కిరాతకం | They are the people who work in the village on Wednesday morning | Sakshi
Sakshi News home page

కిరాతకం

Published Thu, Nov 7 2013 3:51 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM

They are the people who work in the village on Wednesday morning

బుధవారం ఉదయం బిలకల గూడూరు గ్రామ ప్రజలు ఎవరి పనిలో వారు ఉన్నారు. పొలానికి పోయేందుకు కొందరు సిద్ధమవుతుండగా, మరి కొందరు సమీపంలోని జిందాల్ ఫ్యాక్టరీలోకి పనికి వెళ్తున్నారు. ఇంతలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారని తెలుసుకుని ఉలిక్కి పడ్డారు. గ్రామానికి చెందిన రాజు (23), రవి (21)ని గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి   కిరాతంగా చంపిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పథకం ప్రకారమే ఈ ఘతుకానికి ఒడిగట్టినట్లు ప్రచారం సాగుతోంది.
 
 గడివేముల, న్యూస్‌లైన్: గ్రామంలో నివసిస్తున్న చిన్న వెంకటస్వామి, లింగమయ్య బంధువులు. చిన్న వెంకటస్వామికి కుమారుడు రాజు, కుమార్తె, లింగమయ్యకు కుమారుడు రవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజు, రవి ఇద్దరు వరుసకు అన్నదమ్ములు కావడంతో కలిసి ఉండేవారు. ఇద్దరూ ట్రాక్టర్ డ్రైవర్లుగా పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉన్నారు. ఇటీవల రవికి మేనత్త కుమార్తెతో పెళ్లి చేయాలని నిర్ణయించారు. యువకులిద్దరూ మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ఇంటి నుంచి బైక్‌పై బయటకు వెళ్లారు.
 
 రాత్రి 8 గంటలైనా ఇంటికి రాకపోవడంతో రవి తల్లిదండ్రులు ఫోన్ చేయగా జిందాల్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నాము వస్తామంటూ చెప్పారు. బుధవారం ఉదయం పెసరవాయి రస్తా సమీపంలో నీటి కుంటలో ఇద్దరు శవాలై తేలారు. పొలానికి వెళ్తున్న కొందరు వ్యక్తులు మృతదేహాలను గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి, పాణ్యం సీఐ శ్రీనాథరెడ్డి, నంద్యాల డీఎస్పీ అమరనాథ నాయుడు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని హత్యల తీరును పరిశీలించారు. మృతదేహాలను నీటిలో నుంచి బయటకు తీయించారు.
 
 కర్నూలు నుంచి క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. పోలీసు జాగిలం నీటి కుంట వద్ద నుంచి బూజునూరు రస్తా వద్దకు వచ్చి ఆగింది. హంతకులు ఇక్కడి నుంచి వాహనం ఎక్కి వెళ్లి ఉంటారని సీఐడీ విభాగం హెడ్ కానిస్టేబుల్ శేఖర్ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి కేసు మిస్టరీని ఛేదిస్తామని డీఎస్పీ చెప్పారు. త్వరలో నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు. మృతుడు రవి తండ్రి లింగమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
 
 హత్యలో కిరాయి హంతకులు:
 యువకుల హత్యలో కిరాయి హంతకులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇద్దరినీ ఒకే రీతిలో గొంతు కోసి చంపేశారు. అనంతరం మృతదేహాలను, బైక్‌ను నీటిలో పడేశారు. మృతదేహాలపై ఎక్కడా గాయాలు లేకపోవడంతో దాదాపు పది మంది హంతకులు హతుల కాళ్లు, చేతులు పట్టుకొని ఒక్కొక్కరిని కడతేర్చి ఉంటారని అనుమానం వ్యక్తమవుతోంది.
 
 సంఘటన స్థలంలో మద్యం సీసాలు, ఆహార పదార్థాలు ఉండటంతో పథకం ప్రకారమే ఇద్దరు యువకులను అక్కడికి పిలిపించుకుని కడతేర్చినట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబీకులకు ఫ్యాక్షన్, వివాదాలు లేక పోవడంతో హత్యకు కారణాలు తెలియడం లేదు. వివాహేతర సంబంధమో, ప్రేమ వ్యవహారమో ఉండవచ్చునని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కుటుంబానికి ఆసరాగా ఉన్న కుమారుల మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జంట హత్యలతో గ్రామంలో విషాదం అలుముకుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement