Merakamudidam
-
సన్యాసుల వేషంలో వచ్చి.. బాలికల కిడ్నాప్‌నకు యత్నం
మెరకముడిదాం: పాఠశాలకు వెళుతోన్న ఇద్దరు బాలికలను సన్యాసి వేషంలో ఆటోలో భిక్షాటనకు వచ్చిన కొందరు అటకాయించి కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. పోలీసులు, బాలికలు తెలిపిన వివరాల ప్రకారం..విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం ఊటపల్లికి చెందిన ఇద్దరు బాలికలు మెరకముడిదాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. వీరు గురువారం ఉదయం సైకిళ్లపై పాఠశాలకు బయలుదేరారు. గాదెల మర్రివలస కూడలి వద్దకు వచ్చేసరికి అక్కడ సన్యాసి వేషాల్లో ఉన్న కొందరు వీరిని అడ్డగించే యత్నం చేశారు. బాలికలు కాస్త వేగంగా సైకిళ్లు తొక్కడంతో కొద్ది దూరం వెంబడించారు. అదే సమయంలో ప్రయాణికులతో కూడిన ఆటో అటువైపుగా రావడాన్ని గమనించిన సన్యాసులు వెనుదిరిగారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆటో బాలికలు వేగంగా మెరకముడిదాం చేరుకుని విషయాన్ని స్థానికులకు తెలిపారు. మెరకముడిదాం, ఊటపల్లి వాసులు అప్రమత్తమై మెరకముడిదాంకు సమీపంలో సన్యాసులను పట్టుకుని బుదరాయవలస పోలీసులకు అప్పగించారు. రెండు ఆటోలతో పాటు 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిని మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. ఏడాది కిందట పార్వతీపురానికి చేరుకున్న వీరు కొన్నాళ్లు తగరపువలసలోను, 3 రోజుల కిందట బాడంగి వచ్చి భిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న 11 మందిలో నలుగురు చిన్నారులు, ఇద్దరు ఆడపిల్లలు, ఐదుగురు మగవారు ఉన్నారు. వీరి ఆధార్ కార్డులను పరిశీలించగా వీరిపై గతంలో ఎలాంటి కేసులు లేవని, విచారిస్తున్నామని, కిడ్నాప్‌కు ప్రయత్నించినట్టు తేలితే కేసు నమోదు చేస్తామని ఎస్ఐ సీహెచ్ నవీన్ పడాల్ తెలిపారు. -
తోటపల్లి నీరు తీసుకొస్తాం: బొత్స
సాక్షి, మెరకముడిదాం: మండలానికి తోటపల్లి కాలువ ద్వారా నీటిని తీసుకొస్తామని వైఎస్సార్సీసీ రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. మండలంలోని ఉత్తరావల్లిలో మంగళవారం నిర్వహించిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించాల ని కోరారు. మహానేత వైఎస్సార్ అందించిన పాలన త్వరలోనే రానున్నదని చెప్పారు. చీపురుపల్లి నియోజకవర్గంలో రెండు సార్లు గెలిపించారని, ఇప్పుడు మళ్లీ గెలిపించాలని ప్రజలను కోరారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మెరకముడిదాం మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చుదిద్దుతానని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 11న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు.. -
మంత్రి ఇలాకాలో కార్మికుల ‘ఆకలి కేకలు’
