మంత్రి ఇలాకా అని గుర్తులేదా?
మెరకముడిదాం: సాక్షాత్తు మంత్రి ఇలాకా అని తెలిసినప్పటికీ జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులు మెరకముడిదాం పీహెచ్‌సీపై అలక్ష్యం వహిస్తున్నారు, ఇక్కడి వైద్యాధికారిని మరో ప్రదేశానికి డిప్యుటేషన్‌పై పంపించేశారు. ఫలితంగా ఈ పీహెచ్‌సీలో వైద్యసేవలు అందడం గగనమైపోయింది. మండల కేంద్రమైన మెరకముడిదాం పీహెచ్‌సీ వైద్యాధికారిగా ఎస్.మాధురి కొద్ది కాలంగా పని చేస్తున్నారు. ఆమె వచ్చి మూడు నెలలు కూడా కాకముందే జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఆమెను ఎల్.కోట పీహెచ్‌సీకి డిప్యుటేషన్‌పై వేశారు. దీంతో ఆమె ఈనెల 4వతేదీ నుంచి పీహెచ్‌సీకి రావడం లేదు. వైద్యులు లేకపోవడంతో పీహెచ్‌సీలో వైద్యసేవలను ఇక్కడి స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న అన్నామణి అందిస్తున్నారు.
వాస్తవానికి మెరకముడిదాం పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యాధికారులు ఉండాల్సి ఉండగా ఒక్క వైద్యాధికారే ఉన్నారు. రెండో ైవె ద్యాధికారి పోస్టు కొన్నేళ్లగా ఖాళీగానే ఉంది. జిల్లా అధికారులు రెండో వైద్యాధికారి పోస్టును భర్తీ చేస్తారని అంతా ఆశిస్తూ ఉంటే దానికి భిన్నంగా ఉన్న ఒక్క వైద్యాధికారికీ డిప్యుటేషన్ వేయడంతో విస్తుపోతున్నారు. ఈ పీహెచ్‌సీలో నిత్యం వందలాది మంది రోగులు వైద్యసేవలు పొందుతూ ఉంటారు. అలాంటి పీహెచ్‌సీలో ఉన్న ఒక్క వైద్యాధికారినీ మరో పీహెచ్‌సీకి డిప్యుటేషన్ వేయడం దారుణమని, మెరకముడిదాం పీహెచ్‌సీ పరిధిలోని రోగులను గాలికి వదిలేద్దామని జిల్లా అధికారులకు అనిపించిందో ఏమోనంటూ స్థానికులు ఆశ్చర్యం వెళ్లగక్కుతున్నారు.
ఇంత జరిగినా అటు మంత్రి మృణాళిని కానీ, ఇటు స్థానిక పాలకులకు కానీ చీమకుట్టినట్లు అయినా లేకపోవడం చూస్తున్న పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ పీహెచ్‌సీలో ఎన్నో ఖాళీలు ఉన్నప్పటికీ జిల్లావైద్యాధికారులకు చిన్న చూపెందుకో అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిత్యం అందుబాటులో ఉండాల్సిన ల్యాబ్‌టెక్నీషియన్‌ను గర్భాం, దత్తిరాజేరు పీహెచ్‌సీలకు డిప్యుటేషన్‌పై వేశారు. ఈ విషయమై మంత్రి మృణాళిని కల్పించుకుని వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిన వైద్యాధికారిణి మాధురి డిప్యుటేషన్‌ను రద్దు చేయించి కనీసం ఆమె ఒక్కరినైనా మళ్లీ ఇక్కడ వైద్యాధికారిగా నియమించాలని పలువురు కోరుతున్నారు.