సాక్షి, అమరావతి: కరువు భత్యం(డీఏ), పదో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) బకాయిల కోసం ఇప్పటికే చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లపై మరో బండ పడింది. డీఏ, పీఆర్సీ బకాయిల సంగతేమో గానీ నెలవారీగా అందాల్సిన వేతనాలు, పింఛన్లు సైతం రాక ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా అమల్లోకి తీసుకొచ్చిన సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(సీఎఫ్‌ఎంఎస్) దారుణంగా విఫలమైంది. ఏప్రిల్ వచ్చి 25 రోజులు గడిచినా మార్చి నెల వేతనాలు, పింఛన్లు ఇప్పటికీ రాలేదని లక్షలాది మంచి ఉద్యోగులు, పెన్షనర్లు గగ్గోలు పెడుతున్నారు. గడచిన నెల వేతనాలను మరుసటి నెల ఒకటో తేదీకల్లా చెల్లించాల్సి ఉంది. దశాబ్దాలుగా ఇదే విధానం అమలవుతోంది. కానీ, మార్చి నెల వేతనాలు, పింఛన్లు ఏప్రిల్ నెల 10వ తేదీ నాటికి 50 శాతం మందికి కూడా అందలేదు. ఏప్రిల్ 15 తేదీ నాటికి 40 శాతం మందికి రాలేదు. ఇప్పటికీ 20 శాతం మందికి వేతనాలు, పింఛన్లు రాకపోవడంతో అగచాట్లు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ తలెత్తలేని ఉద్యోగులు, పెన్షనర్లు మండిపడుతున్నారు.
డీఏ, పీఆర్సీ బకాయిల సంగతేంటి?
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే రెండు డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. 2017 జూలై ఒకటో తేదీ నుంచి ఒక డీఏ, 2018 జనవరి నుంచి మరో డీఏను బకాయిలతో సహా ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది. పెన్షనర్లకు కూడా రెండు డీఏలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఉద్యోగులకు చెల్లించాల్సిన పదో పీఆర్సీ బకాయిలు రూ.4,500 కోట్లు ఇవ్వడానికి నాలుగేళ్లు గడిచినా ప్రభుత్వానికి చేతులు రావడం లేదు.
ఆగిపోయిన బిల్లులు
సీఎఫ్‌ఎంఎస్ వ్యవస్థ సక్రమంగా పని చేయకపోవడంతో వేతనాలు, పింఛన్లతోపాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల బిల్లుల చెల్లింపులు సైతం ఆగిపోయాయి. అప్పు చేసి వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్) కింద మంజూరైన సొమ్ముకు సంబంధించిన చెక్కులు చెల్లుబాటు కావడం లేదు. మార్చి నెలలో జారీ చేసిన పది వేలపైగా చెక్కులను బ్యాంకులు తిరస్కరించాయి. నెల రోజుల నుంచి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల జారీ ప్రక్రియను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన బిల్లుల సమర్పణ, చెల్లింపులు కూడా ఆగిపోయాయి.
వేతనాలు అందని విభాగాలు
ఎయిడెడ్ విద్యాసంస్థల ఉద్యోగులతోపాటు ఇరిగేషన్, రహదారులు–భవనాలు, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల్లోని పలువురు ఉద్యోగులకు మార్చి నెల వేతనం ఇంకా రాలేదు. మార్చి, ఏప్రిల్ నెలలకు కలిపి ఒక్కో ఉద్యోగికి రూ.75 వేల చొప్పున అడ్వాన్స్‌గా ఇచ్చారు. ఈ అడ్వాన్స్ సరిపోదని, నెలకు ఒక్కో ఉద్యోగికి రూ.50 వేల వేతనం ఉన్నందున, మిగతా మొత్తాన్ని కూడా ఇప్పించాలని వర్క్ చార్జెడ్ ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులు ఆర్థిక శాఖను కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.
చిరుద్యోగులు ఎలా బతకాలి?
25వ తేదీ వచ్చినా ప్రభుత్వం వేతనం ఇవ్వకపోతే తాము ఎలా బతకాలని చిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ‘‘మొదటి వారం దాటితే ఇంటి యజమానులు అద్దె ఇవ్వాలని అడుగుతారు. పాల బిల్లు, కరెంటు బిల్లు, పిల్లలకు స్కూలు ఫీజులు ఠంచనుగా చెల్లించాల్సిందే. కిరాణా సరుకులు కొనుక్కోవాలంటే డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? పైపెచ్చు ఆర్థిక సంవత్సరం చివరి నెలలు కావడంతో వేతనంలో కోత పడకుండా ఆదాయపు పన్ను మినహాయింపుల కోసం ఇన్సూరెన్స్ ప్రీమియం లాంటివి కట్టాల్సి ఉంటుంది. అందువల్ల ప్రతి ఉద్యోగికి ఏప్రిల్ చాలా కీలకం. ఈ నెలలోనే వేతనం ఇవ్వకపోవడం దారుణం’’ అని ఉద్యోగ సంఘం నాయకుడొకరు విమర్శించారు.
అక్కరకు రాని సీఎఫ్‌ఎంఎస్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎఫ్‌ఎంఎస్ ఏర్పాటుకు 2013లో ఎన్‌ఐఐటీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా ఆ సంస్థకు రెండు దశల్లో రూ.100 కోట్లకుపైగా చెల్లించారు. ఎన్‌ఐఐటీ కోసం తొలుత రూ.60 కోట్లతో సూపర్ కంప్యూటర్లను కొనుగోలు చేశారు. ఆ సంస్థ ప్రతినిధులు మూడేళ్ల పాటు సాఫ్ట్‌వేర్, డేటా డెవలప్‌మెంట్ పేరిట కాలయాపన చేశారు. సాఫ్ట్‌వేర్ రూపకల్పనలో విఫలమైన ఎన్‌ఐఐటీని ప్రభుత్వం పక్కకు తప్పించింది. అనంతరం ఆ సంస్థకు ఆంధ్రప్రదేశ్ వాటా కింద గతేడాది ఫిబ్రవరి 23న రూ.41.99 కోట్లు చెల్లించారు. విఫలమైన సంస్థకు నిధులు చెల్లించడానికి కారణం.. ఆ సంస్థ ప్రతినిధి ‘ముఖ్య’నేతకు సన్నిహితుడు కావడమే. తరువాత ఎస్‌ఏపీ ప్లాట్‌ఫాంపై సాఫ్ట్‌వేర్, డేటా డెవలప్‌మెంట్‌కు రూ.46.23 కోట్లు ఖర్చుచేశారు.
అనంతరం సేవల కోసం అంటూ వివిధ దశల్లో 12 జీవోల ద్వారా రూ.38.19 కోట్లు చెల్లించారు. అంతా సిద్ధమైందని, ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సీఎఫ్‌ఎంఎస్ ద్వారానే ఆర్థిక కార్యకలాపాలు, బిల్లుల సమర్పణ, చెల్లింపులు జరుగుతాయని ప్రభుత్వం పేర్కొంది. సీఎఫ్‌ఎంఎస్ వ్యవస్థను ముఖ్యమంత్రి ఇటీవలే అట్టహాసంగా ప్రారంభించారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 24 రోజులు దాటినప్పటికీ కొత్త వ్యవస్థ ద్వారా బిల్లుల సమర్పణ, చెల్లింపులు సక్రమంగా జరగడం లేదు. ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పింఛన్లు కూడా చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. దీనికి కారణం సాఫ్ట్‌వేర్‌లో లోపాలు తలెత్తడంతోపాటు ట్రెజరీల్లోని సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వకపోవడమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment