
సాక్షి, విజయవాడ పశ్చిమ: జిల్లాలోని గవర్నర్‌పేట డిపో1లో విధులు నిర్వహిస్తున్న ఓ ఉన్నతాధికారినిపై అజయ్ కుమార్ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా తననే ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని బాధిత యువతిని గత రెండు నెలలుగా వేధింపులకు గురిచేస్తున్నాడు. తనను పెళ్లిచేసుకోకపోతే చంపేస్తానంటూ ఆ యువతిపై కత్తితో దాడికి యత్నించాడు. ఈ ఘటనపై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో మంగళవారం మధ్యాహ్నం బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పెజ్జోనిపేటలో నివాసముంటున్న యువతి(33) ఆర్టీసీ గవర్నరుపేట–1 డిపోలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తుంది. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న అవుట్ సోర్సింగ్ మెకానిక్ ఎం.అజయ్‌కుమార్ రెండు నెలల నుంచి యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు.
యువతికి వేరే వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. ఈ విషయం తెలిసిన అజయ్‌కుమార్ సోమవారం రాత్రి మద్యం సేవించి యువతి ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని లేకపోతే చంపేస్తానంటూ జేబులో నుంచి కత్తి తీసి ఆమెపై దాడికి యత్నించడంతో తల్లిదండ్రులు అడ్డుకున్నారు. యువతితో సహా కుటుంబ సభ్యులంతా బయటకు పరుగు తీశారు. స్థానికులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయాడు. ఘటనపై మంగళవారం యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడిపై 307, 354డీ, 506, 452 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని నార్త్ ఏసీపీ షప్రుద్దీన్ తెలిపారు. ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment