గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్: కోస్తాంధ్రాలో పెద్దాసుపత్రిగా పేరుగడించిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి(జీజీహెచ్)లోని రేడియాలజీ వైద్య విభాగంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపకపోవటంతో అక్కడ నిత్యం సమస్యలు తాండవిస్తూనే ఉన్నాయి. పురాతన కాలం నాటి వైద్య పరికరాలు, కాలపరిమితి దాటిన వైద్య పరికరాలే నేటికీ ఇక్కడ దర్శనమిస్తున్నాయి.
అవి తరచూ మరమ్మతులకు గురవుతుండటంతో వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది.త్వరలో ఆస్పత్రిలో భారత వైద్య మండలి(ఎంసీఐ) తనిఖీలు చేయనుంది. ఈ నేపథ్యంలో వైద్య పరికరాలు పూర్తిస్థాయిలో లేకపోవటంతో ఎంసీఐ ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందనే భయాందోళనలో ఆస్పత్రి అధికారులు ఆందోళన చెందుతున్నారు.
రేడియాలజీ కీలకమే...
ఆస్పత్రిలోని రేడియాలజీ వైద్య విభాగంలో పలురకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఎక్సరే, ఆల్ట్రాసౌండ్, సిటిస్కాన్ తదితర పరీక్షలు కూడా ఈ విభాగంలోనే నిర్వహిస్తున్నారు. నరాల వ్యాధుల వారికి, మెదడు సంబంధిత వ్యాధిగ్రస్తులకు, రోడ్డు ప్రమాద భాధితులకు, గర్భిణిలకు, కిడ్నీ వ్యాధులున్నవారికి, ఇతర జబ్బులున్న వారికి రేడియాలజీలో పరీక్షలు చేసిన పిదప మాత్రమే వైద్యం ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఈ విభాగంలో ఉన్న ఎక్సరే మెషిన్లు నాలుగు పనిచేయకపోవటంతో మూలనపడేశారు. కొత్తవాటిని కొనుగోలు చేసేందుకు ఆస్పత్రి అధికారులు పలుమార్లు ప్రభుత్వానికి నివేదికలు పంపినా స్పందన లేదు.
ప్రస్తుతం మూడు మెషిన్లు మాత్రమే పనిచేస్తుండటంతో అధికంగా వస్తున్న పేద రోగులకు సకాలంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరగటం లేదు. సిటిస్కాన్ మెషిన్‌కూడా తరచూ మరమ్మతులకు గురువుతుంది. ఆస్పత్రిలో ఇది ఏర్పాటుచేసి 12 సంవత్సరాలు పూర్తయింది. వాస్తవానికి దీని కాలపరిమితి 10 ఏళ్లు మాత్రమే. ఇక ఎంఆర్‌ఐ మెషిన్‌ను నేటి వరకు ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. సుమారు 60 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పెద్దాసుపత్రిలో రేడియాలజీ వైద్య సేవలను పూర్తిస్థాయిలో అందించాలంటే తప్పనిసరిగా అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరికరాలను ప్రభుత్వం ఏర్పాటుచేయాల్సి ఉంది.
వివరణ...
వైద్య పరికరాలు తరచూ మరమ్మతులకు గురవుతున్న విషయాన్ని ఆస్పత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు రేడియాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ పార్వతీశ్వరరావు తెలిపారు. నూతన వైద్య పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం టెండర్లు పిలిచిందని, ఆ ప్రక్రియ పూర్తికాగానే పరికరాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.
పేరుకే పెద్దాసుపత్రి.. పరికరాలు లేక కుస్తీ
Published Wed, Jan 8 2014 2:35 AM | Last Updated on Tue, Oct 9 2018 7:39 PM
Advertisement