుపతిలు డిమాండ్ చేశారు. పాఠశాల ప్రధాన గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన పాఠశాలల్లో గిరిజన విద్యార్థినిలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బంది, బాధిత ఉపాధ్యాయులను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. చర్య తీసుకోకుంటే అందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వాస్తవమే.. నివేదిక ఐటీడీఏ పీవోకు సమర్పిస్తా.. - చందన, ఏటీడ బ్ల్యూవో అందోళన విషయం తెలుసుకున్న ఏటీడ బ్ల్యూవో చందన పాఠశాలను సందర్శించారు. వివరాల ను విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. బా ధిత ఉపాధ్యాయునిపై వచ్చిన ఆరోపణ వాస్తవమేనన్నారు. నివేదికను ఐటీడీఏ పీవోకు సమర్పిస్తానని తెలిపారు. పాఠశాలను సందర్శించిన వారిలో లంబాడ హక్కుల పొరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాథోడ్ ఉతం, సర్పంచ్‌లు రాథోడ్ మధకర్, బానోత్ గజానంద్‌నాయక్, రాయి సెంటర్ జిల్లా సార్మెడి దుర్గు పటెల్, ఎల్‌హెచ్‌పీస్ జిలా అధ్యక్షులు అడే సురేశ్ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
రేవతి పరిస్థితి విషమం
పిఠాపురం/కాకినాడ మెయిన్ రోడ్డు, న్యూస్‌లైన్ : పిఠాపురంలో బుధవారం ప్రేమోన్మాది ఘాతుకంతో అగ్నికీలల్లో చిక్కుకున్న రేవతి పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. 75 శాతం శరీరం కాలిన ఆమెను గురువారం ఉదయం వరకూ కాకినాడ ప్రభుత్వాస్పతిలోని మెడికల్ ఐసీయూలో ఉంచి సర్జికల్ విభాగం అధిపతి డాక్టర్ బాబ్జీ చికిత్స అందించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో సర్జికల్ ఐసీయూలోని బర్న్స్ వార్డుకు తరలించారు. రెండు వారాల చికిత్స అనంతరం కాని ఆమె ఆరోగ్య పరిస్థితి చెప్పలేమని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట బుద్ధ చెప్పారు. ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వాస్పత్రిలో అందుబాటులో లేని మందులను బయట నుంచి తీసుకువచ్చి ఆమె కోలుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని చెప్పారు. ప్లాస్టిక్ సర్జరీ అవసరమా, లేదా అన్నది పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ సర్జన్లు వచ్చి ఆమెను పరిశీలించారు. ఎలాగైనా కూతురిని తమ దక్కించాలని రేవతి తల్లిదండ్రులు చేతులు జోడించి వైద్యులను అభ్యర్థిస్తున్నారు. మెరుగైన వైద్యసేవలందించి, ఆమె ప్రాణం కాపాడాలని కన్నీళ్లతో మొర పెట్టుకుంటున్నారు. మరోవైపు పిఠాపురం సీఐ ఎస్.రాంబాబు గురువారం సంఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. ప్రేమోన్మాది నవీన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. అతడిని కోర్టులో హాజరుపర్చడానికి సన్నద్ధమవుతున్నారు. పేదరికాన్ని గెలవాలనుకుంది.. రేవతి తండ్రి శంకర్‌బాబు కారు మెకానిక్. ఏ రోజు కష్టార్జితంతో ఆ రోజు గడుపుకొనే ఆ పేద కుటుంబంలో రెండో బిడ్డగా పుట్టిన రేవతి ఒక టో తరగతి నుంచీ ప్రథమ శ్రేణిలో నిలుస్తోంది. పెద్ద చదువు చదివి, మంచి ఉద్యోగం సంపాదించాలని, తద్వారా పేదరికాన్ని జయించాలనే పట్టుదలతో ఉండేదని తోటి విద్యార్థినులు చెబుతున్నారు. పెద్ద కుమార్తెకు అతి కష్టం మీద వివాహం జరిపించామని, చిన్న కుమార్తెకు చదువు పూర్తయ్యాక ఉన్నంతలో ఘనంగా వివాహం జరిపించాలని ఆశించామని రేవతి తల్లిదండ్రులు అంటున్నారు. ఇంతలోనే ఆ దుర్మార్గుడి కారణంగా పెళ్లి నిశ్చయించాల్సి వచ్చిందని చెపుతున్నారు. కుమార్తె తాను ఉద్యోగం సంపాదించి కుటుంబానికి ఆసరాగా నిలబడ్డాకే పెళ్లి చేద్దురు గాని అనేదని గుర్తు చేసుకుంటూ గొల్లుమంటున్నారు. నాలుగు రోజుల్లో మధుపర్కాలు కట్టుకోవలసిన తమ బిడ్డను మంటల పాలు చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా పిఠాపురంలో రేవతి కుటుంబం నివసించే వేణుగోపాలస్వామి వీధిలోని వారు ఆమె కోలుకోవాలని స్వామికి మొక్కుతున్నారు. బడికి వెళ్లాలంటేనే భయమేస్తోంది.. ప్రేమోన్మాదుల వల్ల రోజూ భయంతో బడికెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నవీన్ రోజూ రేవతిని బడికెళ్లేటపుడు ఏడిపించేవాడు. ఇంట్లో చెబితే చదువు మానిపించేస్తారని బాధపడేది. బాలికోన్నత పాఠశాల అయినా రక్షణ లేకపోవడంతో పోకిరీల ఆగడాలు మితిమీరి చాలా మంది అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు. బాలికలకు రక్షణ కల్పించకపోతే బడికెళ్లడం బతుకుపై ఆశ వదులుకోవడమే అవుతుంది. నిందితుడు నవీన్‌ను కఠినంగా శిక్షించి మా స్నేహితురాలు రేవతిని కాపాడండి. - స్వాతి, రేవతి క్లాస్మేట్ చదువు కోసం.. పరువు కోసం.. ఇలా దాడులు జరితే మేము చదువుకునేదెట్లా? గంపెడాశతో తల్లిదండ్రులు మ మ్మల్ని బడికి పంపిస్తుంటే మృగాళ్లు మా జీవితాలతో ఆడుకుం టున్నారు. ప్రేమ పేరు తో వేధిస్తున్నారు. పరువు కోసం మా తల్లిదండ్రులు, చదువుకోసం మేము బాధలను దిగమింగి జీవితాలను సాగిస్తున్నాము. ఇప్పటికైనా మా స్నేహితురాలికి పట్టిన గతి మరెవరికీ పట్టకుండా రక్షణ చర్యలు చేపట్టండి. - సోనియా, రేవతి క్లాస్మేట్ -
ఫేస్బుక్లో ఫోటోలు పెడతా.. జాగ్రత్త!
హైదరాబాద్ : ప్రేమ పేరుతో వేధించటమే కాకుండా వేరొకరితో తనకు కుదిరిన సంబంధాన్ని చెడగొట్టడానికి ప్రయత్రిస్తున్నాడని ఓ యువకుడిపై బాధితురాలు గురువారం పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం విశాఖపట్నానికి చెందిన ఉదయ్ (25) ఓ ప్రయివేట్ ఛానల్లో టెక్నీషియస్. బంజారాహిల్స్ పరిధిలోని దేవరకొండ బస్తీలో ఉంటున్న అతనికి అదే ప్రాంతానికి చెందిన యువతితో ఫోన్లో పరిచయం ఏర్పడింది. దాన్ని ఆసరాగా చేసుకున్న ఉదయ్ ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఇటీవలి ఆ యువతికి పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలుసుకున్న ఉదయ్ నిన్న ఉదయం ఆమె ఇంటికి వెళ్లాడు. తనను కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకుంటే అప్రతిష్ట పాలు చేస్తానని, ఫోటోలు ఫేస్బుక్లో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించగా నిందితుడు ఉదయ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ వేదింపులకు బీ ఫార్మసీ విద్యార్ధిని బలి
-
ప్రేమ పేరుతో వేధింపులు..బాలిక ఆత్మహత్య
కోహీర్, న్యూస్‌లైన్ : ప్రేమ పేరుతో వేధింపులు తాళలేక ఓ బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు మండలంలోని మద్రి గ్రామానికి చెందిన నడిమిదొడ్డి అడివయ్య, పూలమ్మ దంపతుల కుమార్తె మమత గురుజువాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అయితే అదే గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్ ఏడాది కాలంలో మమతను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని మమత తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు మమతను చదువు మానిపించారు. అయితే మమత ఎక్కడికి పోయినా వెంటబడి మరీ వేధించేవాడు ప్రవీణ్. దీంతో విషయాన్ని మమత తల్లిదండ్రులు గ్రామస్థులకు చెప్పి పంచాయతీ పెట్టించారు. అయినా ప్రవీణ్‌లో మార్పు రాలేదు. దీంతో ప్రవీణ్ ఆగడాలకు తీవ్ర మనస్తాపానికి గురై మమత శుక్రవారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పక్కింటివారు విషయాన్ని తల్లిదండ్రులు చెప్పడంతో వారు ఇంటికి చేరుకుని విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం కోహీర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రవీణ్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. అడివయ్య, పూలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కాగా మమత ఆఖరుది. పెద్ద కుమార్తెకు వివాహం అయ్యింది. ఇద్దరు కుమారులూ పెద్దగా చదువుకోలేదు. చెల్లిని బాగా చదివించాలనుకున్నాం చెల్లిని బాగా చదివించాలనుకున్నాం. అంతలోనే ప్రవీణ్ వేధింపు మొదలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువుపోతుందని భయపడ్డాం. అంతలోనే ఇలా జరుగుతోందని ఊహించలేదు. - రాజు, మమత సోదరుడు