సాక్షి, అమరావతి: సప్తవర్ణ దుప్పట్ల పథకం రోగులకు రంగుల కలగానే మిగిలిపోయింది. కొద్ది నెలల కిందట ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే దీనికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఏడు రంగుల కలిగిన దుప్పట్లు ఏడు రోజులు రోగుల పడకలపై వేయాలి. కానీ నిర్వాహకులు మాత్రం మాసిన దుప్పట్లే వేసి మమ అనిపిస్తున్నారు. ఏడు రోజుల దుప్పట్ల సంగతి దేవుడెరుగు వారానికి రెండు రకాల దుప్పట్లు కూడా వేయడం లేదు. దీంతో ఈ పథకంపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఉన్నతాధికారులు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అనంతరం విజిలెన్స్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వాస్పత్రులకు విచారణకు వెళ్లగా అసలు నిజాలు బయటికొచ్చాయి.
మాసిపోయినవి.. ఉతకని దుప్పట్లే వేస్తున్నారు
సప్తవర్ణాలు ఆ దుప్పట్లపై కనిపించనే లేదని, ఆ రంగులు ఒక్క ఉతుకుకే వెలిసిపోయాయని, రంగులు కనిపించకపోవడంతో వాళ్ల ఇష్టమొచ్చిన దుప్పట్లు వేసి వెళుతున్నారని, బిల్లులు మాత్రం సప్తవర్ణ దుప్పట్లు వేస్తున్నట్టుగా చూపిస్తున్నారని నిర్ధారించారు. కొన్ని చోట్ల సగం పడకకు కూడా సరిపోని దుప్పట్లు, మాసిపోయిన దుప్పట్లు, ఉతకని దుప్పట్లు వేస్తున్నట్లు విజిలెన్స్ అధికారుల దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా బోధనాస్పత్రుల్లో అత్యంత దారుణంగా సప్తవర్ణ దుప్పట్లున్నాయని.. దీనిపై రెండ్రోజుల కిందటే విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఓ వైపు సప్తవర్ణ దుప్పట్లు అందుబాటులోకి తీసుకొచ్చామని ప్రభుత్వం గొప్పగా చెబుతుండగా.. ప్రారంభించిన కొద్ది రోజులకే పథకం నీరుగారడంపై అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిబంధనలు అమలైతే ఒట్టు
- ఏడు రోజులకు ఏడు రంగులు కలిగిన దుప్పట్లు వేయాలి.
- రోజూ ఉతికిన దుప్పట్లే వేయాలి.
- 60 సార్లు ఉతుకులుపడ్డాక ఆ దుప్పట్లను మార్చాలి.
- ఈ నిబంధనలు విధిగా పాటిస్తేనే నిర్వాహకులకు డబ్బులివ్వాలి.
కానీ ఇవేవీ పాటించకుండానే కొత్త దుప్పట్లు మార్చినట్టు చూపించి బిల్లులు పెడుతున్నారు. ఏడు వర్ణాలు కలిగిన దుప్పట్లు ఒక్క రోజులోనే రంగు వెలిసిపోయాయి. రంగులు లేకపోవడంతో దుప్పట్లు తారుమారవుతున్నాయి. ఇప్పటికే దుప్పట్ల వ్యవహారంపై సర్కారుకు పలు ఫిర్యాదులొచ్చాయి. దుప్పట్ల నిర్వహణ లోపాలపై విజిలెన్స్ కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.