భార్య మృతిని తట్టుకోలేక భర్త దారుణం | Father and Son Suicide attempt in Ongole | Sakshi
Sakshi News home page

భార్య మృతిని తట్టుకోలేక భర్త దారుణం

Published Sat, Jan 30 2021 8:07 AM | Last Updated on Sat, Jan 30 2021 3:45 PM

Father and Son Suicide attempt in Ongole - Sakshi

సాక్షి, ప్రకాశం: భార్య మృతితో మనస్తాపానికి గురైన భర్త ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి, ఓ కుమారుడు మృతి చెందగా మరో బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. ఎలుకల మందు మజాలో కలిపి తాగి బలవన్మరణానికి ఒడిగట్టారు. పెద్ద కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఒంగోలు మిలటరీ కాలనీకి చెందిన తన్నీరు అంకమ్మ రాజు (36) బేల్దారి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఈయన భార్య కల్యాణి గతేడాది క్యాన్సర్‌తో మృతి చెందింది. అప్పటి నుంచి తండ్రి కొడుకుల జీవనం కష్టంగా మారింది.

పెద్ద కుమారుడు వంశీకృష్ణ ఆరో తరగతి, చిన్న కుమారుడు ముకుంద కృష్ణ (11) ఐదో తరగతి చదువుతుండేవాడు. కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూత పడడంతో పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. అయితే రెండు నెలలుగా పనులకు కూడా వెళ్లకుండా రాజు ఉన్న డబ్బుతో పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున రాజు తన సోదరుడు మధుకు ఫోన్‌చేసి తాను, పిల్లలు ఇద్దరు మజా బాటిల్‌లో ఎలుకల మందు కలిపి తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. వారి ఇంటి సమీపంలోనే ఉంటున్న మధు వెంటనే వచ్చి చూడగా ముగ్గురు అపస్మారక స్థితిలో ఉన్నారు.

వెంటనే వారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ రాజు మృతిచెందాడు. అయితే చిన్న కుమారుడు ముకుంద కృష్ణ (11) పరిస్థితి విషమంగా ఉండడంతో బైపాస్‌ సమీపంలోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తీసుకెళ్లిన కొద్దిసేపటికే కృష్ణ కన్నుమూశాడు. వంశీకృష్ణ పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారో ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. వంశీకృష్ణ కోలుకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement