ప్రజా ప్రతినిధులకు ఇదేనా మర్యాద..?
మెరకముడిదాం: పంచాయతీ వార్డు మెంబర్లంటే చులకనగా కనిపిస్తున్నామా? శిక్షణ తరగతులకు పిలిచి అవమానపరుస్తారా.. ప్ర జాప్రతినిధులకు ఇచ్చే గౌరవమిదేనా? అంటూ శిక్షణాతరగతులకు ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన పలువురు వార్డు మెంబర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మెరకముడిదాం మం డలంలోని 24 పంచాయతీలకు చెందిన 240 మంది వార్డుమెంబర్లకు శిక్షణ తరగతులు నిర్వహించమని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో భాగంగా ముందుగా ఐదు పంచాయతీలకు చెందిన వార్డు మెంబర్లకు శిక్షణ ఇచ్చారు.
అయితే వార్డు మెంబర్లకు శిక్షణ తరగతులకు ప్రభుత్వం రూ.1,40,300 మంజూరు చేసింది. ఈనిధులను ఒక్కో వార్డు మెంబరుకు రెండురోజుల శిక్షణ తరగతులకు సంబంధించి భో జనానికి రూ.200, టీఏ,డీఏలకు రూ.250 చొప్పున పంపిణీ చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే అధికారులు మాత్రం నాణ్యతలేని భోజనం వారికి పెట్టడమే కాకుండా, ఒక్కో వార్డు మెంబరుకు రూ.100 చొప్పున పంపిణీ చేసి చేతులు దులిపేసుకున్నారు. దీనికి వార్డు మెంబర్లు కోట్లఅప్పలస్వామి, బెహరానరసింహమూర్తి, మామిడిసూర్యనారాయణ, రౌతుసూర్యనారాయణ,
గవిడిశంకర్రావు, మజ్జిఅప్పలనాయుడు, ఎలకల లక్ష్మి, ఆల్తిరాజేశ్వరి, రెడ్డిసత్యవతి తదితరులు రెండురోజులు శిక్షణ ఇచ్చినట్టు అధికారులు రాసుకుని తమకు మాత్రం రూ.100, నాణ్యతలేని భోజనం రోడ్డుపై పెట్టి అవమానించారని ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. శిక్షణకు అని పిలిచి మరీ అధికారులు అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం శిక్షణ ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం మంజూరు చేసిన టీఏ, డీఏలను సక్రమంగా పంపిణీ చేయకపోతే మొత్తం 24పంచాయతీలకు చెందిన వార్డు మెంబర్లందరూ కలిసి కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.