ఊరెళ్తే..ఊడ్చేశారు
కిటికీ తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు
రూ. 4 లక్షల విలువైన బంగారం, వెండి అపహరణ
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి
ఇంటి యజమాని కమర్షియల్ ట్యాక్స్‌లో అసిస్టెంట్ కమిషనర్
ఒంగోలు క్రైం: నగరంలోని కర్నూలు రోడ్డు, ముంగమూరు రోడ్డుకు మధ్య ఉన్న సుందర్ నగర్‌లో ఓ ఇంట్లో దొంగలు చేతివాటం చూపారు. ఆ ఇంటి యజమాని కుటుంబ సమేతంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బయట శుభ్రం చేసేందుకు పనిమనిషి వచ్చింది. ఇంటి కిటికీ తొలగించి ఉండటాన్ని ఆమె గమనించింది. వెంటనే హైదరాబాద్‌లో ఉన్న యజమాని ఆర్.సదానందరావుకు విషయం చెప్పింది. హుటాహుటిన ఆయన బయల్దేరి బుధవారం మధ్యాహ్నానికే ఒంగోలు చేరుకున్నారు. తలుపులు తీసి లోనికి వెళ్లగా ఇల్లు మొత్తం చిందరవందరగా కనిపించింది. ఇంట్లో దొంగతనం జరిగిందని గ్రహించి ఒంగోలు తాలూకా సీఐ ఎస్.ఆంటోనిరాజ్‌కు ఫిర్యాదు చేశారు.
ఆయన వెంటనే తన సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. దొంగతనం చేసిన తీరును గమనించారు. ఇంటి యజమాని నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. దొంగలు ప్రహరీ దూకి లోనికి ప్రవేశించి కిటికీ తొలగించారు. అత్యంత చాకచక్యంగా కిటికీకి ఉన్న ఇనుప బద్దెలు విరగ్గొట్టారు. ఇనుప ఫ్రేమ్‌ను కూడా బయటకు లాగేశారు. అనంతరం లోనికి ప్రవేశించి బీరువా తాళాలు పగులగొట్టారు. అందులోని 12 సవర్ల బంగారు ఆభరణాలు, అర కేజీ వెండి వస్తువులు అపహరించుకుపోయారు. మూడు బెడ్‌రూముల్లోని అన్ని అలమరాలు చిందర వందర చేశారు. అనంతరం ఇంటి వెనుక తలుపు తీసుకొని దర్జాగా బయటకు వెళ్లిపోయారు. సంఘటన స్థలాన్ని ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ కేశన వెంకటేశ్వరరావులు వచ్చి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తుపై తాలూకా పోలీసులకు పలు సూచనలు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆంటోనిరాజ్ తెలిపారు.