సాక్షి, ఖమ్మం : కిన్నెరసాని ప్రాజెక్టుతో బీడు భూములకు సాగు నీరు అందుతుందని ఆశించిన ఆయకట్టు రైతుల కల నెరవేరలేదు. భూసేకరణ పరిహారం, నిధుల విడుదల లేకపోవడంతో కాలువ పనులకు మోక్షం కలగడం లేదు. ఈ ప్రాజెక్టు కుడి కాలువ పూర్తి అయినా ఎడమ కాలువ పనులు మధ్యలోనే నిలిచాయి. భూసేకరణ పరిహారం విషయంలో గత ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం, పరిష్కారం దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే కొద్ది మొత్తం నిధులతో పూర్తయ్యే ప్రాజెక్టుల జాబితాలో నూతన ప్రభుత్వం కిన్నెరసానిని చేర్చడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురించాయి.
కిన్నెరసాని ప్రాజెక్టులో ఏటా పుష్కలంగా నీరుంటుంది. కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్టుతోపాటు కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల దాహార్తిని ఈ ప్రాజెక్టే తీర్చుతుంది. జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో అప్పటి అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూ.36.54 కోట్లతో రూపకల్పన చేశారు. కిన్నెరసాని ప్రాజెక్టుకు సమీపంలోని పాల్వంచ, బూర్గంపాడు, కొత్తగూడెం మండలాల్లో సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కుడి, ఎడమ కాలువలను డిజైన్ చేశారు.
కుడి కాలువ ద్వారా కొత్తగూడెంలోని 3 వేల ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో 7 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ప్రాజెక్టు పనులకు 2005 డిసెంబర్ 31న వైఎస్ శంకుస్థాపన చేశారు. నిబంధనల ప్రకారం ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా వైఎస్ మరణం తర్వాత ఈ పనులు నత్తనడకన సాగాయి. కేవలం కుడి కాలువ పనులే పూర్తి అయ్యాయి. ఎడమ కాలువ పనులు పూర్తి కాకున్నా ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా 2012 డిసెంబర్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కమార్‌రెడ్డి కుడి కాలువకు నీటిని వ దిలారు. దీనికి నిరసనగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినా ఫలితం లేకుండా పోయింది.
నిలిచిన ఎడమ కాలువ పనులు...
ఎడమ కాలువకు సంబంధించి 24.25 కిలోమీటర్ల మేరకు కాలువ తీయాలి. ప్రాజెక్టు నుంచి బూర్గంపాడు మండలం వరకు ఈ కాలువను తవ్వించాలి. అయితే ఇప్పటి వరకు కేవలం 19 కిలోమీటర్ల మేర మాత్రమే కాలువ పనులను అధికారులు పూర్తి చేయించారు. ఇంకో ఆరు కిలోమీటర్లు పూర్తి అయితే భూములకు సాగు నీరు అందేది.
భూసేకరణే అసలు సమస్య...
కాలువ నిర్మాణానికి భూ సేకరణ కూడా ప్రధాన సమస్యగా మారింది. నష్టపోయిన తమ భూములకు మార్కెట్ ధర ప్రకారం డబ్బు చెల్లించడం లేదని కొందరు రైతులు, తమ భూములను వదులుకునేందుకు ఇష్టం లేక మరి కొందరు అడ్డుకుంటున్నారు. బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతులు భూసేకరణ విషయంలో అభ్యంతరం చెప్పడమే కాక, కోర్టును ఆశ్రయించారు.
దీంతో ఇదే మండలంలోని టేకులచెరువు నుంచి లక్ష్మీపురం వరకు భూసేకరణ నిలిచింది. దీనికి తోడు మధ్యలో కొంత అటవీ శాఖ భూములుండగా.. వాటికీ ఇప్పటివరకు అనుమతులు రాలేదు. కాలువ మధ్యలో రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి ఆ శాఖకు రూ 2.25 కోట్లు చెల్లించిన అధికారులు అనుమతులు తెచ్చుకునప్పటికీ ఈ పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించారు. ఈ కాలువ పరిధిలో మొత్తం 10 పిల్ల కాల్వల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు నాలుగు మాత్రమే తవ్వించారు.
పెరగనున్న అంచనా వ్యయం..
కొంతమేర నిధులు వెచ్చిస్తే పూర్తయ్యే ఈ పనులపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే ప్రాజెక్టు అంచనా వ్యయం గతంతో పోలిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరికొంత పెరిగే అవకాశం ఉంది. ఈ పనులను కాంట్రాక్టు తీసుకున్న ఆర్విన్స్ సంస్థ ప్రస్తుతం ఉన్న ధరలను పరిగణనలోకి తీసుకొని నిర్మాణ వ్యయం పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టింది. ఈ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తే వచ్చే ఖరీఫ్ నాటికైనా సాగు నీరు అందుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
కిన్నెరసాని .. రానంటోంది !
Published Thu, Sep 11 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM
Advertisement