17 ఏళ్లుగా కూర్చోబెట్టి జీతం..!
- మూడు జిల్లాల్లో సుమారు 100 మంది..
- వైద్య ఆరోగ్య శాఖలో చిత్రం
నిజామాబాద్ : పని లేకున్నా వారికి వేతనాలు మాత్రం నెలనెలా సక్రమంగా అందుతాయి. కొందరు డిప్యుటేషన్ మీద కొనసాగితే, మరికొందరు ఆఫీసుకు వస్తారు..కూర్చుంటారు .. వెళ్లిపోతారు. ఇంకొందరు ఇక్కడ సంతకాలు చేసి బయట దర్జాగా వ్యాపారం చేసుకుంటారు. ఇదీ నిజామాబాద్ వైద్య, ఆరోగ్యశాఖలో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న తంతు. ఓ వైపు రోగాలు విజృంభిస్తున్నా, వైద్యం అందక రోగులు విలవిలలాడుతున్నా, ఖాళీల కొరతతో వైద్యం అందలేని పరిస్థితి నెలకొన్నా... శిక్షణ పూర్తయిన సిబ్బందికి పనులు అప్పగించకుండా వేతనాలు చెల్లిస్తున్నారు.
ఇలా మూడు జిల్లాల్లో 100 మంది ఉద్యోగులు ఉన్నారు. పనిలేదని తెలిసిన కొందరు ఉద్యోగులు ఇక్కడికి డిప్యుటేషన్‌పై వచ్చి కొనసాగుతున్నారు. పురుష ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడానికి 1992లో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్‌లలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి 60 సీట్లను కేటాయించారు. 1998 వరకు ఈ కేంద్రాలు పని చేశాయి.
అయితే, 1998లో పురుష ఆరోగ్య కార్యకర్తల పనితీరు సంతృప్తిగా లేదని, వారి అవసరం లేదని అప్పటి వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ రేచల్‌చటర్జీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో నాటి ప్రభుత్వం ఈ శిక్షణా కేంద్రాలను ఎత్తివేసింది. కేంద్రాలను ఎత్తివేసిన ప్రభుత్వం అందులో పని చేసే సిబ్బంది, ఉద్యోగుల విషయాన్ని పట్టించుకోలేదు. నిజామాబాద్ శిక్షణ కేంద్రానికి 14 మంది, వరంగల్ కేంద్రానికి 14 మంది చొప్పున ఉద్యోగులను నియమించారు.
ఇందులో ఒకరు మెడికల్ ఆఫీసర్, ఇద్దరు హెల్త్ ఎడ్యుకేటర్లు, ఇద్దరు ఎంపీహెచ్‌వోలు, ఒకరు బీఎస్సీ నర్సింగ్ టీచింగ్ సిబ్బంది, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు జూనియర్ అసిసెంట్లు, ఇద్దరు నాల్గో తరగతి ఉద్యోగులు, ఇద్దరు అటెండర్లు చొప్పున ఉన్నారు. హైదరాబాద్ శిక్షణ కేంద్రంలో ముగ్గురు వైద్యాధికారులు, ఆరుగురు బీఎస్సీ నర్సింగ్ టీచింగ్ సిబ్బంది, నలుగురు సీనియర్ అసిస్టెంట్లు, ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లు, పద హారు మంది నాల్గో తరగతి సిబ్బంది, ఆరుగురు అటెండర్లు, ఆరుగురు స్వీపర్లు ఉన్నారు. హైదరాబాద్‌లో నాడు వసతిగృహం కూడా ఏర్పాటు చేయడంతో ఓ వార్డెన్, ప్రిన్సిపాల్, సిబ్బందితో కలసి మరో 14 మంది ఉన్నారు. శిక్షణ కేంద్రాలు ఎత్తేసిన తర్వాత వీరికి పని లేదు. ఇందులో కొందరిని డిప్యుటేషన్‌పై వేరే ప్రాంతాలకు కేటాయించగా, మిగతావారు 17 ఏళ్లుగా ఖాళీగా కూర్చొని వేతనాలు పొందుతున్నారు.
మాకు ఆదేశాలు లేవు
శిక్షణ కేంద్రం సిబ్బందిని, ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు కేటాయించాలని ఆదేశాలు రాలేదు. కానీ, ఎక్కడైనా అవసరం ఏర్పడితే డిప్యుటేషన్‌పై కేటాయిస్తున్నాం. మరికొందరు శిక్షణ కేంద్రంలోనే కొనసాగుతున్నారు. వీరిని వెంటనే వేరే ప్రాంతాలకు వేయాలంటే ఉన్నతాధికారుల అనుమతి కావాలి
- బసవేశ్వరి, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో