మళ్లీ ఎందుకొచ్చారు?
జన్మభూమిలో నిలదీస్తున్న జనం
మొక్కుబడిగా నిర్వహిస్తున్న అధికార గణం
విశాఖపట్నం: ’గత మూడు జన్మ భూమి సభల్లో ఇచ్చిన దరఖాస్తులకు మోక్షం లేదు.. జన్మభూమి సభలు పెట్టినప్పుడల్లా కొత్తగా రేషన్ కార్డులిస్తాం, పెన్షన్లు మంజూరు చేస్తాం.. ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇస్తాం.. అంటూ ఆశలు రేపారు. రెండున్నరేళ్ల నుంచి ఇదే పరిస్థితి. మొక్కుబడిగా ఎందుకు జన్మభూమి కార్యక్ర మాన్ని నిర్వహిస్తారు? ఎన్నాళ్లిలా మోసం చేస్తారు?’ అంటూ రెండో రోజు జన్మభూమి కార్యక్రమంలో పలుచోట్ల ప్రజ లు అధికారులను, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలను నిలదీశారు. వీరికి సమాధానం చెప్పలేక వారు సతమతమయ్యారు. రెండో రోజు జన్మభూమి కార్యక్రమాన్ని మంగళవారం జిల్లావ్యాప్తంగా పలుచోట్ల నిర్వహించారు.
అడ్డగింత.. నిలదీత
జిల్లాలోని ఎస్.రాయవరం మండలంలో పెన్షన్లు, ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వలేదని అధికారులను నిలదీశారు. పెదబయలులో జన్మభూమి సభ రసాభాస అయింది. గత జన్మభూమిలో దరఖాస్తులకు మోక్షం కల్పించకుండా ఇప్పుడెందుకొచ్చారని నిలదీశారు. ప్రసంగాలే తప్ప పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముంచంగిపుట్టులో జరిగిన సభలో గిరిజనులు అధికారులను సమస్యలపై నిలదీయడంలో మధ్యలోనే జన్మభూమి సభను ముగించుకుని వెళ్లిపోయారు. బుచ్చెయ్యపేట మండలం గంటికొర్లాం జన్మభూమి సభను జనం అడ్డుకున్నారు. ఏ సమస్యలూ పరిష్కరించలేదని, మళ్లీ ఎందుకొచ్చారంటూ అధికారులను, అధికార పార్టీని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నించడంతో కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఇరువర్గాలను శాంతింపచేశారు. చీడికాడ మండలం చుక్కపల్లి, కొత్తపల్లిల్లో ఇళ్లు మంజూరు చేయలేదని, మాకు ప్రయోజనం చేకూర్చనప్పుడు ఈ సభలెందుకని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జరిగిన సభకు జనం పలుచగా హాజరయ్యారు.
హుకుంపేట మండలం మఠం, కొత్తూరు గ్రామాల మహిళలు మంగళవారం జన్మభూమి సదస్సును అడ్డుకున్నారు. ఐటీడీఏ పీవోకు స్వయంగా రెండుసార్లు వినతులు ఇచ్చిన తాగునీటి సమస్య పరిష్కారం కాలేదంటూ ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో శాంతించారు.