మెరకముడిదాం : రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖామంత్రి కిమిడి మృణాళిని సొంత ఇలాకాలో ఉన్న రెండు ఫెర్రో పరిశ్రమలు మూతపడడంతో సుమారు నాలుగు వేల మంది కార్మికులు, వారి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. మెరకముడిదాం మండలం గర్భాం సమీపంలో ఉన్న ఆంధ్రా ఫెర్రోఅల్లాయీస్ పరిశ్రమ హుద్‌హుద్ తుపాను కారణంగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో యాజమాన్యం పరిశ్రమను తాత్కాలికంగా మూసివేసింది. విద్యుత్ సరఫరా వచ్చేంత వరకూ కార్మికులు విధులకు హాజరుకావొద్దని యాజమాన్యం ప్రకటించింది. దీన్ని కార్మికులు వ్యతిరేకించారు.
ఈ దశలో యాజమాన్యం, కార్మికుల మధ్య చర్చలు జరిగాయి. పరిశ్రమకు వారం రోజుల్లో విద్యుత్ సరఫరా వచ్చినా , లేకపోయినా కార్మికులను విధుల్లోకి తీసుకుంటామని యాజమాన్యం ఒప్పుకుంది. దీనికి కార్మికులు కూడా సరేననడంతో అప్పటికి సమస్య కొలిక్కి వచ్చింది. అయితే చర్చలు జరిగిన రెండో రోజునే పరిశ్రమకు విద్యుత్ సరాఫరా రావడంతో పరిశ్రమ యాజమాన్యం కార్మికులను విధుల్లోకి రావాలని కోరింది. అయితే తాము విధులకు హాజరుకాని రోజులకు కూడా వేతనం చెల్లిస్తేనే విధులకు హాజరవుతామని, లేదంటే హాజరుకామని కార్మికులు మొండికేశారు. దీనికి యాజమాన్యం ఒప్పుకోలేదు. అనంతరం ఇరువర్గాల మధ్య చర్చలు జరిగినా ఫలితం తేలకపోవడంతో యాజమాన్యం ఈ నెల 8వ తేదీన లాకౌట్ ప్రకటించింది.
అలాగే మరోవైపు గరివిడి మండలంలోని ఫేకర్ పరిశ్రమ మూతపడి 9 నెలలు కావస్తోంది. ఈ విషయాన్ని కార్మికులు పలుమార్లు మంత్రి మృణాళిని దృష్టికి, కార్మిక శాఖామంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లారు. నెలలు గడుస్తున్నా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఈ పరిశ్రమలు తెరిచే పరిస్థితి కానరాకపోవడంతో కార్మికులు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి ఇలాకాలోని పరిశ్రమలు పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన ప్రాంతాల్లో పరిశ్రమల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా మంత్రి మృణాళిని కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
మంత్రి ఇలాకాలో కార్మికుల ‘ఆకలి కేకలు’
Published Mon, Nov 17 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM
Advertisement