ప్రేమ వేధింపులకు యువతి బలి
♦ ప్రేమించలేదని కిరోసిన్ పోసి
♦ నిప్పుపెట్టిన యువకులు!
♦ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలి మృతి
ఏలూరు అర్బన్: ప్రేమ వేధింపులకు ఓ యువతి బలైన సంఘటన శనివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం చాటపర్రులో చోటుచేసుకుంది. ప్రేమించలేదని తమ కుమార్తెపై ఇద్దరు యువకులు కిరోసిన్ పోసి నిప్పు పెట్టారంటూ మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పైడాల సత్యనారాయణ, వెంకటేశ్వరమ్మ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తె ఇందుమతి(18) ఇంటర్ చ దువుతోంది. అదే గ్రామంలోని కూలిపనులు చేసుకునే దగ్గుమిల్లి చినవిక్కీ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడేవాడు. అతడికి తోడుగా సోదరుడు పెదవిక్కీ, గ్రామంలోనివారి స్నేహితులు నిత్యం వేధించేవారు. విషయం తెలిసి ఇందుమతి తల్లిదండ్రులు ఆమెను చదువు మాన్పించి ఇంటివద్దనే ఉంచుతున్నారు. మూడు రోజుల కిందట తమ ఇంటి దగ్గర బైక్‌పై తిరుగుతున్న చినవిక్కీని గమనించిన ఇందుమతి తండ్రి సత్యనారాయణ అతణ్ని మందలించాడు. ఈ విషయాన్ని చినవిక్కీ అన్న పెదవిక్కీ సీరియస్‌గా తీసుకున్నాడు.
తన స్నేహితుల సహకారంతో ఇందుమతి ఉంటున్న వీధిలోని లైట్లు వెలగకుండా ఫీజులు పీకేశాడు. దీంతో ఇందుమతి తల్లిదండ్రులు శనివారం ఉదయం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై ఎన్‌ఆర్ కిషోర్‌బాబు నిందితులు చినవిక్కీ, పెదవిక్కీలను తమకు అప్పగించాలని వారి కుటుంబ సభ్యులకు కబురు పంపారు. దీంతో నిందితుల తరపున కొందరు పెద్దలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ సమస్యను గ్రామంలో పరిష్కరించుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి ఇందుమతి కేకలు వినిపించడంతో స్థానికులు వెళ్లి మంటల్లో కాలిపోతున్న ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు. తీవ్రగాయాలైన బాధితురాలిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. కాగా, శనివారం రాత్రి పొద్దుపోయాక పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
హత్యకాదు.. ఆత్మహత్య: జిల్లా ఎస్పీ
ఇందుమతి మృతి ఘటనలో శనివారం రాత్రి పొద్దుపోయాక పోలీసుల తీరు మారింది. జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఇందుమతి హత్యకు గురైనట్లు తొలుత భావించినప్పటికీ.. పరిస్థితులను గమనించి, అన్ని కోణాల్లో విచారణ చేసిన తరువాత ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తేలిందన్నారు. నిందితులు ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.