- కొత్త ఎఫ్‌ఏలను నియమించకపోవడమే కారణం
- సెప్టెంబర్ 2 నుంచి కొత్త నియామకాలు నిలిపివేసిన సర్కారు
- వలసబాట పడుతున్న జిల్లా వాసులు
- కొత్త నియామకాలకు వెల్లువెత్తుతున్న సిఫార్సులు
విజయనగరం మున్సిపాలిటీ : వలసలను నివారించి ఉన్న ఊరిలో ఉపాధి కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ గ్రామీణ హామీ పథకం ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేకపోతోంది. వ్యవసాయ పనులు ముగిసిన అనంతరం జిల్లావ్యాప్తంగా గత ఏడాది నవంబర్ నుంచి 34 మండలాల్లో ఉపాధి పనులు పునఃప్రారంభించినప్పటికీ 60 గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్‌లు లేకపోవడంతో పనులు దొరకని పరిస్థితి నెలకొంది. కొత్తవారిని ఇంతవరకూ నియమిం చకపోవడంతో పనులు చూపేవారు లేక ఆయా పంచాయతీల వారు ఉపాధి కోసం వలసబాట పట్టే పరిస్థితి దాపురించింది.
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని సొంత నియోజకవర్గం పరిధిలోని గుర్ల మండలంలోని గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్‌లు లేకపోవడం గమనార్హం. ఉపాధి పనుల్లో అవకతవకలకు, అక్రమాల కు పాల్పడినట్టు సామాజిక తనఖీల ద్వారా గుర్తించి, 60 గ్రామ పంచాయతీలకు చెందిన 60 మంది ఫీల్డ్ అసిస్టెంట్‌లను గత ఏడాది విధుల నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్తవారిని నియమించలేదు సరికదా.. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ నియామకాలపై ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించింది. ఫీల్డ్ అసిస్టెంట్లు లేని గ్రామ పంచాయతీల్లో వందలాది మంది వేతనదారులు ఉపాధి కోసం నిరీక్షిస్తున్నారు.
గతంలో ఒక గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగిస్తే పక్క పంచాయతీలో వారు విధులు నిర్వహించే ఇన్‌ఛార్జి బాధ్యతలతో నెట్టుకొచ్చేవారు. అయితే ఉపాధిలో అక్రమాలు రోజురోజుకు పెచ్చుమీరుతుండడంతో అధికారులు ఆధునాత పరిజ్ఞానాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సంబంధిత గ్రామ పంచాయతీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్‌కు కేటాయించిన సెల్‌ఫోన్ ద్వారానే ఆ వారంలో ఎంతమంది ఉపాధి పనులకు దరఖాస్తులు చేసుకున్నారు..వారికి కల్పించిన పని వివరాలు, ఉపాధి పనికి వచ్చిన వేలిముద్రలతో హైదరాబాద్‌లో ఉన్న ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం నిర్వాహకులకు ప్రతి రోజు సమాచారం అందించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పక్క పంచాయతీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ సెల్‌ఫోన్ సదరు గ్రామ పంచాయతీలోని వేతనదారుల సమాచారాన్ని అంగీకరించకుండా ఉండే విధంగా ఈ సాఫ్ట్‌వేర్ డిజైన్ చేయడంతో ఇబ్బందులు పడుతున్నారు.
కొత్త నియామకాలకు సిఫార్సుల వెల్లువ
ఖాళీగా ఉన్న 60 ఫీల్డ్ అసిస్టెంట్‌ల పోస్టుల నియామకాలకు అధికార పార్టీ నేతల సిఫార్సులతో డ్వామా అధికారులకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ విష యంలో రాష్ట్ర మంత్రుల సంతకాలు చేసిన సిఫార్సులు లేఖలు అందుతున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తీవ్రస్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సెప్టెంబర్ 2 నుంచి కొత్తగా ఫీల్డ్ అసిస్టెంట్‌ల నియామకాలు చేపట్టేందుకు వీలు లేకుండా ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించిందని, మళ్లీ ఆదేశాల వచ్చిన తరువాతనే నియామకాలు చేపడ తామని అధికారులు చెబుతున్నారు.