గుణదల(విజయవాడ తూర్పు): చిట్టితల్లి అల్లరి ముద్దుగా పెరుగుతోంది.. చదువుల ఒడిలో సేదతీరుతోంది.. తల్లిదండ్రుల చెంత అల్లరిముద్దగా పెరుగుతోంది.. ఆనందంగా ఉన్న కుటుంబాన్ని క్యాన్సర్ మహమ్మారి వెంటాడింది.. చిట్టితల్లి అనారోగ్యానికి గురికావడంతో వైద్య పరీక్షలు చేయించడంతో వ్యాధి నిర్ధారణ అయింది. చిన్నారిని కాపాడుకునేందుకు తల్లిదండ్రులు కష్టపడుతున్నారు..
వివరాలు.. ప్రసాదంపాడుకు చెందిన జుజ్జవరపు సురేష్ కుమార్ (45), దుర్గాభవాని దంపతులు విజయవాడ సీతారామపురం ప్రాంతంలో స్టేషనరీ షాపు నిర్వహిస్తున్నారు. వీరికి కుమార్తె భాగ్యశ్రీజిత ఉంది. ప్రస్తుతం శ్రీజిత గుణదల సెయింట్ జాన్స్ పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఇటీవల కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆస్పత్రిలో చూపించారు. పరీక్షలు చేసిన వైద్యులు మైలో మోనో సైటిస్(బ్లడ్ క్యాన్సర్) ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధి చికిత్సకు సుమారు రూ.20 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు.
ప్రస్తుతం శ్రీజిత తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఆర్థిక స్తోమత లేనందున తమ బిడ్డను బతికించుకునేందుకు ఆ తలిదండ్రులు దాతల కోసం ఎదురు చూస్తున్నారు. పొరుగు రాష్ట్రం కావడంతో ఆరోగ్యశ్రీ వర్తించే అవకాశం లేదని చెబుతున్నారు. ఇప్పటికే గుణదల సెయింట్ జాన్స్ పాఠశాల విద్యార్థులు తోటి విద్యార్థిని కోసం విరాళాలు సేకరిస్తున్నారు. దాతల సహకారంతో చిన్నారి శ్రీజిత ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుతున్నారు. దాతలు 9948811911 నంబర్‌లో సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment