బెంగళూరు: భారత ‘సిలికాన్ వ్యాలీ’ అయిన బెంగళూరు నగరాన్ని నీటి సంక్షోభం ముంచెత్తనుందా? మన దేశంలోనే మంచినీటి సమస్యను ఎదుర్కోబోయే తొలి నగరం బెంగళూరేనా? తాజాగా వెల్లడైన అధ్యయనాలు ఇదే హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దక్షిణాఫ్రికా రెండో ముఖ్యనగరమైన కేప్‌టౌన్‌లో త్వరలోనే నీళ్లు నిండుకోనున్నట్టు (భూగర్భజలాలు లేకపోవటం) ఇటీవలే ప్రచురితమైన ఓ కథనంపై ఆందోళన చెందుతుండగానే.. ప్రపంచవ్యాప్తంగా నీటిఎద్దడి ఎదుర్కోనున్న 11 నగరాల జాబితాను ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
ఇందులో బ్రెజిల్ వాణిజ్య రాజధాని సావ్‌పాలో నగరం అగ్రస్థానంలో నిలిచింది. ఆశ్చర్యకరరీతిలో బెంగళూరు రెండోస్థానంలో నిలవగా, చైనా రాజధాని బీజింగ్ మూడోస్థానంలో, కైరో, జకార్తా, మాస్కో, ఇస్తాంబుల్ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. మెక్సికో సిటీ, లండన్, టోక్యో కూడా ఈ జాబితాలో ఉన్నాయి. జనాభా వృద్ధితో పాటు నీటి వనరుల సంరక్షణలో మానవ నిర్లక్ష్యం, వాతావరణ మార్పుల కారణంగా 2030 కల్లా ప్రపంచవ్యాప్తంగా నీటి డిమాండ్ 40శాతం పెరగనుంది.
ప్రమాదాన్ని తప్పించుకోలేమా?
బెంగళూరుతో పాటు దేశంలోని అనేక ప్రాంతాలు ముఖ్యంగా వివిధ పట్టణాలు, నగరాలు మంచినీటి కొరత ఎదుర్కుంటున్నాయి. అయితే ఈ పరిస్థితిని అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలు మాత్రం ఆశాజనకంగా లేవు. మురుగు నీటిని శుద్ధి చేసే సాంకేతికతను పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవాలి. నదుల ప్రక్షాళనకు పటిష్టమైన చర్యలతోపాటు స్థానిక పరిశ్రమలు, నివాస సముదాయాల ద్వారా నదులు మురికికూపాలుగా మారకుండా జాగ్రత్తపడాలి.
పర్యావరణం, సహజ వనరులకు నష్టం కలగని విధంగా నిర్మాణ, ఇతర రంగాల అభివృద్ధి జరిగేలా చూసుకోవాలి. ఈ దిశగా ఏ సమస్య ఎదురైనా.. వెంటనే దానికి పరిష్కారం కనుగొనటంలో తాత్సారం వహించకపోవటం చాలా కీలకం. వర్షపు నీరు వృధా కాకుండా చూడాలి. చెరువుల్లోకి వర్షపు నీరు చేరేందుకున్న అడ్డంకులు, ఆక్రమణలను తొలగించాలి. బెంగళూరుకు ఎదురుకానున్న నీటి సమస్య భారత్‌లోని ఇతర నగరాలకు హెచ్చరికగా కనువిప్పు కలిగించాలని నిపుణులు చెబుతున్నారు.
సమస్య ఏంటి?
బెంగళూ రులో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు లేకపోవడం, కొరవడిన నగరాభివృద్ధి ప్రణాళికలను ప్రధాన సమస్యలుగా గుర్తించారు. మంచినీరు, మురుగునీటి వ్యవస్థలు సరిగా లేవు. ఫలితంగా భారీగా నీరు వృధా అవటం, ఉపయోగించలేనంత కలుషితంగా మారుతోంది. కొలను (చెరువు)ల నగరంగా పేరుపొందిన బెంగళూరులో ప్రస్తుతం ఒక్క చెరువులోని నీరు కూడా వినియోగించుకోలేని పరిస్థితిలో ఉండటం ఆందోళనకరమే. గతంలో నగర నీటి సరఫరాకు, భూగర్భజలాలు పెరిగేందుకు దోహదపడిన అనేక చెరువులు నేడు ఆక్రమణలకు గురయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment