పుష్కరాల పుణ్యం.. అందని భత్యం! | No allowences given for pushkar crew | Sakshi
Sakshi News home page

పుష్కరాల పుణ్యం.. అందని భత్యం!

Published Tue, Aug 23 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

గోదావరి

గోదావరి

పుష్కర విధులకు వెళ్లిన అధికారులకు అందని భత్యం
గోదావరి పుష్కరాలకు ఏడాది
పంపేశామంటున్న ఉన్నతాధికారులు
రాలేదంటున్న జిల్లా అధికారులు
బాధ నేరుగా చెప్పుకోలేక ఆకాశ రామన్న ఉత్తరాలు


పన్నెండేళ్లకోమారు పుష్కరాలు వస్తే... ఒక్క మునకతోనే పుణ్యం వస్తుందంటూ వేలాదిమంది పరుగులు పెడతారు. అదే డెప్యుటేషన్‌పై విధి నిర్వహణ నిమిత్తం వెళ్లినవారైతే రోజూ మునకలు చేయొచ్చు. ఇక వారికి లెక్కనేనంత పుణ్యం లభిస్తుందనుకున్నారో ఏమో.. వారికివ్వాల్సిన భత్యం మాత్రం చెల్లించలేదు. గోదావరి పుష్కరాలకు ఏడాది పూర్తయ్యాయి. తాజాగా కృష్ణా పుష్కరాలు ముగిసిపోయాయి. కానీ నాటి భత్యం గురించి మాత్రం నోరు మెదపడంలేదు. డబ్బులిచ్చేశామని ఉన్నతాధికారులు చెపుతుండగా.. రాలేదని ఇక్కడి అధికారులు సెలవిస్తున్నారు.

విధిలేని పరిస్థితుల్లో ఆకాశరామన్న ఉత్తరం ద్వారా ఉద్యోగులు తమ విలాపం తెలియజేశారు. గత ఏడాది గోదావరి పుష్కరాలు.... ఈ ఏడాది కష్ణాపుష్కరాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. కోట్లాదిరూపాయలు ఖర్చుచేసి విస్తతంగా చేపట్టిన ప్రచార పుణ్యమాని ఎక్కడెక్కడినుంచో జనం వెళ్లి మునకలు పూర్తి చేశారు. వారికి పుణ్యఫలం దక్కిందో లేదోగానీ... అక్కడి సేవలందించే తహసీల్దార్లు... ఉపతహసీల్దార్లకు మాత్రం గత ఏడాది నిర్వహించిన పుష్కరసేవల భత్యం ఇప్పటికీ అందలేదు. అదేంటి? ఎంతో ఖర్చు చేసిన పెద్ద కార్యక్రమ బాధ్యతను తమ భుజస్కంధాలపై మోసిన అధికారులకు ఇంకా భత్యం చెల్లించలేదా అని ఆశ్చర్యపోతున్నారా? విషయమేమంటే ఆ నిధులు పంపించేశామని విజయవాడలోని ఉన్నతాధికారులు చెబుతుంటే అసలు రాలేదని ఇక్కడి అధికారులు చెప్పడం విశేషం.

మిగతా జిల్లాలవారికి అందినా..
గతేడాది నిర్వహించిన గోదావరి పుష్కరాల్లో సేవలకు ఇక్కడినుంచి పదిమంది తహసీల్దార్లు, మరో 15మంది ఉప తహసీల్దార్లు రెండు రోజుల ముందే అక్కడకు వెళ్లారు. పుష్కరాలు ముగిశాక ఇక్కడకు వచ్చిన వారంతా తమకు రావాల్సిన టీఏ, డీఏలకోసం బిల్లులు పెట్టుకున్నారు. కానీ ఒక్క అధికారికీ పైసా కూడా ఇవ్వలేదు. మిగతా జిల్లాల అధికారులకు మాత్రం ఈ బిల్లులు అందినా... ఇక్కడివారికి ఎందుకో ఇవ్వలేదు. ఇప్పటికీ వాటికోసం అడుగుతున్న అధికారులకు డబ్బులు రాలేదన్న సమాధానమే వస్తోంది. ఒక్కొక్కరికీ సుమారు రూ. 5వేలకు పైగానే చెల్లించాల్సి ఉంది.

పలుమార్లు అడుగుతున్నా లేదన్న సమాధానం రావడంతో కొందరు తహసీల్దార్లు తూర్పు, పశ్చిమగోదావరి కలెక్టరేట్‌ను సంప్రదించగా.. వారు ఆ డబ్బులు ఎప్పుడో డ్రాఫ్ట్‌ తీసి జిల్లాకు పంపించేసినట్టు చెప్పారని తెలుసుకున్నారు. అయితే ఇక్కడి ఉన్నతాధికారులను అడగలేక ఓ ఆకాశ రామన్న ఉత్తరం రాశారు. పేరు పొందుపరచకుండా వెంటనే డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జిల్లా మంత్రి మణాళిని, ఇన్‌చార్జి మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కలెక్టర్‌ వివేక్‌ యాదవ్, మీడియా ప్రతినిధుల పేరున ఆ లేఖలు పంపించారు.

ఇలా గోదావరి పుష్కరాల్లో సేవలందించిన జిల్లాకు చెందిన వారికి సుమారు రూ. 10లక్షలు ఇంకా చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాత్రీ పగలు నిద్రలు లేనిరాత్రులు కూడా గడిపి సేవలందిస్తే కష్ణా పుష్కరాలు కూడా వచ్చి వెళ్లిపోయినా ఇంకా నిధులు రాలేదని చెప్పడంపై వీరు మండిపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ ఈ బిల్లులు వచ్చాయా? రాలేదా? అన్న అంశంపై కొద్దిపాటి విచారణ చేస్తే విషయం తెలుస్తుంది. అప్పుడయినా వీరికి బిల్లులు అందే అవకాశం లేకపోలేదని సంబంధిత అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement