ఎంత నిర్లక్ష్యం.. ఏమిటీ దౌర్భాగ్యం?
సాక్షి ప్రతినిధి, కడప: ‘అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు’ అన్నట్లుగా ఉంది జిల్లా యంత్రాంగం తీరు. ఒకటిన్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సిన తెలుగుగంగ కెనాల్ దుస్థితి అందుకు అద్దం పడుతోంది. బ్రహ్మసాగర్‌కు చేరాల్సిన నీరు భూగర్భంలోకి వెళ్తున్నా పట్టించుకున్న నాధుడే లేడు. స్పందించిన ప్రజాప్రతినిధుల్ని సైతం నీరుగార్చే చర్యలకు పాల్పడుతున్న వైనమిది.
తెలుగుగంగ కెనాల్ పరిధిలోని ఎస్‌ఆర్-1 కాలువ 98వ కిలోమీటర్ నుంచి 108 కిలోమీటర్ వరకూ లైనింగ్‌కు గండ్లు పడ్డాయి. అక్కడక్కడ పూడిక పేరుకుపోయింది. వెలుగోడు నుంచి సాగునీరు విడుదలకు యంత్రాంగం శ్రీకారం చుట్టింది. అయితే నీరు భూగర్భంలోకి ఇంకిపోతుందనే ఆందోళన ఆయకట్టుదారుల్లో మెండుగా ఉంది.
విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, జయరాములు దృష్టికి తీసుకెళ్లారు. వారు రైతులతో కలిసి కాలువ పనులను పరిశీలించారు. వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే నీరంతా నిష్ర్పయోజనమవుతుందని అధికారులకు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాల్సిందిగా కోరారు. అయితే నిధుల్లేవని, ఇప్పుడే పనులు చేపట్టలేమని అధికారులు పేర్కొన్నారు.
ఎమ్మెల్యేల అభ్యర్థన... ఎంపీ స్పందన
తెలుగుగంగ కెనాల్‌ను గత బుధవారం పరిశీలించిన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అక్కడి నుంచే అధికారులకు ఫోన్‌లో వివరించారు. నిధులు లేవని జవాబు రావడంతో వెంటనే కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రూ.10లక్షలు గ్రాంటు ఎంపీ కోటా ద్వారా మంజూరు చేయాలని కోరారు. ఎంపీ వెంటనే జిల్లా కలెక్టర్ కేవీ రమణకు లేఖ రాశారు. తన నిధుల నుంచి తెలుగుగంగ కాలువలో 98 కిలోమీటరు నుంచి 108 కిలోమీటర్ వరకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.
లెటర్ రెఫరెన్సు నెం.173/2014 ద్వారా కోరారు. అయితే ఎంపీ ఫండ్స్ కెనాల్‌కు ఖర్చు చేయరాదని పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి అభ్యర్థనను తిరస్కరించారు. మరీ ఇరిగేషన్ విభాగం నుంచి ఏమైనా ఖర్చుచేసి మరమ్మతులు నిర్వహిస్తారంటే అదీ లేదు. తెలుగుగంగ కె నాల్ 5వేల క్యూసెక్కులు సామర్థ్యంతో నిర్మించింది. ప్రస్తుతం 400 క్యూసెక్కులు వదిలితే కేవలం 150క్యూసెక్కులు మాత్రమే రాగలవని ఇంజనీరింగ్ అధికారులే వివరిస్తున్నారు. పూర్తి స్థాయి నీరు వదిలితే, గండ్లు పడక తప్పని పరిస్థితి. అలాంటి స్థితిలో శరవేగంగా నిర్వహించాల్సిన మరమ్మత్తుల్లో కూడ అధికారయంత్రాంగం నిర్లక్ష్యం వీడడంలేదని ఆయకట్టుదారులు వాపోతున్నారు.