ప్రేమవేధింపులకు విద్యార్థిని బలి | Tenth class student commits suicide | Sakshi

ప్రేమవేధింపులకు విద్యార్థిని బలి

Published Sun, Feb 25 2024 5:05 AM | Last Updated on Sun, Feb 25 2024 5:05 AM

Tenth class student commits suicide - Sakshi

యాచారం: ప్రేమపేరుతో పెడుతున్న వేధింపులను భరించలేక ఓ పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. గ్రీన్‌ ఫార్మాసిటీ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ నరేశ్, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... యాచారం మండలం ఆకులమైలారం గ్రామానికి చెందిన గుత్తి జంగయ్య, పద్మ దంపతుల కూతురు నవ్య(14) కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతోంది.

ఇదే గ్రామానికి చెందిన తోటి విద్యార్థి కొమ్మగోని నందీశ్వర్‌ తనను ప్రేమించాలని నవ్యను కొద్దికాలంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆరునెలల క్రితమే బాలిక తన కుటుంబసభ్యులకు చెప్పడంతో నందీశ్వర్‌ను హెచ్చరించారు. ఆ తర్వాత కొద్దిరోజులకు మళ్లీ వెంటపడటం ప్రారంభించాడు. బాలిక ఇంటి చుట్టూ తిరుగుతూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు.

ఇదే గ్రామానికి చెందిన క్లాస్‌మేట్‌ రాజేశ్‌తోపాటు మరోతోటి విద్యార్థిని సహకారంతో ఇన్‌స్ట్రాగామ్‌(బాలిక కుటుంబసభ్యుల ఫోను)లో నవ్యను వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చి ఇంట్లోని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుంది. వ్యవసాయ పనులు ముగించుకుని రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఇంటికి చేరిన తల్లిదండ్రులు తలుపులు తెరిచి చూసేసరికి చీరతో ఉరేసుకుని కనిపించింది.

నవ్య తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్న ముగ్గురు విద్యార్థులను పిలిచి విచారిస్తున్నారు. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Video

View all
Advertisement