Dipyutesan
-
ఎందుకో.. ‘మహా’ మక్కువ!
ఇతర శాఖల అధికారులకది కామధేనువు కాసులు కురిపించే కల్పతరువు అందుకే జీవీఎంసీపై ఇతర శాఖల అధికారుల మోజు ఇక్కడికి రావడానికి హోదా తగ్గించుకునేందుకైనా సిద్ధం క్యూ కడుతున్న అన్ని శాఖల అధికారులు అదిపురపాలకశాఖలోని ఒక సంస్థ. కానీ ఇప్పుడు దాదాపు అన్ని శాఖల అధికారుల దృష్టి దానిపైనే ఉంది. ఏమైనా సరే.. ఎలా అయినా సరే.. ఒక్కసారి ఆ సంస్థలోకి డిప్యుటేషన్ మీద వెళ్లాల్సిందే!.. అని పలు శాఖల అధికారులు తెగ ఆరాటపడిపోతున్నారు. ఎంతగా తాపత్రయ పడుతున్నా రంటే.. కొందరు ప్రస్తుత తమ స్థాయికితగని పోస్టు అయినా సరే.. ఓకే అంటున్నారు. ఇంత మందిని.. అంతగా ఆకర్షిస్తున్న ఆ సంస్థ.. దాని ప్రత్యేకతలేమిటయ్యా.. అంటే.. అదే మహావిశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ).. కాసులు కురిపించే కామధేనువులాంటి ఈ సంస్థలో కనీసం ఒక ఏడాదైనా పని చేస్తే.. కరువు తీరిపో తుందన్న భావన ఇతర శాఖల అధికారులది. అయితే అలా వచ్చిన వారు ఇక్కడే తిష్ట వేసేస్తున్నారు. విశాఖపట్నం: పురపాలక శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బందికే కాదు.. ఇతర శాఖలకు చెందిన వారికి కూడా జీవీఎంసీ కల్పతరువుగా మారుతోంది. ఇక్కడ పని చేసేందుకు ఇతర శాఖల అధికారులు తెగ ఉబలాటపడుతున్నారు. ఏళ్ల తరబడి తిష్టవేసి అందిన కాడికి దండుకుంటూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు. జీవీఎంసీలో పనిచేసేందుకు మాతృశాఖకు చెందిన వారి కంటే ఇతర శాఖలకు చెందిన వారే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఈ పరిస్థితి ఏదో ఒక డిపార్టుమెంట్‌కు పరిమితం కాదు. దాదాపు అన్ని శాఖలకు చెందిన వారు జీవీఎంసీకి క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఇంజినీరింగ్ సెక్షన్లో పనిచేసేందుకు పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ విభాగాలకు చెందినవారు పైరవీలకు పాల్పడుతున్నారు. చివరికి హోదాను సైతం తగ్గించుకునేందుకు వెనుకాడటం లేదు. జీవీఎంసీలో వందల కోట్ల విలువైన పనులు జరుగుతుండడం.. ప్రతి పనిలోనూ ఓ పక్క పర్సంటేజీలు.. మరో పక్క భారీగా ముడుపులు అందే అవకాశం ఉండడంతో ఇక్కడ కొద్దికాలమైనా పని చేసే అవకాశం కోసం ఆరాటపడుతున్నవారు.. తీరా ఆ అవకాశం వచ్చిన తర్వాత ఇక్కడే పాతుకుపోతున్నారు. అబ్బే పిల్లల చదువులు, వైద్యం కోసమే! ఇతర శాఖల కంటే జీవీఎంసీలోనే పనిచేసేందుకు ఎందుకు ఆసక్తి చూపుతున్నారని ప్రశ్నిస్తే.. విశాఖలో ఉన్న విద్య, వైద్య సౌకర్యాల కోసమేనని కొందరు సమర్థించుకుంటున్నారు. కానీ వాస్తవం అది కాదన్నది బహిరంగ రహస్యం. అదే వాస్తవమైతే.. నగరంలో ఇంకా