సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించుకునే విలువైన వజ్రాలు, రత్నాలతో పొదిగిన బంగారు ఆభరణాల (స్టోన్‌గోల్డ్)కు సంబంధించిన లెక్కలు, వాటి వివరాలు టీటీడీ వద్దలేవు. వేల కోట్ల ఆభరణాల వివరాలు, లెక్కలు లేవంటే టీటీడీ పనితీరును అనుమానించాల్సి వస్తోంది. అవి ఎక్కడ ఉన్నాయో తెలియడంలేదు. దీని వెనుక మతలబు ఏమిటనే దానిపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. శ్రీవారికి వచ్చే బంగారంతో పాటు వజ్రాలు, రత్నాలు పొదిగిన ఆభరణాలు ఎన్ని, ఎక్కడ ఉన్నాయి, ఏమవుతున్నాయి, ఉంటే ఎందుకు బహిర్గతం చెయ్యటం లేదు? అని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. తిరుమలలో కొలువైన కలియుగ వైకుంఠనాధుడికి భక్తులు బంగారు, వెండి ఆభరణాలనూ హుండీలో కానుకలుగా సమర్పిస్తుంటారు.
కొందరు భక్తులైతే నిలువు దోపిడీ పేరుతో ఒంటిపైన ఉన్న నగలు, ఆభరణాలను ఉన్నవి ఉన్నట్లుగా తీసి హుండీలోవేసి మొక్కులు తీర్చుకుంటారు. అందులో వజ్రాలు, రత్నాలు, అవి పొదిగిన ఆభరణాలు, కెంపు, ముత్యాలు, మరకత, మాణిక్యాలు ఉంటాయి. తమిళనాడులో పట్టుబడ్డ కోట్ల రూపాయలు విలువచేసే బంగారంపై వచ్చిన అనుమానాలకు టీటీడీ నుంచిగాని, ఇటు ప్రభుత్వం నుంచిగాని స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో శ్రీవారికి కానుకగా లభించే ఆభరణాల్లోని ఈ విలువైన వజ్ర వైఢూర్య మరకత మాణిక్యాలు, ముత్యాలు, రత్నాలు ఏమవుతున్నాయని భక్తులు ప్రశ్నిస్తున్నారు. వాటికి లెక్కలు లేవంటే చేతులు మారాయా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
బంగారానికి ఉన్న లెక్కలు స్టోన్‌గోల్డ్‌కు ఎందుకు లేవు...
శ్రీవారికి హుండీలో భక్తులు సమర్పించే నగదును ప్రతి రోజూ లెక్కిస్తున్నారు. ఆ వివరాలను టీటీడీ ఏరోజుకారోజు అధికారికంగా వెల్లడిస్తోంది. నిల్వ బంగారం విషయానికి వస్తే వివిధ బ్యాంకుల్లో 9,259 కిలోలను డిపాజిట్ చేసినట్లు టీటీడీ ప్రకటించింది. అయితే బంగారంతో పాటు వచ్చే స్టోన్‌గోల్డ్ వివరాలను మాత్రం వెల్లడించడంలేదు. ఆభరణాల్లోని విలువైన రాళ్లను టీటీడీ ఏం చేస్తోందన్న వివరాలు మాత్రం ఇప్పటిదాకా ప్రకటించకపోవటంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీవారికి హుండీ ద్వారా లభించే ఆభరణాలను తిరుమల పరకామణిలోనే చిన్నచిన్న మూటలుగా కట్టి, అక్కడే వాటి బరువును లెక్కిస్తారు. ఆపై తిరుపతిలోని ట్రెజరీకి పంపుతారు. వాటిని తిరుపతిలో ఉన్న టీటీడీ అప్రైజర్లు తనిఖీ చేసి బంగారానికి విలువకట్టి ఖజానాలో జమ చేస్తారు. అదే విధంగా ఆభరణాల్లోని రాళ్ల వివరాలనూ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. అయితే వివరాలు మాత్రం లేవట.
జమాలజిస్టే లేడు – విలువ కట్టేదెలా?
శ్రీవారికి ప్రతిరోజూ వచ్చే ఆభరణాల్లోని విలువైన రాళ్లను గుర్తించి విలువ కట్టాలి. అందుకు ప్రత్యేకంగా జమాలజిస్ట్ ఉండాలి. అయితే టీటీడీలో ఇప్పటి వరకు జుమాలజిస్ట్ లేడని అధికారులు చెబుతున్నారు. దీనికి కారణం మాత్రం చెప్పడంలేదు. ఆభరణాల్లో ఉన్న రాళ్లు విలువ ఏమిటో లెక్కించే నిపుణులను ఎందుకు నియమించలేదు? దీనికి కారణంన ఎవరు వంటి ప్రశ్నలను భక్తులు లేవనెత్తుతున్నారు. జమాలజిస్ట్ లేకపోవటంతో తిరుపతిలో ఉన్న అప్రైజర్ అతనికి తోచిన విధంగా కొంత స్టోన్‌గోల్డ్‌ను విలువకట్టి ముంబైలోని మింట్‌కు తరలిస్తున్నట్లు తెలిసింది. అక్కడ కరిగించి, బంగారాన్ని విడదీసి శుద్ధిచేసి, కడ్డీలుగా రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ సమయంలో వజ్రాలు, రత్నాలు వంటి వాటిని ఏం చేస్తున్నారన్నది తెలియడంలేదు. వాటి వివరాలు తెలియడంలేదు. బంగారం కన్నా విలువైన వజ్రాలు, రత్నాలకు లెక్కాజమాలేక పోవడంపై భక్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో బంగారం నుంచి వేరుచేసిన వజ్రాలు, రత్నాలు ఎన్ని, అవి ఎక్కడకు వెళుతున్నాయో తెలియడంలేదు.
లెక్కపెట్టే అలవాటే లేదట!
శ్రీవారికి హుండీలో భక్తులు సమర్పించే స్టోన్‌గోల్డ్‌ను లెక్కపెట్టటం లేదని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇంత నిర్లక్ష్యం వెనుక కారణాలు ఏమిటనేది ఎవరికీ అంతుబట్టడంలేదు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు సమర్పించిన స్టోన్‌గోల్డ్‌ను మూటలు కట్టి భద్రపరచారా? ఎక్కడ ఉన్నాయి, ఏమవుతున్నాయి? అనే భక్తుల ప్రశ్నలకు టీటీడీ వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇదిలా ఉంటే...హుండీ ఆదాయాన్ని ట్రెజరీలో వేరుచేసిన సమయంలో లభించిన విడి రాళ్లను మాత్రం లూజ్ స్టోన్ పేరుతో మూటలుగా కట్టి నిల్వ ఉంచుతున్నట్లు సమాచారం.
శ్రీవారి ఆభరణాలకు సంబంధించి ఏవైనా మరమ్మతులు వచ్చినపుడు ట్రెజరీలో నిల్వచేసిన ఈ రాళ్లను వాడుతున్నట్లు తెలిసింది. అయితే ఇలా ఎన్నిరాళ్లను వినియోగిస్తారు అనేదానికి కూడా టీటీడీ వద్ద వివరాలు లేవు. ఎన్ని లడ్డూలు అమ్మాం, ఎంత మంది భక్తులు వచ్చారు అన్నదానికి ఉన్న పక్కా లెక్కలు వేల కోట్ల రూపాయల విలువచేసే స్టోన్‌గోల్డ్ విషయంలో ఎందుకు లేవన్న దానికి టీటీడీ వద్ద సమాధానం లేదు.
Comments
Please login to add a commentAdd a comment