వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్‌లో ఇంకుడు గుంతకు మెరుగులు దిద్దుతున్న కార్మికులు
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న దాదాపు 15 వేల ఇంకుడు గుంతలకు ఒకేరోజు మరమ్మతులు చేసే కార్యక్రమం ‘వాటర్ హార్వెస్టింగ్ డే’ను శనివారంనిర్వహించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి సంయుక్తంగా చేపట్టే ఈ మరమ్మతుల కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం కావాల్సిందిగా ఆయన నగర ప్రజలకు బహిరంగ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఆ లేఖ సారాంశం ఏంటంటే..
‘‘మనిషికే కాదు.. సృష్టిలోని ప్రతిజీవికీ నీరు ప్రాణాధారం. నీరు లేకపోతే ప్రపంచమే లేదు. భూమి మీదున్న నీటిలో 97 శాతం సముద్రం నీరున్నప్పటికీ ఆ నీరు తాగటానికి పనికిరావు. మరో 2 శాతం నీరు మంచు పర్వతాల రూపంలో గడ్డకట్టుకుని ఉంది. ఈ నీరు కూడా తాగడానికి పనికి రాదు. ఇక మిగిలింది కేవలం 1 శాతం మాత్రమే. ఈ నీరే భూ ప్రపంచంలోని సకల జీవరాశులకు ఆధారం. పెరుగుతున్న జనాభా అవసరాలకు ఈ నీరు సరిపోవడంలేదు. ప్రపంచంలో ప్రస్తుతం 165 దేశాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. దక్షిణాఫ్రికాలోని కేఫ్‌టౌన్ నగరం నీరు లేని తొలి నగరంగా చరిత్రలో నిలిచిపోయింది. మన దేశంలోని పలు ప్రాంతాలు కూడా నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఈ దుస్థితి నుండి బయట పడాలంటే నీటిని సంరక్షించుకోవడం మినహా మరో మార్గం లేదు. ఏటా కురిసే వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా తిరిగి భూమిలోకి ఇంకింప చేసినప్పుడు నీటి బాధలు ఉండవు.
హైదరాబాద్ నగరంలో సుమారు 11 వేల ఇంకుడు గుంతల్ని జీహెచ్‌ఎంసీ, జలమండలి వివిధ సందర్భాల్లో నిర్మించాయి. పలు భవనాల పరిసరాల్లో, బహిరంగ ప్రదేశాలు, పార్కులు, రహదారులకు ఇరువైపులా రీచార్జ్ గుంతలు నిర్మించారు. ఇంకా ప్రభుత్వ సంస్థలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఇళ్ల యజమానులు, కాలనీ వాసులు, గేటెడ్ కమ్యునిటీల్లో నిర్మించిన ఇంకుడు గుంతలు ఎన్నో ఉన్నాయి. అయితే వీటి నిర్వహణలో చాలా లోపం ఉందని గుర్తించాం. వీటిని నిర్మించినప్పుడున్న సంతోషం నిర్వహణలో కనిపించడం లేదు. చెత్తా చెదారంతో నిండిపోయాయి. ముఖ్యంగా పలు కాలనీల్లోని ఇంకుడు గుంతలను ప్రజలు పట్టించుకోవడం లేదు. వర్షపు నీటిని సంరక్షించే గొప్ప ఆశయంతో నిర్మించిన ఈ ఇంకుడు గుంతల్లో ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ సీసాలు పడేస్తున్నారు. చెడిపోయిన వస్తువులను ఇందులోకి విసిరేస్తున్నారు. దుమ్ము ధూళిని ఇందులోకి నెట్టివేస్తున్నారు. చెట్లు, చేమలు, పిచ్చి మొక్కలు ఈ గుంతల్లో పేరుకుపోతున్నాయి. పేరుకుపోతున్న మట్టి, బురదతో క్రమంగా ఆ ఇంకుడు గుంతలనీ రోడ్డు లెవెల్‌కు రావడం వల్ల పారుతుండే వర్షపునీరు ఇందులోకి వెళ్లకుండా వృథాగా పోతోంది. దీంతో ఒక లక్ష్య సాధనతో నిర్మించిన ఇంకుడు గుంతల ప్రయోజనం నెరవేరడం లేదు.
మనమేం చేయాలి..?
రుతుపవనాలు ప్రారంభమయ్యే నాటికి ఈ ఇంకుడు గుంతల నిర్వహణను ఒకేరోజు పెద్ద ఎత్తున చేపట్టి వాటిని తిరిగి యథాస్థితికి తేవడానికి జీహెచ్‌ఎంసీ, జలమండలి సంయుక్తంగా నడుం బిగించాయి. ఇందుకోసం ఈ రెండు శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది అన్ని కాలనీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇంకుడు గుంతల పునరుద్ధరణ కార్యక్రమాన్ని నేడు (శనివారం) చేపడుతున్నారు. పలు కాలనీల్లో వివిధ ప్రదేశాల్లో నిర్మించి జియో ట్యాగింగ్ చేసిన ఇంకుడు గుంతలను అధికారుల బృందం సాంకేతిక సిబ్బందితో సందర్శిస్తుంది. అక్కడి కాలనీవాసుల సహకారంతో పాడైపోయిన, చెత్త చెదారంతో నిండి ఉన్న ఇంకుడు గుంతలను శుభ్రం చేయడం, పిచ్చి మొక్కలను ఏరివేయడం, తగినంత ఇసుకతో తిరిగి నింపడం జరుగుతుంది. ప్రతి వర్షాకాలం ముందు ఇసుక పొరను మార్చడం వల్ల వర్షపు నీరు ఆ ఇంకుడు గుంతలోకి సులభంగా చేరుతుంది.
భూమిపై పడే ప్రతి వర్షపు నీటి చుక్కను ఇంకుడు గుంతల ద్వారా తిరిగి భూమిలోకి ఇంకే విధంగా చేయడం వల్ల ఆ పరిసర ప్రాంతమంతా నీటి నిలువ ఉంటుంది. భూగర్భ జలాలు పెంపొందుతాయి. తద్వారా అక్కడ నీటి ఎద్దడి ఉండదు. ప్రజలు తమ తమ ప్రాంతాల్లో నిర్మించిన ఇంకుడు గుంతలను శుభ్రం చేసుకోవాలి. స్వయంగా ఇంట్లో నిర్మించుకుని నిర్వహణ చేపట్టాలి. ఇంకుడు గుంతలను ప్రక్షాళన చేసుకోవడం ద్వారా బోర్లు ఎండిపోయే పరిస్థితి ఉండదు. ప్రతి వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భంలోకి పంపిస్తే పుడమి తల్లి పులకరిస్తుంది. కాలనీల్లో నిర్మించిన ఇంకుడు గుంతలను ఆయా కాలనీవాసులు ఒకసారి పరిశీలించాలి. చెత్త చెదారంతో ఉన్న గుంతలని శ్రమదానంతో తీసివేసి రాబోయే వర్షపు నీటికోసం అవి పనిచేసే విధంగా సిద్ధం చేసుకోవాలి.
ఒక సదాశయంతో జీహెచ్‌ఎంసీ చేపట్టిన ఈ పనిలో పాల్గొనేందుకు ప్రజలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. రాబోయే రోజుల్లో నీటికోసం ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ వాటర్ హార్వెస్టింగ్ డే కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం’’.– ఎం.దానకిషోర్, ఐఏఎస్,కమిషనర్ (జీహెచ్‌ఎంసీ)
Comments
Please login to add a commentAdd a comment