
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని మామిడికుదురు మండలం గోగన్నమఠంలో విషాదం నెలకొంది. ఓ యువకుడు ప్రేమపేరుతో వేధింపులకు గురిచేయడంతో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న మధుశ్రీ అనే బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఇంటి ఆవరణలో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లంకె లక్ష్మీనారాయణ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు. అతని భార్య స్వగ్రామంలోనే ఉంటూ కూతురు మధుశ్రీని చదివిస్తోంది. ఈక్రమంలో అఖిల్ రాజేష్ జులాయిగా తిరుగుతూ ప్రేమపేరుతో మధుశ్రీ వెంటపడ్డాడు. పదోతరగతి నుంచే అతని వేధింపులు మొదలయ్యాయి. అయితే ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా... పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఇద్దరూ మైనర్లు కావడంతో వారి భవిష్యత్ నాశనం అవుతుందనే కారణంగా హెచ్చరించి వదిలేశారు. ఆ తర్వాత బాలికను వేరే గ్రామంలోని పాఠశాలలో చేర్పించారు.
పదోతరగతి పూర్తిచేసిన మధుశ్రీ రాజోలు శ్రీచైతన్య కాలేజీలో చేరింది. తాజాగా రాజేష్ మళ్లీ వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. బస్సు ఎక్కేడప్పుడు దిగేటప్పుడు నిత్యం వేధిస్తున్నాడు. అతని కారణంగా తల్లిదండ్రుల పరువు పోతోందని భావించిన మధుశ్రీ తీవ్ర మనస్తాపానికి గురైంది. శుక్రవారం ఉదయం ఇంటివద్ద ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురు మరణవార్త విన్న లక్ష్మీనారాయణ గల్ఫ్ నుంచి హుటాహుటిన స్వదేశానికి తిరిగొచ్చాడు. కూతురు మరణం వెనకున్న అసలు విషయాలు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయంలో వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాలిక సూసైడ్ అనంతరం ‘నన్ను వదిలి వెళ్లిపోయావా’ అంటూ రాజేష్ టిక్‌టాక్ వీడియో చేసి వాట్సాప్‌లో స్టేటస్ పెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment