
మానవ సంబంధాలు మృగ్యం
ఆస్తుల కోసం అన్నదమ్ముల కుమ్ములాటలు. తల్లిదండ్రులపై సైతం భౌతిక దాడులు. ధన కాంక్షతో హత్యలు. వేధింపుల నేపథ్యంలో భర్తలను హతమారుస్తున్న భార్యలు. కామంతో కళ్లు మూసుకుపోయి బాలికలు, విద్యార్థినులపై అత్యాచారాలకు తెగబడుతూ వారి జీవితాలను ఛిద్రం చేస్తున్న మృగాళ్లు. ఇవీ జిల్లాలో... మృగ్యమవుతున్న మానవ సంబంధాలకు కొన్ని ఉదాహరణలు.
సాక్షి, గుంటూరు : ప్రేమానురాగాలు, ఆప్యాయత ఆనందాలతో వెల్లివిరియాల్సిన మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. సోదరభావంతో కలసిమెలిసి ఉండే పల్లెల్లో సైతం కొన్ని కుటుంబాలు పగలు, ప్రతీకారాలతో రగిలిపోతున్నాయి. ప్రాణాలను తృణప్రాయంగా తీసేస్తున్నారు. రాజధాని నిర్మాణ నేపథ్యంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో ఆ గ్రామాల్లో పాత గొడవలు తిరిగి రేగుతున్నాయి.
తల్లీతండ్రి, అక్కా చెల్లెలు, అన్నాతమ్ముడు, బావమరుదులు, భార్యాభర్తలు ఈ సంబంధాలేవీ డబ్బుకంటే ఎక్కువ కాదంటూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో మానవ సంబంధాలపై చైతన్యం కలిగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
కొన్ని ఘటనలు పరిశీలిస్తే...
ఆప్యాయంగా అక్కున చేర్చుకోవాల్సిన అన్న కుమారుడిని ఓ మానవ మృగం కానరానిలోకాలకు పంపిన ఘటన గత నెలలో కృష్ణానది వద్ద జరిగింది. తెనాలికి చెందిన చిన్నారి మోక్ష జ్ఞ తేజను సొంత బాబాయే హతమార్చి కృష్ణానదిలో పడవేశాడు. ఈ సంఘటన జిల్లాలో తీవ్ర సంచలనం కలిగించింది.
బాపట్లకు చెందిన ప్రత్యూష అనే ఇంటర్ విద్యార్థిని ఇంటివెనుక ఉన్న మార్కెట్‌యార్డులోకి తీసుకు వెళ్లి అత్యాచారం చేసి, ఆపై ప్రాణాలు తీసిన ఓ మృగాడి కిరాతక చర్య జిల్లా ప్రజలను ఉలికిపాటుకు గురిచేసింది. ఈ ఘటనలో తల్లితో సహజీవనం చేస్తూ తండ్రి స్థానంలో ఉండి కాపుకాయాల్సిన వ్యక్తే హంతకుడుగా తేలడం మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసింది. రెండు రోజుల క్రితం నరసరావుపేట పట్టణం పాతూరులో ఆస్తి కోసం సొంత అన్నను కిరాతకంగా హతమార్చిన ఓ తమ్ముడు చివరకు తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనలో తమ్ముడు మృత్యువుతో పోరాడుతున్నాడు.
నగరం మండలంలో ఓ మహిళ తన భర్తను హతమార్చి కుమారుడి సహాయంతో పూడ్చిపెట్టింది. భర్త వేధింపులు తాళలేకే ఆ మహిళ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు తేలింది. తల్లిదండ్రులతో భర్త తరచూ గొడవపడటాన్ని తట్టుకోలేని ఓ మహిళ కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకోగా కాపాడేందుకు వెళ్లిన అక్క, పక్కనే నిద్రిస్తున్న చిన్నారికి మంటలు అంటుకున్న సంఘటన గురజాల మండలం మాడుగులలో జరిగింది. ఆ మహిళతోపాటు చిన్నారి కూడా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇలా జిల్లాలో జరుగుతున్న సం ఘటనలను పరిశీలిస్తే మానవసంబంధాలు ఎటుదారితీస్తున్నాయనే ప్రశ్న తలెత్తకమానదు.
మానవ సంబంధాలు, రాజధాని నిర్మాణం, మృగాలు,
Human relations, capital structure, animals