మెరకముడిదాం : రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖామంత్రి కిమిడి మృణాళిని సొంత ఇలాకాలో ఉన్న రెండు ఫెర్రో పరిశ్రమలు మూతపడడంతో సుమారు నాలుగు వేల మంది కార్మికులు, వారి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. మెరకముడిదాం మండలం గర్భాం సమీపంలో ఉన్న ఆంధ్రా ఫెర్రోఅల్లాయీస్ పరిశ్రమ హుద్‌హుద్ తుపాను కారణంగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో యాజమాన్యం పరిశ్రమను తాత్కాలికంగా మూసివేసింది. విద్యుత్ సరఫరా వచ్చేంత వరకూ కార్మికులు విధులకు హాజరుకావొద్దని యాజమాన్యం ప్రకటించింది. దీన్ని కార్మికులు వ్యతిరేకించారు. ఈ దశలో యాజమాన్యం, కార్మికుల మధ్య చర్చలు జరిగాయి. పరిశ్రమకు వారం రోజుల్లో విద్యుత్ సరఫరా వచ్చినా , లేకపోయినా కార్మికులను విధుల్లోకి తీసుకుంటామని యాజమాన్యం ఒప్పుకుంది. దీనికి కార్మికులు కూడా సరేననడంతో అప్పటికి సమస్య కొలిక్కి వచ్చింది. అయితే చర్చలు జరిగిన రెండో రోజునే పరిశ్రమకు విద్యుత్ సరాఫరా రావడంతో పరిశ్రమ యాజమాన్యం కార్మికులను విధుల్లోకి రావాలని కోరింది. అయితే తాము విధులకు హాజరుకాని రోజులకు కూడా వేతనం చెల్లిస్తేనే విధులకు హాజరవుతామని, లేదంటే హాజరుకామని కార్మికులు మొండికేశారు. దీనికి యాజమాన్యం ఒప్పుకోలేదు. అనంతరం ఇరువర్గాల మధ్య చర్చలు జరిగినా ఫలితం తేలకపోవడంతో యాజమాన్యం ఈ నెల 8వ తేదీన లాకౌట్ ప్రకటించింది. అలాగే మరోవైపు గరివిడి మండలంలోని ఫేకర్ పరిశ్రమ మూతపడి 9 నెలలు కావస్తోంది. ఈ విషయాన్ని కార్మికులు పలుమార్లు మంత్రి మృణాళిని దృష్టికి, కార్మిక శాఖామంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లారు. నెలలు గడుస్తున్నా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఈ పరిశ్రమలు తెరిచే పరిస్థితి కానరాకపోవడంతో కార్మికులు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి ఇలాకాలోని పరిశ్రమలు పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన ప్రాంతాల్లో పరిశ్రమల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా మంత్రి మృణాళిని కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. -
మంత్రి ఇలాకా అని గుర్తులేదా?
మెరకముడిదాం: సాక్షాత్తు మంత్రి ఇలాకా అని తెలిసినప్పటికీ జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులు మెరకముడిదాం పీహెచ్‌సీపై అలక్ష్యం వహిస్తున్నారు, ఇక్కడి వైద్యాధికారిని మరో ప్రదేశానికి డిప్యుటేషన్‌పై పంపించేశారు. ఫలితంగా ఈ పీహెచ్సీలో వైద్యసేవలు అందడం గగనమైపోయింది. మండల కేంద్రమైన మెరకముడిదాం పీహెచ్సీ వైద్యాధికారిగా ఎస్.మాధురి కొద్ది కాలంగా పని చేస్తున్నారు. ఆమె వచ్చి మూడు నెలలు కూడా కాకముందే జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఆమెను ఎల్.కోట పీహెచ్‌సీకి డిప్యుటేషన్‌పై వేశారు. దీంతో ఆమె ఈనెల 4వతేదీ నుంచి పీహెచ్‌సీకి రావడం లేదు. వైద్యులు లేకపోవడంతో పీహెచ్సీలో వైద్యసేవలను ఇక్కడి స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న అన్నామణి అందిస్తున్నారు. వాస్తవానికి మెరకముడిదాం పీహెచ్సీలో ఇద్దరు వైద్యాధికారులు ఉండాల్సి ఉండగా ఒక్క వైద్యాధికారే ఉన్నారు. రెండో ైవె ద్యాధికారి పోస్టు కొన్నేళ్లగా ఖాళీగానే ఉంది. జిల్లా అధికారులు రెండో వైద్యాధికారి పోస్టును భర్తీ చేస్తారని అంతా ఆశిస్తూ ఉంటే దానికి భిన్నంగా ఉన్న ఒక్క వైద్యాధికారికీ డిప్యుటేషన్ వేయడంతో విస్తుపోతున్నారు. ఈ పీహెచ్సీలో నిత్యం వందలాది మంది రోగులు వైద్యసేవలు పొందుతూ ఉంటారు. అలాంటి పీహెచ్సీలో ఉన్న ఒక్క వైద్యాధికారినీ మరో పీహెచ్‌సీకి డిప్యుటేషన్ వేయడం దారుణమని, మెరకముడిదాం పీహెచ్సీ పరిధిలోని రోగులను గాలికి వదిలేద్దామని జిల్లా అధికారులకు అనిపించిందో ఏమోనంటూ స్థానికులు ఆశ్చర్యం వెళ్లగక్కుతున్నారు. ఇంత జరిగినా అటు మంత్రి మృణాళిని కానీ, ఇటు స్థానిక పాలకులకు కానీ చీమకుట్టినట్లు అయినా లేకపోవడం చూస్తున్న పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ పీహెచ్సీలో ఎన్నో ఖాళీలు ఉన్నప్పటికీ జిల్లావైద్యాధికారులకు చిన్న చూపెందుకో అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిత్యం అందుబాటులో ఉండాల్సిన ల్యాబ్టెక్నీషియన్ను గర్భాం, దత్తిరాజేరు పీహెచ్‌సీలకు డిప్యుటేషన్‌పై వేశారు. ఈ విషయమై మంత్రి మృణాళిని కల్పించుకుని వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిన వైద్యాధికారిణి మాధురి డిప్యుటేషన్‌ను రద్దు చేయించి కనీసం ఆమె ఒక్కరినైనా మళ్లీ ఇక్కడ వైద్యాధికారిగా నియమించాలని పలువురు కోరుతున్నారు. -
ప్రజా ప్రతినిధులకు ఇదేనా మర్యాద..?
మెరకముడిదాం: పంచాయతీ వార్డు మెంబర్లంటే చులకనగా కనిపిస్తున్నామా? శిక్షణ తరగతులకు పిలిచి అవమానపరుస్తారా.. ప్ర జాప్రతినిధులకు ఇచ్చే గౌరవమిదేనా? అంటూ శిక్షణాతరగతులకు ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన పలువురు వార్డు మెంబర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మెరకముడిదాం మం డలంలోని 24 పంచాయతీలకు చెందిన 240 మంది వార్డుమెంబర్లకు శిక్షణ తరగతులు నిర్వహించమని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో భాగంగా ముందుగా ఐదు పంచాయతీలకు చెందిన వార్డు మెంబర్లకు శిక్షణ ఇచ్చారు. అయితే వార్డు మెంబర్లకు శిక్షణ తరగతులకు ప్రభుత్వం రూ.1,40,300 మంజూరు చేసింది. ఈనిధులను ఒక్కో వార్డు మెంబరుకు రెండురోజుల శిక్షణ తరగతులకు సంబంధించి భో జనానికి రూ.200, టీఏ,డీఏలకు రూ.250 చొప్పున పంపిణీ చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే అధికారులు మాత్రం నాణ్యతలేని భోజనం వారికి పెట్టడమే కాకుండా, ఒక్కో వార్డు మెంబరుకు రూ.100 చొప్పున పంపిణీ చేసి చేతులు దులిపేసుకున్నారు. దీనికి వార్డు మెంబర్లు కోట్లఅప్పలస్వామి, బెహరానరసింహమూర్తి, మామిడిసూర్యనారాయణ, రౌతుసూర్యనారాయణ, గవిడిశంకర్రావు, మజ్జిఅప్పలనాయుడు, ఎలకల లక్ష్మి, ఆల్తిరాజేశ్వరి, రెడ్డిసత్యవతి తదితరులు రెండురోజులు శిక్షణ ఇచ్చినట్టు అధికారులు రాసుకుని తమకు మాత్రం రూ.100, నాణ్యతలేని భోజనం రోడ్డుపై పెట్టి అవమానించారని ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. శిక్షణకు అని పిలిచి మరీ అధికారులు అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం శిక్షణ ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం మంజూరు చేసిన టీఏ, డీఏలను సక్రమంగా పంపిణీ చేయకపోతే మొత్తం 24పంచాయతీలకు చెందిన వార్డు మెంబర్లందరూ కలిసి కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.