చాలా శాఖలు, విభాగాలు ఉన్నా.. ఒక్క జీవీఎంసీకే ఎందుకు క్యూ కడతారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇటువంటి వారందరికీ జీవీఎంసీ కామధేనువులా కన్పిస్తోంది. పిండుకున్న వాడికి పిండుకున్నంత అన్నట్టుగా ఇక్కడి పరిస్థితి ఉంది. ఈ కారణంగానే ఇక్కడ పనిచేసేందుకు ఇతర శాఖల అధికారులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే ఇక్కడ తిష్ట వేసిన అధికారులను పరిశీలిస్తే.. పంచాయతీరాజ్ శాఖ నుంచి డిప్యుటేషన్‌పై కుమార్ రాజు, కృష్ణకుమార్, వెంకట్రావు, బాలాజీలు జీవీఎంసీకి వచ్చారు. కుమార్రాజు, కృష్ణకుమార్‌లు నాలుగైదేళ్లుగా ఇక్కడే పాతుకుపోయారు. వెంకట్రావు వచ్చి మూడేళ్లు దాటి పోయింది. ఇటీవలే డిప్యుటేషన్‌పై వచ్చిన బాలాజీ కీలకమైన టీఎస్ఆర్ వాటర్ వర్క్స్ ఏఈగా బాధ్యతలు చేపట్టారు. పంచాయతీరాజ్‌లో డిప్యుటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హోదాలో పనిచేస్తుండగా, తమ హోదాను తగ్గించుకుని ఏఈలుగా ఇక్కడ పనిచేసేందుకు వస్తున్నారు. వీరే కాదు.. జీవీఎంసీ రెవెన్యూ, పబ్లిక్‌హెల్త్, ఎడ్యుకేషన్, యూసీడీ, యూజీడీ విభాగాల్లో కూడా ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన పనిచేస్తున్న వారు లెక్కకు మించే ఉన్నారు. జోనల్ కమిషనర్‌గా చక్రధరరావు తాజాగా డిప్యుటేషన్‌పై మరో అధికారి ఇక్కడకు వస్తున్నారు. జిల్లా స్థాయి అధికారిగా పనిచేస్తున్న ఆయన ఇక్కడ జోనల్ కమిషనర్‌గా పని చేసేందుకు వస్తుండటం గమనార్హం. పశ్చిమగోదావరి జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వి.చక్రధరరావును జీవీఎంసీలో జోనల్ కమిషనర్‌గా బదిలీపై నియమించారు. ఈయన మాతృశాఖ సాంఘిక సంక్షేమ శాఖ. ఈయన గతంలో డిప్యుటేషన్‌పై తూర్పుగోదావరి జిల్లా ఆర్వీఎం(సర్వశిక్ష అభియాన్) పీవోగా పనిచేశారు. అక్కడ పనిచేసినంత కాలం ఈయనపై తీవ్ర అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దుస్తుల కొనుగోలు, అదనపు తరగతి గదుల నిర్మాణంలో సుమారు రూ.5 కోట్లకు పైగా అవినీతి జరిగినట్టు విజిలెన్స్ విచారణలో సైతం గుర్తించినట్టు సమాచారం. ప్రస్తుతం జిల్లా స్థాయి అధికారిగా పనిచేస్తున్న చక్రధరరావు ఇక్కడ ఒక జోన్‌కు కమిషనర్‌గా పనిచేసేందుకు వస్తున్నారు. ఏడాది పాటు ఈయన డిప్యుటేషన్‌కు అనుమతినిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి కరికాల వలవన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా ఇతర శాఖల అధికారులు ఇక్కడ పనిచేయడానికి క్యూ కడుతుండడం చూస్తుంటే జీవీఎంసీ కామధేనువనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. -
17 ఏళ్లుగా కూర్చోబెట్టి జీతం..!
మూడు జిల్లాల్లో సుమారు 100 మంది.. వైద్య ఆరోగ్య శాఖలో చిత్రం నిజామాబాద్ : పని లేకున్నా వారికి వేతనాలు మాత్రం నెలనెలా సక్రమంగా అందుతాయి. కొందరు డిప్యుటేషన్ మీద కొనసాగితే, మరికొందరు ఆఫీసుకు వస్తారు..కూర్చుంటారు .. వెళ్లిపోతారు. ఇంకొందరు ఇక్కడ సంతకాలు చేసి బయట దర్జాగా వ్యాపారం చేసుకుంటారు. ఇదీ నిజామాబాద్ వైద్య, ఆరోగ్యశాఖలో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న తంతు. ఓ వైపు రోగాలు విజృంభిస్తున్నా, వైద్యం అందక రోగులు విలవిలలాడుతున్నా, ఖాళీల కొరతతో వైద్యం అందలేని పరిస్థితి నెలకొన్నా... శిక్షణ పూర్తయిన సిబ్బందికి పనులు అప్పగించకుండా వేతనాలు చెల్లిస్తున్నారు. ఇలా మూడు జిల్లాల్లో 100 మంది ఉద్యోగులు ఉన్నారు. పనిలేదని తెలిసిన కొందరు ఉద్యోగులు ఇక్కడికి డిప్యుటేషన్‌పై వచ్చి కొనసాగుతున్నారు. పురుష ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడానికి 1992లో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్‌లలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి 60 సీట్లను కేటాయించారు. 1998 వరకు ఈ కేంద్రాలు పని చేశాయి. అయితే, 1998లో పురుష ఆరోగ్య కార్యకర్తల పనితీరు సంతృప్తిగా లేదని, వారి అవసరం లేదని అప్పటి వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ రేచల్చటర్జీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో నాటి ప్రభుత్వం ఈ శిక్షణా కేంద్రాలను ఎత్తివేసింది. కేంద్రాలను ఎత్తివేసిన ప్రభుత్వం అందులో పని చేసే సిబ్బంది, ఉద్యోగుల విషయాన్ని పట్టించుకోలేదు. నిజామాబాద్ శిక్షణ కేంద్రానికి 14 మంది, వరంగల్ కేంద్రానికి 14 మంది చొప్పున ఉద్యోగులను నియమించారు. ఇందులో ఒకరు మెడికల్ ఆఫీసర్, ఇద్దరు హెల్త్ ఎడ్యుకేటర్లు, ఇద్దరు ఎంపీహెచ్‌వోలు, ఒకరు బీఎస్సీ నర్సింగ్ టీచింగ్ సిబ్బంది, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు జూనియర్ అసిసెంట్లు, ఇద్దరు నాల్గో తరగతి ఉద్యోగులు, ఇద్దరు అటెండర్లు చొప్పున ఉన్నారు. హైదరాబాద్ శిక్షణ కేంద్రంలో ముగ్గురు వైద్యాధికారులు, ఆరుగురు బీఎస్సీ నర్సింగ్ టీచింగ్ సిబ్బంది, నలుగురు సీనియర్ అసిస్టెంట్లు, ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లు, పద హారు మంది నాల్గో తరగతి సిబ్బంది, ఆరుగురు అటెండర్లు, ఆరుగురు స్వీపర్లు ఉన్నారు. హైదరాబాద్‌లో నాడు వసతిగృహం కూడా ఏర్పాటు చేయడంతో ఓ వార్డెన్, ప్రిన్సిపాల్, సిబ్బందితో కలసి మరో 14 మంది ఉన్నారు. శిక్షణ కేంద్రాలు ఎత్తేసిన తర్వాత వీరికి పని లేదు. ఇందులో కొందరిని డిప్యుటేషన్‌పై వేరే ప్రాంతాలకు కేటాయించగా, మిగతావారు 17 ఏళ్లుగా ఖాళీగా కూర్చొని వేతనాలు పొందుతున్నారు. మాకు ఆదేశాలు లేవు శిక్షణ కేంద్రం సిబ్బందిని, ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు కేటాయించాలని ఆదేశాలు రాలేదు. కానీ, ఎక్కడైనా అవసరం ఏర్పడితే డిప్యుటేషన్‌పై కేటాయిస్తున్నాం. మరికొందరు శిక్షణ కేంద్రంలోనే కొనసాగుతున్నారు. వీరిని వెంటనే వేరే ప్రాంతాలకు వేయాలంటే ఉన్నతాధికారుల అనుమతి కావాలి - బసవేశ్వరి, ఇన్చార్జి డీఎంహెచ్‌వో -
మంత్రి ఇలాకా అని గుర్తులేదా?
మెరకముడిదాం: సాక్షాత్తు మంత్రి ఇలాకా అని తెలిసినప్పటికీ జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులు మెరకముడిదాం పీహెచ్‌సీపై అలక్ష్యం వహిస్తున్నారు, ఇక్కడి వైద్యాధికారిని మరో ప్రదేశానికి డిప్యుటేషన్‌పై పంపించేశారు. ఫలితంగా ఈ పీహెచ్సీలో వైద్యసేవలు అందడం గగనమైపోయింది. మండల కేంద్రమైన మెరకముడిదాం పీహెచ్సీ వైద్యాధికారిగా ఎస్.మాధురి కొద్ది కాలంగా పని చేస్తున్నారు. ఆమె వచ్చి మూడు నెలలు కూడా కాకముందే జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఆమెను ఎల్.కోట పీహెచ్‌సీకి డిప్యుటేషన్‌పై వేశారు. దీంతో ఆమె ఈనెల 4వతేదీ నుంచి పీహెచ్‌సీకి రావడం లేదు. వైద్యులు లేకపోవడంతో పీహెచ్సీలో వైద్యసేవలను ఇక్కడి స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న అన్నామణి అందిస్తున్నారు. వాస్తవానికి మెరకముడిదాం పీహెచ్సీలో ఇద్దరు వైద్యాధికారులు ఉండాల్సి ఉండగా ఒక్క వైద్యాధికారే ఉన్నారు. రెండో ైవె ద్యాధికారి పోస్టు కొన్నేళ్లగా ఖాళీగానే ఉంది. జిల్లా అధికారులు రెండో వైద్యాధికారి పోస్టును భర్తీ చేస్తారని అంతా ఆశిస్తూ ఉంటే దానికి భిన్నంగా ఉన్న ఒక్క వైద్యాధికారికీ డిప్యుటేషన్ వేయడంతో విస్తుపోతున్నారు. ఈ పీహెచ్సీలో నిత్యం వందలాది మంది రోగులు వైద్యసేవలు పొందుతూ ఉంటారు. అలాంటి పీహెచ్సీలో ఉన్న ఒక్క వైద్యాధికారినీ మరో పీహెచ్‌సీకి డిప్యుటేషన్ వేయడం దారుణమని, మెరకముడిదాం పీహెచ్సీ పరిధిలోని రోగులను గాలికి వదిలేద్దామని జిల్లా అధికారులకు అనిపించిందో ఏమోనంటూ స్థానికులు ఆశ్చర్యం వెళ్లగక్కుతున్నారు. ఇంత జరిగినా అటు మంత్రి మృణాళిని కానీ, ఇటు స్థానిక పాలకులకు కానీ చీమకుట్టినట్లు అయినా లేకపోవడం చూస్తున్న పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ పీహెచ్సీలో ఎన్నో ఖాళీలు ఉన్నప్పటికీ జిల్లావైద్యాధికారులకు చిన్న చూపెందుకో అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిత్యం అందుబాటులో ఉండాల్సిన ల్యాబ్టెక్నీషియన్ను గర్భాం, దత్తిరాజేరు పీహెచ్‌సీలకు డిప్యుటేషన్‌పై వేశారు. ఈ విషయమై మంత్రి మృణాళిని కల్పించుకుని వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిన వైద్యాధికారిణి మాధురి డిప్యుటేషన్‌ను రద్దు చేయించి కనీసం ఆమె ఒక్కరినైనా మళ్లీ ఇక్కడ వైద్యాధికారిగా నియమించాలని పలువురు కోరుతున్నారు.