ఇతర శాఖల అధికారులకది కామధేనువు
కాసులు కురిపించే కల్పతరువు
అందుకే జీవీఎంసీపై ఇతర శాఖల అధికారుల మోజు
ఇక్కడికి రావడానికి హోదా తగ్గించుకునేందుకైనా సిద్ధం
క్యూ కడుతున్న అన్ని శాఖల అధికారులు
అదిపురపాలకశాఖలోని ఒక సంస్థ. కానీ ఇప్పుడు దాదాపు అన్ని శాఖల అధికారుల దృష్టి దానిపైనే ఉంది. ఏమైనా సరే.. ఎలా అయినా సరే.. ఒక్కసారి ఆ సంస్థలోకి డిప్యుటేషన్ మీద వెళ్లాల్సిందే!.. అని పలు శాఖల అధికారులు తెగ ఆరాటపడిపోతున్నారు. ఎంతగా తాపత్రయ పడుతున్నా రంటే.. కొందరు ప్రస్తుత తమ స్థాయికితగని పోస్టు అయినా సరే.. ఓకే అంటున్నారు. ఇంత మందిని.. అంతగా ఆకర్షిస్తున్న ఆ సంస్థ.. దాని ప్రత్యేకతలేమిటయ్యా.. అంటే.. అదే మహావిశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ).. కాసులు కురిపించే కామధేనువులాంటి ఈ సంస్థలో కనీసం ఒక ఏడాదైనా పని చేస్తే.. కరువు తీరిపో తుందన్న భావన ఇతర శాఖల అధికారులది. అయితే అలా వచ్చిన వారు ఇక్కడే తిష్ట వేసేస్తున్నారు.
విశాఖపట్నం: పురపాలక శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బందికే కాదు.. ఇతర శాఖలకు చెందిన వారికి కూడా జీవీఎంసీ కల్పతరువుగా మారుతోంది. ఇక్కడ పని చేసేందుకు ఇతర శాఖల అధికారులు తెగ ఉబలాటపడుతున్నారు. ఏళ్ల తరబడి తిష్టవేసి అందిన కాడికి దండుకుంటూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు. జీవీఎంసీలో పనిచేసేందుకు మాతృశాఖకు చెందిన వారి కంటే ఇతర శాఖలకు చెందిన వారే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఈ పరిస్థితి ఏదో ఒక డిపార్టుమెంట్‌కు పరిమితం కాదు. దాదాపు అన్ని శాఖలకు చెందిన వారు జీవీఎంసీకి క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ సెక్షన్‌లో పనిచేసేందుకు పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ విభాగాలకు చెందినవారు పైరవీలకు పాల్పడుతున్నారు. చివరికి హోదాను సైతం తగ్గించుకునేందుకు వెనుకాడటం లేదు. జీవీఎంసీలో వందల కోట్ల విలువైన పనులు జరుగుతుండడం.. ప్రతి పనిలోనూ ఓ పక్క పర్సంటేజీలు.. మరో పక్క భారీగా ముడుపులు అందే అవకాశం ఉండడంతో ఇక్కడ కొద్దికాలమైనా పని చేసే అవకాశం కోసం ఆరాటపడుతున్నవారు.. తీరా ఆ అవకాశం వచ్చిన తర్వాత ఇక్కడే పాతుకుపోతున్నారు.
అబ్బే పిల్లల చదువులు, వైద్యం కోసమే!
ఇతర శాఖల కంటే జీవీఎంసీలోనే పనిచేసేందుకు ఎందుకు ఆసక్తి చూపుతున్నారని ప్రశ్నిస్తే.. విశాఖలో ఉన్న విద్య, వైద్య సౌకర్యాల కోసమేనని కొందరు సమర్థించుకుంటున్నారు. కానీ వాస్తవం అది కాదన్నది బహిరంగ రహస్యం. అదే వాస్తవమైతే.. నగరంలో ఇంకా చాలా శాఖలు, విభాగాలు ఉన్నా.. ఒక్క జీవీఎంసీకే ఎందుకు క్యూ కడతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇటువంటి వారందరికీ జీవీఎంసీ కామధేనువులా కన్పిస్తోంది. పిండుకున్న వాడికి పిండుకున్నంత అన్నట్టుగా ఇక్కడి పరిస్థితి ఉంది. ఈ కారణంగానే ఇక్కడ పనిచేసేందుకు ఇతర శాఖల అధికారులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే ఇక్కడ తిష్ట వేసిన అధికారులను పరిశీలిస్తే..
పంచాయతీరాజ్ శాఖ నుంచి డిప్యుటేషన్‌పై కుమార్ రాజు, కృష్ణకుమార్, వెంకట్రావు, బాలాజీలు జీవీఎంసీకి వచ్చారు. కుమార్‌రాజు, కృష్ణకుమార్‌లు నాలుగైదేళ్లుగా ఇక్కడే పాతుకుపోయారు. వెంకట్రావు వచ్చి మూడేళ్లు దాటి పోయింది. ఇటీవలే డిప్యుటేషన్‌పై వచ్చిన బాలాజీ కీలకమైన టీఎస్‌ఆర్ వాటర్ వర్క్స్ ఏఈగా బాధ్యతలు చేపట్టారు. పంచాయతీరాజ్‌లో డిప్యుటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హోదాలో పనిచేస్తుండగా, తమ హోదాను తగ్గించుకుని ఏఈలుగా ఇక్కడ పనిచేసేందుకు వస్తున్నారు. వీరే కాదు.. జీవీఎంసీ రెవెన్యూ, పబ్లిక్‌హెల్త్, ఎడ్యుకేషన్, యూసీడీ, యూజీడీ విభాగాల్లో కూడా ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన పనిచేస్తున్న వారు లెక్కకు మించే ఉన్నారు.
జోనల్ కమిషనర్‌గా చక్రధరరావు
తాజాగా డిప్యుటేషన్‌పై మరో అధికారి ఇక్కడకు వస్తున్నారు. జిల్లా స్థాయి అధికారిగా పనిచేస్తున్న ఆయన ఇక్కడ జోనల్ కమిషనర్‌గా పని చేసేందుకు వస్తుండటం గమనార్హం. పశ్చిమగోదావరి జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వి.చక్రధరరావును జీవీఎంసీలో జోనల్ కమిషనర్‌గా బదిలీపై నియమించారు. ఈయన మాతృశాఖ సాంఘిక సంక్షేమ శాఖ. ఈయన గతంలో డిప్యుటేషన్‌పై తూర్పుగోదావరి జిల్లా ఆర్‌వీఎం(సర్వశిక్ష అభియాన్) పీవోగా పనిచేశారు. అక్కడ పనిచేసినంత కాలం ఈయనపై తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దుస్తుల కొనుగోలు, అదనపు తరగతి గదుల నిర్మాణంలో సుమారు రూ.5 కోట్లకు పైగా అవినీతి జరిగినట్టు విజిలెన్స్ విచారణలో సైతం గుర్తించినట్టు సమాచారం. ప్రస్తుతం జిల్లా స్థాయి అధికారిగా పనిచేస్తున్న చక్రధరరావు ఇక్కడ ఒక జోన్‌కు కమిషనర్‌గా పనిచేసేందుకు వస్తున్నారు. ఏడాది పాటు ఈయన డిప్యుటేషన్‌కు అనుమతినిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి కరికాల వలవన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా ఇతర శాఖల అధికారులు ఇక్కడ పనిచేయడానికి క్యూ కడుతుండడం చూస్తుంటే జీవీఎంసీ కామధేనువనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.