Water harvesting
-
నీటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది
సాక్షి, హైదరాబాద్ : సహజ వనరులను సముచితంగా ఉపయోగించుకోవడం ద్వారా నీటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని ప్రముఖ జల సంరక్షణ ఉద్యమకారుడు సోలార్ సురేష్ అన్నారు. బుధవారం జల శక్తి అభియాన్‌లో భాగ౦గా జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమీ సిబ్బందితో జల సంరక్షణ, హరిత కార్యక్రమాల గురించి ఆయన చర్చి౦చారు. ఈ సందర్భంగా జల సంరక్షణపై ఆయన మాట్లాడుతూ.. క్యాంపస్‌ను పచ్చగా మార్చాలని ఆయన నిసా సిబ్బందికి సూచించారు. నీటి సంరక్షణ పద్ధతులను అవలంబించడం ద్వారా 240 ఎకరాల ప్రాంగణం ప్రయోజనం పొందుతుందని ఆయన అన్నారు. సోలార్ సురేష్‌గా పిలువబడే ప్రసిద్ధ జల సంరక్షణ ఉద్యమకారుడు సురేష్ ఐఐటి- చెన్నై, ఐఐఎం-అహ్మదాబాద్‌కి చె౦దిన పూర్వ విద్యార్థి. చెన్నైలోని తన ఇ౦టిలో సౌర ఫలకాలు, వర్షపు నీటి సేకరణ, బయోగ్యాస్, టెర్రేస్ గార్డెన్స్, గాలి నుంచి తాగునీరు తయారు చేసే ఎయిర్-ఓ-వాటర్ య౦త్రాన్ని ఉపయోగించడం ద్వారా స్వయం సమృద్ధి సాధించారు. -
నేడే వాటర్ హార్వెస్టింగ్ డే
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న దాదాపు 15 వేల ఇంకుడు గుంతలకు ఒకేరోజు మరమ్మతులు చేసే కార్యక్రమం ‘వాటర్ హార్వెస్టింగ్ డే’ను శనివారంనిర్వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ నిర్ణయించారు. జీహెచ్ఎంసీ, జలమండలి సంయుక్తంగా చేపట్టే ఈ మరమ్మతుల కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం కావాల్సిందిగా ఆయన నగర ప్రజలకు బహిరంగ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఆ లేఖ సారాంశం ఏంటంటే.. ‘‘మనిషికే కాదు.. సృష్టిలోని ప్రతిజీవికీ నీరు ప్రాణాధారం. నీరు లేకపోతే ప్రపంచమే లేదు. భూమి మీదున్న నీటిలో 97 శాతం సముద్రం నీరున్నప్పటికీ ఆ నీరు తాగటానికి పనికిరావు. మరో 2 శాతం నీరు మంచు పర్వతాల రూపంలో గడ్డకట్టుకుని ఉంది. ఈ నీరు కూడా తాగడానికి పనికి రాదు. ఇక మిగిలింది కేవలం 1 శాతం మాత్రమే. ఈ నీరే భూ ప్రపంచంలోని సకల జీవరాశులకు ఆధారం. పెరుగుతున్న జనాభా అవసరాలకు ఈ నీరు సరిపోవడంలేదు. ప్రపంచంలో ప్రస్తుతం 165 దేశాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. దక్షిణాఫ్రికాలోని కేఫ్‌టౌన్ నగరం నీరు లేని తొలి నగరంగా చరిత్రలో నిలిచిపోయింది. మన దేశంలోని పలు ప్రాంతాలు కూడా నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఈ దుస్థితి నుండి బయట పడాలంటే నీటిని సంరక్షించుకోవడం మినహా మరో మార్గం లేదు. ఏటా కురిసే వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా తిరిగి భూమిలోకి ఇంకింప చేసినప్పుడు నీటి బాధలు ఉండవు. హైదరాబాద్ నగరంలో సుమారు 11 వేల ఇంకుడు గుంతల్ని జీహెచ్ఎంసీ, జలమండలి వివిధ సందర్భాల్లో నిర్మించాయి. పలు భవనాల పరిసరాల్లో, బహిరంగ ప్రదేశాలు, పార్కులు, రహదారులకు ఇరువైపులా రీచార్జ్ గుంతలు నిర్మించారు. ఇంకా ప్రభుత్వ సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇళ్ల యజమానులు, కాలనీ వాసులు, గేటెడ్ కమ్యునిటీల్లో నిర్మించిన ఇంకుడు గుంతలు ఎన్నో ఉన్నాయి. అయితే వీటి నిర్వహణలో చాలా లోపం ఉందని గుర్తించాం. వీటిని నిర్మించినప్పుడున్న సంతోషం నిర్వహణలో కనిపించడం లేదు. చెత్తా చెదారంతో నిండిపోయాయి. ముఖ్యంగా పలు కాలనీల్లోని ఇంకుడు గుంతలను ప్రజలు పట్టించుకోవడం లేదు. వర్షపు నీటిని సంరక్షించే గొప్ప ఆశయంతో నిర్మించిన ఈ ఇంకుడు గుంతల్లో ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ సీసాలు పడేస్తున్నారు. చెడిపోయిన వస్తువులను ఇందులోకి విసిరేస్తున్నారు. దుమ్ము ధూళిని ఇందులోకి నెట్టివేస్తున్నారు. చెట్లు, చేమలు, పిచ్చి మొక్కలు ఈ గుంతల్లో పేరుకుపోతున్నాయి. పేరుకుపోతున్న మట్టి, బురదతో క్రమంగా ఆ ఇంకుడు గుంతలనీ రోడ్డు లెవెల్‌కు రావడం వల్ల పారుతుండే వర్షపునీరు ఇందులోకి వెళ్లకుండా వృథాగా పోతోంది. దీంతో ఒక లక్ష్య సాధనతో నిర్మించిన ఇంకుడు గుంతల ప్రయోజనం నెరవేరడం లేదు. మనమేం చేయాలి..? రుతుపవనాలు ప్రారంభమయ్యే నాటికి ఈ ఇంకుడు గుంతల నిర్వహణను ఒకేరోజు పెద్ద ఎత్తున చేపట్టి వాటిని తిరిగి యథాస్థితికి తేవడానికి జీహెచ్ఎంసీ, జలమండలి సంయుక్తంగా నడుం బిగించాయి. ఇందుకోసం ఈ రెండు శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది అన్ని కాలనీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇంకుడు గుంతల పునరుద్ధరణ కార్యక్రమాన్ని నేడు (శనివారం) చేపడుతున్నారు. పలు కాలనీల్లో వివిధ ప్రదేశాల్లో నిర్మించి జియో ట్యాగింగ్ చేసిన ఇంకుడు గుంతలను అధికారుల బృందం సాంకేతిక సిబ్బందితో సందర్శిస్తుంది. అక్కడి కాలనీవాసుల సహకారంతో పాడైపోయిన, చెత్త చెదారంతో నిండి ఉన్న ఇంకుడు గుంతలను శుభ్రం చేయడం, పిచ్చి మొక్కలను ఏరివేయడం, తగినంత ఇసుకతో తిరిగి నింపడం జరుగుతుంది. ప్రతి వర్షాకాలం ముందు ఇసుక పొరను మార్చడం వల్ల వర్షపు నీరు ఆ ఇంకుడు గుంతలోకి సులభంగా చేరుతుంది. భూమిపై పడే ప్రతి వర్షపు నీటి చుక్కను ఇంకుడు గుంతల ద్వారా తిరిగి భూమిలోకి ఇంకే విధంగా చేయడం వల్ల ఆ పరిసర ప్రాంతమంతా నీటి నిలువ ఉంటుంది. భూగర్భ జలాలు పెంపొందుతాయి. తద్వారా అక్కడ నీటి ఎద్దడి ఉండదు. ప్రజలు తమ తమ ప్రాంతాల్లో నిర్మించిన ఇంకుడు గుంతలను శుభ్రం చేసుకోవాలి. స్వయంగా ఇంట్లో నిర్మించుకుని నిర్వహణ చేపట్టాలి. ఇంకుడు గుంతలను ప్రక్షాళన చేసుకోవడం ద్వారా బోర్లు ఎండిపోయే పరిస్థితి ఉండదు. ప్రతి వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భంలోకి పంపిస్తే పుడమి తల్లి పులకరిస్తుంది. కాలనీల్లో నిర్మించిన ఇంకుడు గుంతలను ఆయా కాలనీవాసులు ఒకసారి పరిశీలించాలి. చెత్త చెదారంతో ఉన్న గుంతలని శ్రమదానంతో తీసివేసి రాబోయే వర్షపు నీటికోసం అవి పనిచేసే విధంగా సిద్ధం చేసుకోవాలి. ఒక సదాశయంతో జీహెచ్ఎంసీ చేపట్టిన ఈ పనిలో పాల్గొనేందుకు ప్రజలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. రాబోయే రోజుల్లో నీటికోసం ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ వాటర్ హార్వెస్టింగ్ డే కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం’’.– ఎం.దానకిషోర్, ఐఏఎస్,కమిషనర్ (జీహెచ్ఎంసీ) -
రెండేళ్లుగా కరువున్నా నీటికొరత లేదు!
తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి ప్రాంతం రెండున్నరేళ్ల క్రితం తీవ్ర కరువు కోరల్లో చిక్కుకున్నది. ఆ జిల్లా ఉదయంపులి గ్రామంలో సేంద్రియ రైతు కె.జయచంద్రన్కు చెందిన 200 ఎకరాల సర్టిఫైడ్ సేంద్రియ (బయోడైనమిక్) వ్యవసాయ క్షేత్రంలో అప్పట్లో తీవ్ర నీటికొరత ఏర్పడింది. ఆ దశలో గుంటూరుకు చెందిన తన మిత్రుడు, సేంద్రియ రైతు ప్రకాశ్‌రెడ్డి సలహా మేరకు.. జయచంద్రన్ తన ఉద్యాన తోటల మధ్యలో వాలుకు అడ్డంగా కందకాలు తవ్వించారు. అప్పుడు కందకాలు తవ్వటం వల్ల గత రెండు సంవత్సరాలుగా పెద్దగా వర్షాలు లేకపోయినా.. తోటల సాగుకు ఎటువంటి నీటి కొరతా లేకుండా సజావుగా దిగుబడులను అందుకోగలుగుతున్నానని జయచంద్రన్ ‘సాగుబడి’తో చెప్పారు. 200 వ్యవసాయ క్షేత్రంలో 5–6 ఎకరాలకు ఒక క్లస్టర్‌గా విభజించుకున్న జయచంద్రన్.. వేర్వేరు క్లస్టర్లలో ఉసిరి, మామిడి, కొబ్బరి, సపోట, బొప్పాయి, నిమ్మ, అరటి, మునగ తోటలను బయోడైనమిక్ సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. వీటితోపాటు 5 నుంచి 25 సంవత్సరాల్లో కోతకు వచ్చే అనేక జాతుల కలప చెట్లను వేలాదిగా పెంచుతున్నారు. వీటికి బిందు సేద్యం ద్వారా నీరందిస్తున్నారు. క్లస్టర్ల మధ్యలో మట్టి కట్టల వెంట 9 అడుగుల వెడల్పు, 6–7 అడుగుల లోతున కందకాలు తవ్వించారు. కందకాలలో ప్రతి వంద మీటర్లకు ఒక చోట చెక్ వాల్స్ నిర్మించారు. స్వల్ప ఖర్చుతో నిర్మించిన కందకాల ద్వారా వాన నీరంతా భూమిలోకి ఇంకడం వల్ల 27 బోర్లు, 6 పెద్ద వ్యవసాయ బావుల్లో నీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చింది. గత రెండేళ్లుగా నీటి కొరత సమస్యే లేదని జయచంద్రన్(96772 20020) తెలిపారు. సాక్షి, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం సంయుక్తంగా ‘చేను కిందే చెరువు’ పేరిట ఐదేళ్ల క్రితం నుంచి నిర్వహిస్తున్న ప్రచారోద్యమ స్ఫూర్తితోనే తన మిత్రుడు జయచంద్రన్కు కందకాల గురించి సూచించానని ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. -
బెంగళూరుకు ముంచుకొస్తున్న ముప్పు
బెంగళూరు: భారత ‘సిలికాన్ వ్యాలీ’ అయిన బెంగళూరు నగరాన్ని నీటి సంక్షోభం ముంచెత్తనుందా? మన దేశంలోనే మంచినీటి సమస్యను ఎదుర్కోబోయే తొలి నగరం బెంగళూరేనా? తాజాగా వెల్లడైన అధ్యయనాలు ఇదే హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దక్షిణాఫ్రికా రెండో ముఖ్యనగరమైన కేప్‌టౌన్‌లో త్వరలోనే నీళ్లు నిండుకోనున్నట్టు (భూగర్భజలాలు లేకపోవటం) ఇటీవలే ప్రచురితమైన ఓ కథనంపై ఆందోళన చెందుతుండగానే.. ప్రపంచవ్యాప్తంగా నీటిఎద్దడి ఎదుర్కోనున్న 11 నగరాల జాబితాను ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇందులో బ్రెజిల్ వాణిజ్య రాజధాని సావ్‌పాలో నగరం అగ్రస్థానంలో నిలిచింది. ఆశ్చర్యకరరీతిలో బెంగళూరు రెండోస్థానంలో నిలవగా, చైనా రాజధాని బీజింగ్ మూడోస్థానంలో, కైరో, జకార్తా, మాస్కో, ఇస్తాంబుల్ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. మెక్సికో సిటీ, లండన్, టోక్యో కూడా ఈ జాబితాలో ఉన్నాయి. జనాభా వృద్ధితో పాటు నీటి వనరుల సంరక్షణలో మానవ నిర్లక్ష్యం, వాతావరణ మార్పుల కారణంగా 2030 కల్లా ప్రపంచవ్యాప్తంగా నీటి డిమాండ్ 40శాతం పెరగనుంది. ప్రమాదాన్ని తప్పించుకోలేమా? బెంగళూరుతో పాటు దేశంలోని అనేక ప్రాంతాలు ముఖ్యంగా వివిధ పట్టణాలు, నగరాలు మంచినీటి కొరత ఎదుర్కుంటున్నాయి. అయితే ఈ పరిస్థితిని అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలు మాత్రం ఆశాజనకంగా లేవు. మురుగు నీటిని శుద్ధి చేసే సాంకేతికతను పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవాలి. నదుల ప్రక్షాళనకు పటిష్టమైన చర్యలతోపాటు స్థానిక పరిశ్రమలు, నివాస సముదాయాల ద్వారా నదులు మురికికూపాలుగా మారకుండా జాగ్రత్తపడాలి. పర్యావరణం, సహజ వనరులకు నష్టం కలగని విధంగా నిర్మాణ, ఇతర రంగాల అభివృద్ధి జరిగేలా చూసుకోవాలి. ఈ దిశగా ఏ సమస్య ఎదురైనా.. వెంటనే దానికి పరిష్కారం కనుగొనటంలో తాత్సారం వహించకపోవటం చాలా కీలకం. వర్షపు నీరు వృధా కాకుండా చూడాలి. చెరువుల్లోకి వర్షపు నీరు చేరేందుకున్న అడ్డంకులు, ఆక్రమణలను తొలగించాలి. బెంగళూరుకు ఎదురుకానున్న నీటి సమస్య భారత్‌లోని ఇతర నగరాలకు హెచ్చరికగా కనువిప్పు కలిగించాలని నిపుణులు చెబుతున్నారు. సమస్య ఏంటి? బెంగళూ రులో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు లేకపోవడం, కొరవడిన నగరాభివృద్ధి ప్రణాళికలను ప్రధాన సమస్యలుగా గుర్తించారు. మంచినీరు, మురుగునీటి వ్యవస్థలు సరిగా లేవు. ఫలితంగా భారీగా నీరు వృధా అవటం, ఉపయోగించలేనంత కలుషితంగా మారుతోంది. కొలను (చెరువు)ల నగరంగా పేరుపొందిన బెంగళూరులో ప్రస్తుతం ఒక్క చెరువులోని నీరు కూడా వినియోగించుకోలేని పరిస్థితిలో ఉండటం ఆందోళనకరమే. గతంలో నగర నీటి సరఫరాకు, భూగర్భజలాలు పెరిగేందుకు దోహదపడిన అనేక చెరువులు నేడు ఆక్రమణలకు గురయ్యాయి. -
‘క్యాడ్‌వామ్’తో చివరి ఆయకట్టుకూ నీరు
కొత్త పథకానికి కేంద్రం శ్రీకారం.. ఏప్రిల్ ఒకటి నుంచి అమలు సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల కింద నిర్ణయించిన ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగు నీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం క్యాడ్‌వామ్ (కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్) పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టుల కింద నిర్ణయించిన వాస్తవ ఆయకట్టుకు, సాగునీరు అందుతున్న ఆయకట్టుకు మధ్యన తేడా ఉన్నపక్షంలో దాన్ని పూడ్చేలా ఈ పథకాన్ని తెస్తోంది. ఏప్రిల్ ఒకటి నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. నీటి లభ్యత, ప్రాజెక్టు వ్యయం, సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టుల ఆయకట్టు నిర్ణయించినప్పటికీ సాంకేతిక కారణాలు, టెయిల్‌లాండ్ వంటి కారణాలతో కొంత ఆయకట్టుకు సాగునీరు అందదు. ఈ గ్యాప్ ఆయకట్టు ప్రతీ ప్రాజెక్టు పరిధిలో 25 శాతం మేర ఉంటుందని కేంద్రం అంచనా వేస్తోంది. దీన్ని సరి చేసేందుకు రూ.28 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ పథకం కింద ఆమోదించిన పనులకు కేంద్రం 60 శాతం నిధులు ఇవ్వనుండగా, మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఈ గ్యాప్ ఆయకట్టుకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని జూరాల, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు–1, అలీసాగర్, గుత్ప, డిండి, నిజాంసాగర్, ఆర్డీఎస్, కడెం, మూసీ, గుండ్లవాగు, ఆసిఫ్ నహర్, కోటిపల్లివాగు, నల్లవాగు, ఘన్పూర్ ఆనకట్ట, పోచారం, కౌలాస్‌నాలా, సాత్నాల, స్వర్ణ, వట్టివాగు, ఎన్టీఆర్ సాగర్, పీపీ రావు ప్రాజెక్టు, అప్పర్ మానేరు, శనిగరం, బొగ్గులవాగు, ముల్లూరువాగు, పాకాల చెరువు, పెద్దవాగు, సుద్దవాగు ప్రాజెక్టులను ఈ జాబితాలో చేర్చి నిధులు రాబట్టే యత్నాలు చేస్తోంది. -
కిన్నెరసాని .. రానంటోంది !
సాక్షి, ఖమ్మం : కిన్నెరసాని ప్రాజెక్టుతో బీడు భూములకు సాగు నీరు అందుతుందని ఆశించిన ఆయకట్టు రైతుల కల నెరవేరలేదు. భూసేకరణ పరిహారం, నిధుల విడుదల లేకపోవడంతో కాలువ పనులకు మోక్షం కలగడం లేదు. ఈ ప్రాజెక్టు కుడి కాలువ పూర్తి అయినా ఎడమ కాలువ పనులు మధ్యలోనే నిలిచాయి. భూసేకరణ పరిహారం విషయంలో గత ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం, పరిష్కారం దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే కొద్ది మొత్తం నిధులతో పూర్తయ్యే ప్రాజెక్టుల జాబితాలో నూతన ప్రభుత్వం కిన్నెరసానిని చేర్చడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురించాయి. కిన్నెరసాని ప్రాజెక్టులో ఏటా పుష్కలంగా నీరుంటుంది. కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్టుతోపాటు కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల దాహార్తిని ఈ ప్రాజెక్టే తీర్చుతుంది. జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో అప్పటి అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూ.36.54 కోట్లతో రూపకల్పన చేశారు. కిన్నెరసాని ప్రాజెక్టుకు సమీపంలోని పాల్వంచ, బూర్గంపాడు, కొత్తగూడెం మండలాల్లో సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కుడి, ఎడమ కాలువలను డిజైన్ చేశారు. కుడి కాలువ ద్వారా కొత్తగూడెంలోని 3 వేల ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో 7 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ప్రాజెక్టు పనులకు 2005 డిసెంబర్ 31న వైఎస్ శంకుస్థాపన చేశారు. నిబంధనల ప్రకారం ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా వైఎస్ మరణం తర్వాత ఈ పనులు నత్తనడకన సాగాయి. కేవలం కుడి కాలువ పనులే పూర్తి అయ్యాయి. ఎడమ కాలువ పనులు పూర్తి కాకున్నా ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా 2012 డిసెంబర్లో ముఖ్యమంత్రి కిరణ్‌కమార్‌రెడ్డి కుడి కాలువకు నీటిని వ దిలారు. దీనికి నిరసనగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినా ఫలితం లేకుండా పోయింది. నిలిచిన ఎడమ కాలువ పనులు... ఎడమ కాలువకు సంబంధించి 24.25 కిలోమీటర్ల మేరకు కాలువ తీయాలి. ప్రాజెక్టు నుంచి బూర్గంపాడు మండలం వరకు ఈ కాలువను తవ్వించాలి. అయితే ఇప్పటి వరకు కేవలం 19 కిలోమీటర్ల మేర మాత్రమే కాలువ పనులను అధికారులు పూర్తి చేయించారు. ఇంకో ఆరు కిలోమీటర్లు పూర్తి అయితే భూములకు సాగు నీరు అందేది. భూసేకరణే అసలు సమస్య... కాలువ నిర్మాణానికి భూ సేకరణ కూడా ప్రధాన సమస్యగా మారింది. నష్టపోయిన తమ భూములకు మార్కెట్ ధర ప్రకారం డబ్బు చెల్లించడం లేదని కొందరు రైతులు, తమ భూములను వదులుకునేందుకు ఇష్టం లేక మరి కొందరు అడ్డుకుంటున్నారు. బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతులు భూసేకరణ విషయంలో అభ్యంతరం చెప్పడమే కాక, కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇదే మండలంలోని టేకులచెరువు నుంచి లక్ష్మీపురం వరకు భూసేకరణ నిలిచింది. దీనికి తోడు మధ్యలో కొంత అటవీ శాఖ భూములుండగా.. వాటికీ ఇప్పటివరకు అనుమతులు రాలేదు. కాలువ మధ్యలో రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి ఆ శాఖకు రూ 2.25 కోట్లు చెల్లించిన అధికారులు అనుమతులు తెచ్చుకునప్పటికీ ఈ పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించారు. ఈ కాలువ పరిధిలో మొత్తం 10 పిల్ల కాల్వల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు నాలుగు మాత్రమే తవ్వించారు. పెరగనున్న అంచనా వ్యయం.. కొంతమేర నిధులు వెచ్చిస్తే పూర్తయ్యే ఈ పనులపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే ప్రాజెక్టు అంచనా వ్యయం గతంతో పోలిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరికొంత పెరిగే అవకాశం ఉంది. ఈ పనులను కాంట్రాక్టు తీసుకున్న ఆర్విన్స్ సంస్థ ప్రస్తుతం ఉన్న ధరలను పరిగణనలోకి తీసుకొని నిర్మాణ వ్యయం పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టింది. ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తే వచ్చే ఖరీఫ్ నాటికైనా సాగు నీరు అందుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
ఎంత నిర్లక్ష్యం.. ఏమిటీ దౌర్భాగ్యం?
సాక్షి ప్రతినిధి, కడప: ‘అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు’ అన్నట్లుగా ఉంది జిల్లా యంత్రాంగం తీరు. ఒకటిన్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సిన తెలుగుగంగ కెనాల్ దుస్థితి అందుకు అద్దం పడుతోంది. బ్రహ్మసాగర్‌కు చేరాల్సిన నీరు భూగర్భంలోకి వెళ్తున్నా పట్టించుకున్న నాధుడే లేడు. స్పందించిన ప్రజాప్రతినిధుల్ని సైతం నీరుగార్చే చర్యలకు పాల్పడుతున్న వైనమిది. తెలుగుగంగ కెనాల్ పరిధిలోని ఎస్ఆర్-1 కాలువ 98వ కిలోమీటర్ నుంచి 108 కిలోమీటర్ వరకూ లైనింగ్‌కు గండ్లు పడ్డాయి. అక్కడక్కడ పూడిక పేరుకుపోయింది. వెలుగోడు నుంచి సాగునీరు విడుదలకు యంత్రాంగం శ్రీకారం చుట్టింది. అయితే నీరు భూగర్భంలోకి ఇంకిపోతుందనే ఆందోళన ఆయకట్టుదారుల్లో మెండుగా ఉంది. విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, జయరాములు దృష్టికి తీసుకెళ్లారు. వారు రైతులతో కలిసి కాలువ పనులను పరిశీలించారు. వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే నీరంతా నిష్ర్పయోజనమవుతుందని అధికారులకు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాల్సిందిగా కోరారు. అయితే నిధుల్లేవని, ఇప్పుడే పనులు చేపట్టలేమని అధికారులు పేర్కొన్నారు. ఎమ్మెల్యేల అభ్యర్థన... ఎంపీ స్పందన తెలుగుగంగ కెనాల్‌ను గత బుధవారం పరిశీలించిన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అక్కడి నుంచే అధికారులకు ఫోన్లో వివరించారు. నిధులు లేవని జవాబు రావడంతో వెంటనే కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రూ.10లక్షలు గ్రాంటు ఎంపీ కోటా ద్వారా మంజూరు చేయాలని కోరారు. ఎంపీ వెంటనే జిల్లా కలెక్టర్ కేవీ రమణకు లేఖ రాశారు. తన నిధుల నుంచి తెలుగుగంగ కాలువలో 98 కిలోమీటరు నుంచి 108 కిలోమీటర్ వరకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. లెటర్ రెఫరెన్సు నెం.173/2014 ద్వారా కోరారు. అయితే ఎంపీ ఫండ్స్ కెనాల్‌కు ఖర్చు చేయరాదని పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి అభ్యర్థనను తిరస్కరించారు. మరీ ఇరిగేషన్ విభాగం నుంచి ఏమైనా ఖర్చుచేసి మరమ్మతులు నిర్వహిస్తారంటే అదీ లేదు. తెలుగుగంగ కె నాల్ 5వేల క్యూసెక్కులు సామర్థ్యంతో నిర్మించింది. ప్రస్తుతం 400 క్యూసెక్కులు వదిలితే కేవలం 150క్యూసెక్కులు మాత్రమే రాగలవని ఇంజనీరింగ్ అధికారులే వివరిస్తున్నారు. పూర్తి స్థాయి నీరు వదిలితే, గండ్లు పడక తప్పని పరిస్థితి. అలాంటి స్థితిలో శరవేగంగా నిర్వహించాల్సిన మరమ్మత్తుల్లో కూడ అధికారయంత్రాంగం నిర్లక్ష్యం వీడడంలేదని ఆయకట్టుదారులు వాపోతున్నారు. -
వంట కూడా చేసుకోలేక అవస్ధలు